test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసూరమ్మామ్మ

24 మే, 2026

suramma
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 24, 2026, 10:47 పూర్వాహ్నం | 7 నిమిషాల చదవడం

“ఒరేయ్! ఎలా ఉన్నావ్ రా?” ,”ఏమేవ్ నువ్వు శారదవేనా?! ఎంత మారిపోయావే?” “సుబ్బారావ్! ఇన్నాళ్ళూ ఏమైపోయావ్ రా! అసలు నేను గుర్తున్నానా నీకు, మనిద్దరం ఒకే బెంచిలో పక్కపక్కనే కూర్చునే వాళ్ళంకదరా!” “ఓయ్ శీను నువ్వేం చేస్తున్నావ్ రా?” “టీచర్ గారూ! నమస్కారమండి నేను దక్షిణామూర్తిని! గుర్తున్నానండి, ఇవాళ మేమిలా ఉన్నామంటే! దానికి మీరే కారణమండి.” ఇలా ఒకరికొకరు పలకరింపులు, ఆత్మీయ ఆలింగనాలు, గురువందనాలతో ఆ ప్రాంతమంతా తడిసి ముద్దయిపోతోంది. వాళ్లంతా ముప్పైయేళ్ల క్రితం ఈ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. చాలాకాలం తర్వాత చదువుకున్న బడిలో ‘పూర్వ విద్యార్థుల కలయిక’ని ఇవేళ జరుపుకుంటున్నారు. వాళ్ల ఆనందానికి అవధుల్లేవు. ఎటు చూసినా పలకరింపులూ, పులకరింతలూ. ఏవేవో అనుబంధాలు వాళ్లందర్నీ కట్టిపడేస్తున్నాయి. వృద్ధాప్యంలో ఉన్న గురువులకి తమ గురించి తాము గుచ్చి గుచ్చి గుర్తు చేస్తూ నమస్కరిస్తున్నారు. ఆశ్చర్యం, ఆనందం, అబ్బురం, ఉద్వేగం అన్నీ కలిపి మాటలకందని మహోన్నతమైన హృదయోత్సవం అక్కడ జరుగుతోంది. ఒక్కొక్కరూ వేదికమీంచి తమ జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్నారు. ఆ అనుభూతుల ప్రవాహంలో జోగుతూనే శ్రీనివాస్ దృష్టి యథాలాపంగా మెట్ల కిందున్న కొబ్బరి చీపిరికట్ట మీదకి మరలింది…

సరిగ్గా 30 ఏళ్ల క్రితం. తను ఐదో తరగతి పూర్తిచేసుకుని, ఆరులో చేరడానికి అన్నయ్యతో కలిసి హైస్కూల్ కి వచ్చాడు శ్రీనివాస్. అక్కడ విశాలమైన మైదానం రెండంతస్తుల పొడవాటి పెద్ద భవనం. విద్యార్థులు ఒకవైపు వెళ్లేవారు వెళ్తున్నారు, కొందరు వస్తున్నారు. అంతా హడావిడి. కొత్త వాతావరణం.. శ్రీనివాస్ కి ఈ హై స్కూల్ ని చూడగానే మనసులో కొంత కంగారు పుట్టింది. నడుచుకుంటూ వాళ్ళిద్దరూ కాస్త లోపలికి వెళ్లారు. ఓ ముసలావిడ కనిపించింది. ఆమె తనదైన లోకంలో చీపురుతో తుడిచేసుకుంటోంది. ఒంగిపోయిన నడుం, తెల్లటి చీర కట్టుతో ఉన్న ఆమె ఎందుకో అక్కడున్న వాళ్లందరి కంటే ప్రత్యేకంగా కనిపించింది. ఉపాధ్యాయులు కొందరు క్లాసులకు వెళుతున్నారు. హాజరు పుస్తకాలతో మరికొందరు క్లాసుల్లోంచి తిరిగొస్తూ ఓ గదిలోకి వెళుతున్నారు. ఒకాయన గుయ్ మని విజిల్ వేశాడు. పిల్లలంతా పరుగు లంఘించుకున్నారు. కంగారులో వాళ్లు గుద్దుకుని మరీ వెళ్లిపోతున్నారు. ఈల వేసిన బక్కపలచటాయన డ్రిల్లు మాస్టారు రాజుగారిని తర్వాత తెలిసింది. అంతకుముందే కాకి రంగు నిక్కరు వేసుకుని, కోలముక్కుతో ఉన్న మరొకాయన ఠంగున గంట కొట్టి, లోపలికి వెళ్లిపోయాడు. స్కూలంతా బిజీ బిజీగా ఉంది. ఐదో తరగతి వరకూ చిన్న బడిలో చదివిన శ్రీనివాస్ కి ఇక్కడ తతంగమంతా గందరగోళంగానే అనిపించింది. అక్కడ ఆ ముసలావిడ ఒక్కతే కాస్త నిర్మలంగా ఉన్నట్టు అనిపించింది. శ్రీనివాస్ వాళ్ళ అన్నయ్య ఆమె దగ్గరకెళ్ళి “అమ్మా ఆరో తరగతిలో చేరాలంటే! ఎక్కడికి వెళ్లాలి?” అని అడిగాడు. వెంటనే ఆమె దగ్గర నుంచి సమాధానం రాలేదు. “ఈ ముసలాడివికి వినిపించదేమో?”అనుకునేసరికే ఒంగుని తుడుస్తున్నామె చేతిలో చీపిరికట్టతో రెండవ గది వైపు చూపించింది. అది హెడ్మాస్టర్ కం ఆఫీస్ గది. అలా ఆరులో చేరిన శ్రీనివాస్ కి ఆ హైస్కూల్లో తారసపడిన తొలి వ్యక్తి ఆమె.

అప్పటికే ఆమె వయసు ఏడుపదులు మించి ఉంటుంది. ఆమెని నలుపు అనలేంకానీ చామనఛాయ కంటే కాస్త ఛాయ తక్కువే! విశాలమైన ముఖం. ముక్కుకి బేసరు, చెవులకు దిద్దులు, తెల్లగా పండిపోయిన తల వెనుక చిన్న కొప్పుముడి, మొల్లోకి దోపిన కొంగు, కచ్చా పోసిన తెల్లని నేతచీర కట్టు ఆమెది. పొద్దుతో పోటీపడి ఎప్పుడు వచ్చేదో తెలియదు కానీ, పిల్లలు బడికి వచ్చేసరికి 14 గదులు, వరండాలు చుట్టూతా ఖాళీ స్థలము, ఆవరణ.. అంతా తుడిచేసి, బాత్రూములలో కుండీలు, తాగునీటి డ్రమ్ములు నింపేసేది. హ్యాండ్ పైపు కొట్టి బిందెలు నింపుకొని, దూరం నుంచి నీళ్లు మోసుకురావాలి. కిందా పైనా కడుగుళ్ళు కూడా పూర్తి చేసేసేది. చెమటలు చిందించినా? ఆమెలో ఎక్కడా అలసట, నిట్టూర్పు కనిపించేది కాదు. స్కూల్లో ఆవిడ ముఖం చూసింది తక్కువే. ఎందుకంటే! ఆమె ఒంగి తుడుసుకుంటూ ఎప్పుడూ పనిలో నిమగ్నమయ్యే కనిపించేది. ఆవిడ మొల్లో తీగరింగుకి తాళం చెవులు గుత్తులు గుత్తులుగా గుచ్చుకొని, వంగి తుడుస్తూంటే
వడ్డాణానికి వేలాడుతున్న మువ్వల్లా అనిపించేవి. హెడ్మాస్టర్ గదిలో బీరువాల దగ్గర నుంచి, రికార్డు పెట్టెలు, ఆఫీసు రూము, క్లాస్ రూములు, బాత్రూములు, మెయిన్ గేటు ఇలా అన్ని తాళం కప్పలకి ‘కీ’లు ఆమె మొల్లోనే ఉండేవి. వాటిపై నెంబర్లు లేకపోయినా? చూపు సరిగా కానరాకపోయినా? చేతులు వణుకుతున్నా? ఏది? ఏ గది తాళమో? ఏ తాళం ఎన్ని చుట్లు తిప్పాలో? దేన్ని ఎలా తీయాలో! ఆమె ఒక్కరికే ఎరుక. ఏదైనా క్లాసులో పిల్లలు కాగితాలు చింపేరా? వాళ్ల పనైపోయినట్టే లెక్క. మర్నాడు ఫస్ట్ పీరియడే క్లాస్ గుమ్మంలో చీపిరి కట్టతో ప్రత్యక్షమయ్యేది. “యాండి మేష్టారూ! పుస్తకాలన్నీ చింపేసి, గంపెడు తుక్కు చేశారు. నిన్న సాయంత్రం
ఎత్తలేక చచ్చిపోయాను, మాస్టారు మీరు గట్టిగా చెప్పండి!” అని కంప్లైంట్ చేసేది. “అదేం రోగమో! ఇంటికాడోళ్ళు పుస్తకాలు చదువుకోమని కొంటున్నారా? చింపమని కొంటున్నారా? ఈసారి ఎవరైనా కాయితాలు చింపినట్టు నాగ్గాని కనిపించాలి! ఒక్కొక్కరిని చీపిరి తిరగేసి నడుమమ్మటా పెట్టేస్తాను” అని ఆ క్లాస్ పిల్లల్ని మందలించి వెళ్ళేది. ఆవిడి వచ్చి వెళ్ళిన తర్వాత మిగతా పని క్లాస్ మాస్టారు చూసుకునేవారు.”ఒరేయ్ తుక్కేయకండిరోయ్! మామ్మొస్తద”నే భయం పిల్లలందరలోనూ ఉండేది. నిజానికి ఇప్పటికీ ఎప్పుడైనా పుస్తకంలో కాగితం చింపుతూంటే ఆ మామ్మే గుర్తొస్తది.. అంటే అతియోక్తి కాదు. కుండీ దగ్గర మంచినీళ్లు ఒలకబోసినా, స్కూల్లో చెత్త వేసినా, బెంచీలపై దూకినా, తలుపులు, కుర్చీలు శబ్దం చేస్తూ లోపల ఆటలాడినా, గంతులేసినా! ఏమాత్రం ఊరుకునేది కాదు. “ఒరేయ్.. ఎవర్రా? చీపిరి కట్ట పట్టుకురానా?” అని గట్టిగా గర్జించేది. అక్కడున్న పిల్లలు మెల్లగా జారుకునేవారు. కాస్త నడుం పైకి లేపి కేకలు వేసినప్పుడే ఆమె ముఖం కనిపించేది. నిజానికి ఆవిడ కోప్పడం తప్పా! ఎప్పుడూ ఎవరి మీదా చేయి వేసిన సందర్భమేలేదు. చుట్టుపక్కల చాలా ఊళ్ళకి ఇదే హైస్కూల్ కావడంతో ఇందులో చదువుకునే విద్యార్థులు వేయికి పైబడే. రోజూ ఒక్కరో ఇద్దరో ఏదో తరగతి గదిని పాడు చేసేవారు. ఇస్సుకుంటూనో… నసుకుంటూనో ఆమె గదంతా కడిగి, శుభ్రం చేసి, ఆరబెడితే గానీ మళ్లీ తరగతి జరిగేది కాదు. అప్పటికింకా మంచినీళ్లు సీసాలతో తెచ్చుకొనే దుస్థితి రాలేదు. సార్లకి, టీచర్లకి మంచినీళ్లు, టీ, టిఫిన్ పొట్లాలు కూడా ఆమే అందించేది. ఆ వయస్సులో కూడా రోజూ అన్నిసార్లు ఓపికతో మెట్లెక్కి, దిగడం తలుచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యమే!
ఒకసారి ఎనిమిదవ తరగతిలో క్లాస్ టీచర్ హిమబిందు మేడం గారు హాజరు వేస్తున్నారు. అదే టైంలో ఆమె చీపురు పట్టుకుని వరండాలోంచి నడుచుకుంటూ వెళ్తోంది. ఆమె తలకి పెద్ద బ్యాండేజ్ కట్టు ఉంది. టీచరుగారు పిలిచి “మామ్మా! ఏమైంది? ఆ కట్టేంటి?” అనడిగారు, “ఏమీ లేదమ్మా! నిన్న రాత్రి అటకమీంచి పుల్లలు తీస్తుంటే ఎదురుగడ గుచ్చుకుపోయింది. బొడాబొడా రక్తం కారి పోతుంటే.. మా పిల్లాళ్ళు కంగారుపడి, గుర్రాల డాక్టర్ గార్ని తీసుకొచ్చారు. ఆయన కుట్లేసి కట్టు కట్టాడు. ఇంకొంచెం కిందకైతే కన్ను పోయేది అన్నాడు” అని చెప్పింది.
“అయ్యో! ఇవాళకు సెలవు తీసుకోవచ్చు కదా!” అన్నారు మేడమ్ సానుభూతితో. “నే రాకపోతే తాళాలు ఎవరు తీస్తారమ్మా? పర్వాలేదు, ఇప్పుడు బానే ఉందండి” అంది మామ్మ. “పోనీ సాయంత్రం గదులు పిల్లలతో తుడిపించేద్దాం!”అన్నారు టీచర్. “వద్దమ్మా! పిల్లలు చీపురు కట్టలు పాడు చేసేస్తారు.” అని చెప్పేసి వెళ్ళిపోయింది మామ్మ.
ఒకసారి వీరవరం నుంచి గుర్రం బండి మీద స్కూలుకి వచ్చే లలిత దిగుతూ ఉన్నప్పుడు చక్రం శీల చేతికి తగిలి చీరుకుపోయింది. రక్తం బాగా కారిపోతుండడంతో పిల్లలు, టీచర్లు బాగా కంగారు పడుతున్నారు. మామ్మ రక్తాన్ని శుభ్రంగా కడిగేసి, స్కూల్లో ఉన్న సూపుమందు రాసేసి గాజుగుడ్డ కట్టేసి చాలా చురుగ్గా ఫస్ట్ ఎయిడ్ చేసేసింది. పెన్నులు, పుస్తకాలు, బాక్సులు, బ్యాగ్లు వగైరా స్కూల్లో ఏమి మర్చిపోయినా మర్నాడు మామ్మ దగ్గరికి వెళితే! భద్రంగా అట్టేపెట్టి ఇచ్చేది. దొరికిన డబ్బులు కూడా దాచిపెట్టి ఎవరివో గాలించి మరీ వారికి అందించేది. సాయంత్రం బడైపోయాక గదులు ఊడ్చేటప్పుడు పిల్లల పారేసుకున్న చిల్లరి డబ్బులు దొరికితే చీర కొంగుకి కట్టుకొని, ఎవరూ లేకపోయినా హెడ్మాస్టర్ టేబుల్ మీద వాటిని పెట్టేసి తాళాలు వేసుకొని, ఇంటికెళ్ళేది. పొట్టకూటి కోసం ఆ వయసులో కూడా పాచిపని చేసే ఆమె నిజాయితీకి నిలువుటద్దం. ఐదేళ్ల శ్రీనివాస్‌ హైస్కూల్ చదువులో ఆమె ఒక్కరోజూ సెలవు పెట్టిన దాఖలాలు లేవు. దసరా సెలవలకి ముందు హెడ్మాస్టర్ సూర్యనారాయణ గారు ఆమెను వెంటపెట్టుకుని క్లాస్ క్లాస్ కి వచ్చి ” ఒరే! పిల్లలూ మన మామ్మకి ప్రభుత్వ జీతం లేదు. స్కూల్ ఫండ్ నుంచే రెండొందలిస్తున్నాము. మామ్మ.. స్కూలుకి బోలెడు చాకిరీ చేస్తోంది. ఎంతిచ్చినా ఆవిడ రుణం తీరదు. అందరూ ఎంతోకొంత దసరా మామూలు తీసుకొచ్చి ఇవ్వండి!”అని చెప్పేసి వెళ్లిపోయేవారు. ఆ వయసులో ఆ మాటల విలువ తెలియకపోవటమో? లేక అప్పట్లో డబ్బులు లేకపోవటమో? చాలామంది ఇచ్చేవారు కాదు. ఆ కోవలో శ్రీనివాస్ కూడా ఒకడు. పదో తరగతి పాసై , సర్టిఫికెట్ తీసుకెళ్తూ శ్రీనివాస్ చివరగా ఆమెను చూసిన గుర్తు. అదీ కూడా లీలగా…

school

గతాన్ని జోగుతున్న శ్రీనివాస్ చూపులు చీపిరి కట్ట నుంచి వర్తమానంలోకి తేరుకున్నాయి.”ఎప్పుడో పుట్టి, ఎక్కడో పుట్టి, ఇక్కడే కలిశాం! చదువులమ్మ చెట్టు నీడలో” అంటూ సౌండ్ బాక్స్ రీమిక్స్ పాటలకి తధాత్మతా భావంతో స్టెప్పులు వేస్తున్నారు ఆ పాత మిత్రులు. ఇంకొందరైతే కాలం తెలియకుండా కరువు తీరా మాట్లాడేసుకుంటున్నారు. అంతకుముందే తమ మధ్య నుంచి దూరమైన గురువులు, మిత్రులు, ఇతర సిబ్బందిని గుర్తుచేసుకుంటూ వాళ్లున్న ఫోటోల ఫ్లెక్సీని ఆవిష్కరించి, వేదిక మీద అలంకరించారు. వందనాలతో గురువులందరికీ ఘన సన్మానం జరిగింది. తమ బ్యాచ్ లో ఉన్నత స్థానాల్లో ఉన్న మిత్రులకీ అభినందన సత్కారాలు చేస్తూ ఉన్నారు. శ్రీనివాస్ లో ప్రశ్నల ప్రకంపనలవుతున్నాయి. “బడికీ మనకీ ఇంత సేవచేసిన మామ్మేదీ? ఆవిడ ప్రస్తావన లేకుండా జరుగుతున్న ఈ గెట్ టు గెదర్ సంపూర్ణమేనా?” అనిపించింది. మెల్లగా అక్కడ నుంచి లేచి, ఆ స్కూల్ ఆఫీస్ రూమ్ కి వెళ్ళాడు. “ఇక్కడ ఒక స్వీపర్ మామ్మ పనిచేసేది ఆమె ఏది?” అని అడిగాడు.
దూరంగా కనిపిస్తున్న మూల రూము చూపించారు. గదిలో సామాను సర్దుతూ పనిలో ఉంది స్వీపర్. ఆవిడా ముసలావిడే! కానీ ఆ మామ్మ కాదు.” అమ్మా ఇక్కడ
తుడిసె ఒక మామ్మగారు ఉండాలి” అడిగాడు శ్రీనివాస్. ఆమె “నేనే” అంది. “నువ్వు కాదు, నీకంటే ముందు పనిచేసే ఆవిడ” అన్నాడు శ్రీనివాస్. “ఆవిడా? ఎప్పుడో! చచ్చిపోయింది. నేనొచ్చే పాతికేళ్లైపోయింది.” అని చెప్పిందామె. మామ్మ గురించి ఇది తప్పా! ఆ స్కూల్లో ఎవరి దగ్గరా ఎలాంటి సమాచారమూ లేదు.

మిత్రులు ఒక్కొక్కరిగా వేదికెక్కి, తమ పాత అనుభవాలు పంచుకుంటూ ఉన్నారు. వేదిక మీద శ్రీనివాస్ మాట్లాడే వంతొచ్చింది. “మనందరం ఇలా కలవడం రెండున్నర దశాబ్దాల కల. పిల్లలుగా ఈ పాఠశాలలో చేరాం! కాస్త పెరిగి, ఆలోచించే పరిణితి వచ్చేసరికి పదో తరగతి పూర్తయి, రెక్కలు వచ్చిన పక్షుల్లా తలోదారికి ఎగిరిపోయాం! అప్పట్నుంచి పాత జ్ఞాపకాలు తలుచుకోని రోజంటూ ఉండేది కాదు. జీవితంలో ఎప్పుడైనా మళ్లీ అందరం కలుసుకోగలమా? అని ఎన్నిసార్లు అనుకునేవాణ్ణో. అది ఇన్నాళ్ళకి సాకారమయింది. అలనాటి ముచ్చట్లు వింటూ జ్ఞాపకాలు తలుసుకుంటూ, మీ అందర్నీ చూస్తూ ఉంటే.. బాల్యంలోకి మరోసారి పరకాయ ప్రవేశం చేసినట్లుంది.” అంటూ పాఠశాలతో, గురువులతో ఉన్న అనుబంధాన్ని, జతగాళ్లతో చేసిన నాటి కొంటె పనులు, అనుభవాలు చెప్తూ ఉంటే ఒక పక్కన చప్పట్లు మోగుతున్నాయి. మరోవైపు నువ్వులు విరబూస్తున్నాయి. చెమర్చే కళ్ళు ఆత్మీయ అనుభూతిని పొందుతున్నాయి. “మనం ఇవాళ జరుపుకుంటున్న మరుపురాని ఈ మహోత్సవంలో నాకు చిన్న వెలితి కనిపిస్తోంది”అంటూ ఓ క్షణం ఆగాడు శ్రీనివాస్.
“ఏంటి?”అన్నట్టుగా ప్రశ్నార్ధకంగా ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటున్నారు. కొంతసేపు అంతా నిశ్శబ్దం.
“మనందరి చదువులోనూ ఆమె కష్టం ఉంది. మనందరి ఎదుగుదలలో ఆవిడ సేవ ఉంది. కానీ ఈ ఫ్లెక్సీల్లో ఆవిడ ఫోటో లేదు” అంటూ ఉద్వేగంగా
మాట్లాడిన శ్రీనివాస్ ఆగి, తమాయించుకున్నాడు. “ఆమే మన సూరమ్మామ్మ” అనగానే!..
“అవును! మర్చిపోయాం కదా!” అన్నట్టు వాళ్లు ఆమె కోసం చర్చించుకోవడం మొదలుపెట్టారు.
“తన జీవితమంతా! ఈ స్కూలు కోసం దార పోసిందామే! ఉపాధ్యాయులు, టీచర్లు వచ్చేవారు.. బదిలీ అయ్యేవారు. కానీ నాలుగు దశాబ్దాల పాటు ఈ స్కూలే తన శాశ్వత చిరునామాగా బతికింది మామ్మ. ఈ బడికి, మనకి ఆమె చేసిన చాకిరీకి మనమెవ్వరం విలువ కట్టలేం! ఇందులో చదువుకున్న వేల మంది విద్యార్థులు ప్రయోజకత్వంలో ఆమె శ్రమ ఉంది. ఈ బడి పరిశుభ్రత కోసం, సదుపాయాల కోసం మామ్మ ఎంత అలసిపోయిందో కదా! ఆమె మనకోసం ఏళ్లపాటు ఈ బడిని తుడిచి, తుడిచి.. చీపుర్లే కాదు తన జీవితాన్నే అరగదీసేసుకుంది. అంత చేస్తున్నా.. కనీసం గుర్తించే వయసు ఆనాడు మనది కాదు. ఏదో చేద్దామన్నా! ఈనాడు ఆవిడ మన మధ్య లేదు. ఆవిడ ఈ స్కూల్ నుంచి ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు. చరమాంక జీవితం ఎలా సాగిందో తెలీదు. ఆవిడకి అక్షరాలు రాకపోయినా?! ఈ విద్యా నిలయంలో.. మన మదిలో ఆవిడ ఎప్పటికీ చదువుల దేవతే!” అంటూ వేదిక మీంచి నిష్క్రమించాడు శ్రీనివాస్. అక్కడ చమర్చని కళ్ళు లేవు.
వచ్చే ఏడాది తమ విరాళాలతో ఈ పాఠశాలలో ఏర్పాటు చేసే గ్రంథాలయానికి ‘సూరమ్మామ్మ’ పేరు పెట్టాలని వాళ్లు తీర్మానించుకున్నారు. ఇదే ఆమెకు అసలైన నివాళని భావించారు. ఇప్పుడు ఆ పూర్వ విద్యార్థులంతా ఒకటే గాలింపు. ఆమె బంధువులని, వారసులను వెతికి పట్టుకుని ‘‘సూరమ్మామ్మ’’’ ఫోటో సేకరించే పనిలో..!

చిలుకూరి శ్రీనివాసరావు
8985945506

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్