ప్రపంచం వేగంగా మారుతోంది. ఒకప్పుడు పుస్తకాలు, ఉపాధ్యాయులు, గ్రంథాలయాలు మాత్రమే జ్ఞానానికి ప్రధాన వనరులు కాగా, నేడు కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI) అనే కొత్త సాంకేతిక విప్లవం పిల్లల విద్యా ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తోంది. జ్ఞాన ప్రపంచానికి కొత్త తలుపులు తెరుస్తోంది. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ఇంటర్నెట్ వచ్చినప్పుడు ప్రపంచం ఒక కుగ్రామంలా మారిందని చెప్పుకున్నాం. ఇప్పుడు ఎఐ రావడంతో ప్రపంచ జ్ఞానం పిల్లల చేతిలో ఉన్న మొబైల్ లేదా కంప్యూటర్‌లోకి చేరింది.
చాలా మంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు- పిల్లలు ఏఐ వాడితే చదువు దెబ్బతింటుందనే ఆందోళనలో వున్నారు. నిజానికి ఎఐ… చదువుకు ప్రత్యామ్నాయం కాదు, ఒక సహాయక సాధనం మాత్రమే. కాలిక్యులేటర్ గణితానికి, కంప్యూటర్ పుస్తకాలకు ఎలా ప్రత్యామ్నాయం కాదో… ఎఐ కూడా మనిషి ఆలోచనకు ప్రత్యామ్నాయం కాదు. దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే అది పిల్లల అభ్యాసాన్ని మరింత సమర్థవంతంగా మార్చగలదు.
చదువులో…
పిల్లలకు ఏదైనా పాఠం అర్థం కాకపోతే వెంటనే ప్రశ్న అడిగే అవకాశం ఎప్పుడూ ఉండదు. ఒక్కోసారి అవకాశం వున్నా… ప్రశ్న అడగలేకపోవచ్చు. కానీ ఎఐ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. గణితం, సైన్స్, సామాజిక శాస్త్రాలు, భాషలు వంటి ఏ సబ్జెక్టుపైనైనా ప్రశ్నలు అడగొచ్చు. వివరణలు పొందవచ్చు. అడిగిన ప్రశ్నకు సంబంధించి… ఇతర కోణాలలోనూ జవాబులు చెప్పగలనంటూ అనేక ఆప్షన్స్ కూడా ఇస్తుంది.
ఉదాహరణకు, “భూమి సూర్యుని చుట్టూ ఎందుకు తిరుగుతుంది?”, “న్యూటన్ సూత్రాలు ఏమిటి?”, “త్రిభుజ వైశాల్యాన్ని ఎలా కనుగొంటారు?” వంటి ప్రశ్నలకు పిల్లల వయస్సుకు తగిన రీతిలో సమాధానాలు పొందవచ్చు. ఒకే విషయాన్ని సులభంగా, ఉదాహరణలతో, కథ రూపంలో లేదా చిత్రీకరణలతో కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.
అంతేకాదు, ఎఐ వ్యక్తిగత ఉపాధ్యాయుడిలా పనిచేస్తుంది. ఒక విద్యార్థికి ఏ అంశం బలహీనంగా ఉందో గుర్తించి, అదనపు ఎక్సర్ సైజులు, ప్రశ్నలు, పరీక్షలు ఇవ్వగలదు. దీనివల్ల ప్రతి విద్యార్థి తన వేగానికి అనుగుణంగా నేర్చుకునే అవకాశం పొందుతాడు.

నాలెడ్జ్ పెంచుకోవడంలో…
జ్ఞానం అంటే కేవలం పాఠ్యపుస్తకాల్లో ఉన్నది మాత్రమే కాదు. ప్రపంచం గురించి తెలుసుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, ఆలోచనా పరిధిని విస్తరించుకోవడం. ఎఐ ద్వారా పిల్లలు చరిత్ర, విజ్ఞానం, అంతరిక్షం, పర్యావరణం, ఆవిష్కరణలు, ప్రముఖుల జీవితాలు, ప్రపంచ దేశాల సంస్కృతులు వంటి అనేక అంశాల గురించి తెలుసుకోవచ్చు. పాఠ్యపుస్తకాల్లో చిన్న పేరాగా మాత్రమే ఉన్న విషయాన్ని ఎఐ ద్వారా లోతుగా అధ్యయనం చేయవచ్చు.
ఉదాహరణకు “చంద్రుడిపై మనిషి ఎలా అడుగుపెట్టాడు?”, “రోబోట్లు ఎలా పనిచేస్తాయి?”, “కృత్రిమ మేధస్సు ఎలా ఆలోచిస్తుంది?” వంటి ప్రశ్నలకు విస్తృతమైన సమాచారం పొందవచ్చు. తద్వారా పిల్లల్లో ఆసక్తి, పరిశోధనా దృక్పథం, ప్రశ్నించే స్వభావం పెరుగుతాయి.

సాంకేతిక విజ్ఞానాన్ని నేర్చుకోవడంలో ఎఐ
భవిష్యత్తు ప్రపంచం టెక్నాలజీ ఆధారంగా నడవబోతోందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలు చిన్న వయస్సు నుంచే సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకోవడం అవసరం. గతంలో మాదిరిగా ఏవో ఒకటి రెండు సబ్టెక్టులకే పరిమితం కాకుండా, ఎఐ ద్వారా కంప్యూటర్ ప్రోగ్రామింగ్, కోడింగ్, వెబ్‌సైట్ రూపకల్పన, యాప్ డెవలప్‌మెంట్, రోబోటిక్స్, డేటా సైన్స్ వంటి అనేక అంశాలను నేర్చుకోవచ్చు. ఒక చిన్న కోడ్ ఎలా రాయాలి? అందులో తప్పులు ఎక్కడ ఉన్నాయి? వాటిని ఎలా సరిచేయాలి? వంటి విషయాల్లో ఎఐ మార్గనిర్దేశం చేస్తుంది. అసలు ఏఐలో ప్రశ్నలు అడగడానికి ఉపయోగించే ప్రాంప్ట్ ను ఎలా తయారుచేసుకోవాలో కూడా ఎఐనే అడగొచ్చు. అంతేకాదు, విజ్ఞానశాస్త్ర ప్రయోగాలు, సాంకేతిక ప్రాజెక్టులు, సైన్స్ ఫెయిర్ నమూనాలు తయారు చేయడంలో కూడా ఎఐ సహాయం అందిస్తుంది. దీనివల్ల పిల్లలు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా సృజనాత్మకంగా ఆలోచించడం నేర్చుకుంటారు.
భాషా నైపుణ్యాల అభివృద్ధి…
ఎఐ పిల్లల భాషా నైపుణ్యాలను కూడా మెరుగుపరుస్తుంది. తెలుగు, ఇంగ్లీష్ లేదా ఇతర భాషల్లో వ్యాసాలు, కథలు, కవితలు రాయడం, వ్యాకరణ తప్పులు సరిచేయడం, కొత్త పదాలు నేర్చుకోవడం వంటి పనుల్లో ఇది సహాయపడుతుంది. పిల్లలు తమ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తీకరించడం, రచనా నైపుణ్యాలను పెంపొందించుకోవడం, చదివే అలవాటు పెంచుకోవడం వంటి అంశాల్లో కూడా ఎఐ ఉపయోగపడుతుంది.
ఉపయోగాలు.. జాగ్రత్తలు..
ముఖ్యంగా సమాధానాలను గుడ్డిగా నమ్మకూడదు. వచ్చిన సమాచారాన్ని పుస్తకాలు, ఉపాధ్యాయులు లేదా విశ్వసనీయ వనరులతో సరిపోల్చాలి.
హోమ్‌వర్క్‌ను పూర్తిగా ఎఐతో చేయించకూడదు. ముందుగా స్వయంగా ప్రయత్నించి, తర్వాత సందేహాల నివృత్తికి ఉపయోగించాలి.
ప్రశ్నలు అడగడం నేర్చుకోవాలి. మంచి ప్రశ్నలు అడిగితే మంచి సమాధానాలు వస్తాయి.
సృజనాత్మక పనులకు ఉపయోగించాలి. కథలు, ప్రాజెక్టులు, ప్రజెంటేషన్లు, పరిశోధనల కోసం ఉపయోగించాలి.
స్క్రీన్ టైమ్‌ను నియంత్రించాలి. ఎఐ ఉపయోగం చదువుకు సహకరించాలి.. కానీ సమయాన్ని వృధా చేసేదిగా మారకూడదు.
భవిష్యత్తులో విజయవంతం కావడానికి పిల్లలకు కేవలం సమాచారం తెలుసుకోవడం సరిపోదు. విమర్శనాత్మక ఆలోచన, సమస్యల పరిష్కారం, సృజనాత్మకత, కమ్యూనికేషన్, సహకార భావన వంటి నైపుణ్యాలు అవసరం. ఎఐ సమాచారం అందించగలదు. కానీ ఆ సమాచారాన్ని విశ్లేషించడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం, కొత్త ఆలోచనలు సృష్టించడం మాత్రం మనుషులే చేయగలరు. పిల్లలు ఏఐని తమ విద్యా ప్రయాణంలో ఒక శక్తివంతమైన సహచరుడుగా, జ్ఞానాన్ని సేకరించే సాధనంగా మాత్రమే చూడాలి; ఆలోచనలకు ప్రత్యామ్నాయంగా కాదు. అది వారి సందేహాలను తీర్చగలదు, కొత్త విషయాలు నేర్పగలదు, ప్రపంచ జ్ఞానాన్ని వారి ముందుంచగలదు. అయితే ఎఐ ఎంత తెలివైనదైనా, దాన్ని సరిగ్గా ఉపయోగించే తెలివి మాత్రం పిల్లల్లో ఉండాలి. పుస్తకాల పఠనం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, స్వతంత్ర ఆలోచన, పరిశోధనా దృక్పథంతో కలిపి ఎఐను ఉపయోగించినప్పుడు మాత్రమే అది నిజమైన విద్యా విప్లవానికి దారితీస్తుంది. భవిష్యత్తు ప్రపంచంలో ఎఐని ఉపయోగించడం ఒక అదనపు నైపుణ్యం కాదు; అది ఒక అవసరం. అయితే ఆ అవసరాన్ని విజ్ఞానదాయకంగా, సృజనాత్మకంగా, మానవీయ విలువలతో మేళవించి, ఉపయోగించగలిగితేనే పిల్లలు రేపటి ప్రపంచానికి ధృవతారలుగా ఎదుగుతారు.









కామెంట్‌లు (0)