ఆవకాయ లేని భోజనాన్ని, మామిడి పండు లేని వేసవిని ఊహించుకోవడం కష్టం. ఎండలు మండుతున్నా.. మనసుకి హాయినిచ్చే అమృతం, మన ఫలరాజు మామిడి. ఊరగాయ పచ్చడి ఘుమఘుమల నుంచి, మామిడి పండు మధురమైన రసం వరకూ.. అందరికీ ప్రాణబంధం ఈ మామిడి. అందుకే ఇది కేవలం పండు కాదు.. ఒక భావోద్వేగం!. ప్రకృతి ప్రసాదించిన అద్భుత రసగుళిక.. వందలాది రకాలు, వేల ఏళ్ల చరిత్ర, అంతకుమించిన పోషక విలువలు.. ఇవన్నీ కలిస్తేనే మన ‘కింగ్ ఆఫ్ ఫ్రూట్స్’. మామిడితో కొన్ని రకాల వంటలను ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

కేసరి
కావాల్సినవి: బొంబాయి రవ్వ- కప్పు, మామిడిపండు గుజ్జు- కప్పు, చక్కెర- కప్పు, (పండు తీపిని బట్టి కొంచెం తగ్గించుకోవచ్చు), నెయ్యి- అరకప్పు, నీళ్లు- రెండు కప్పులు, యాలకుల పొడి- అరస్పూను, జీడిపప్పు, కిస్ మిస్- గుప్పెడు.
తయారీ: స్టవ్ మీద పాన్ పెట్టి, వేడి చేయాలి. నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు, కిస్‌మిస్ వేయించి, పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో రవ్వ వేసి, కమ్మని వాసన వచ్చే వరకూ దోరగా వేయించి, ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఆ పాన్‌లోనే రెండు కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించాలి. వేయించి పెట్టుకున్న రవ్వను ఉండలు కట్టకుండా కొద్దికొద్దిగా పోస్తూ కలపాలి. మంటను సిమ్ లో పెట్టి రవ్వ మెత్తగా అయ్యే వరకూ ఉడికించాలి. తర్వాత చక్కెర వేసి, కలపాలి. చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత మామిడిపండు గుజ్జును కూడా వేసి బాగా కలపాలి. మామిడిపండు వేయడం వల్ల కేసరికి మంచి రంగు, రుచి వస్తాయి. మిగిలిన నెయ్యిని రెండు మూడు సార్లుగా వేస్తూ కలుపుతుండాలి. కేసరి పాన్‌కు అంటుకోకుండా సపరేట్ అవుతున్నప్పుడు యాలకుల పొడి వేయాలి. చివరగా వేయించి, పెట్టుకున్న జీడిపప్పు, కిస్‌మిస్ చల్లుకుని ఒక్కసారి కలిపి స్టవ్ ఆపేయాలి. అంతే మామిడిపండు కేసరి రెడీ!

హల్వా
కావాల్సినవి: మామిడిపండు గుజ్జు- రెండు కప్పులు, చక్కెర- అర కప్పు (మామిడి పండు తీపిని బట్టి సర్దుబాటు చేసుకోవాలి), కార్న్ ఫ్లోర్- అర కప్పు, నెయ్యి- 2 లేదా 3 స్పూన్లు, యాలకుల పొడి- అర స్పూను, జీడిపప్పు, బాదం ముక్కలు-కొద్దిగా (గార్నిష్ కోసం).
తయారీ: ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ తీసుకుని, అందులో కొంచెం నీళ్లు పోసి ఉండలు లేకుండా పల్చగా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక మందపాటి కడాయి లేదా నాన్ స్టిక్ పాన్ పెట్టి, వేడి చేయాలి. అందులో మామిడిపండుగుజ్జు, చక్కెర వేయాలి. చక్కెర కరిగి, ఈ మిశ్రమం కొంచెం ఉడకడం ప్రారంభించే వరకూ కలుపుతూ ఉండాలి. మంటను సిమ్ లో పెట్టి, ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని మరోసారి కలిపి మామిడిపండు గుజ్జులో పోయాలి. హల్వా అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. కొద్దిసేపటికి ఈ మిశ్రమం చిక్కబడుతుంది. మధ్యమధ్యలో కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ కలపాలి. హల్వా కడాయికి అంటుకోకుండా విడిపోతున్నప్పుడు, అందులో యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేయాలి. ఒక ప్లేట్‌కు లేదా బాక్స్‌కు కొంచెం నెయ్యి రాసి, సిద్ధమైన హల్వాను అందులో వేసి సమానంగా పరచాలి. అంతే నోరూరించే హల్వా రెడీ. పూర్తిగా చల్లారిన తర్వాత నచ్చిన ఆకారంలో ముక్కలుగా కోసుకోవాలి.

మజ్జిగ చారు..
కావాల్సినవి: పుల్లని మామిడిపండు రసాలు- 1, పెరుగు/మజ్జిగ- 2 కప్పులు, పచ్చిమిర్చి- నాలుగు , అల్లం- అర అంగుళం, బెల్లం తురుము- స్పూన్, ఉప్పు- రుచికి సరిపడా, కొత్తిమీర- కొద్దిగా, నూనె- 2 టీస్పూన్లు, ఆవాలు- అర స్పూను, జీలకర్ర- అర స్పూను, ఎండుమిర్చి- 2, కరివేపాకు- ఒక రెమ్మ, పసుపు- పావు స్పూన్, ఇంగువ- చిటికెడు. పచ్చికొబ్బరి తురుము -కప్పు
తయారీ: మామిడిపండును శుభ్రంగా కడిగి, పైన తొక్క తీసేయాలి. దానికి తగినన్ని నీళ్లు పోసి, మెత్తగా ఉడికించుకోవాలి. ఒక గిన్నెలో పెరుగును తీసుకుని, చిలకాలి. అందులో ఉడికించుకున్న మామిడిపండు, రుచికి సరిపడా ఉప్పు, బెల్లం తురుము వేసి బాగా కలపాలి. అవసరమైతే మరికొన్ని నీళ్లు పోసి మజ్జిగ చారు పల్చదనానికి తగినట్లు సర్దుబాటు చేయాలి. పచ్చికొబ్బరి తురుము, పచ్చిమిర్చి, అల్లం ముక్కలను మిక్సీలో వేసి, మెత్తగా గ్రైండ్ చేసి, ఆ పేస్ట్‌ను మజ్జిగ మిశ్రమంలో కలపాలి. స్టవ్ మీద చిన్న పాన్ పెట్టి నూనె వేయాలి. నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి వేయించాలి. ఈ పోపును సిద్ధం చేసుకున్న మామిడి మజ్జిగ మిశ్రమంలో పోసి కలపాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన మామిడిపండు మజ్జిగ చారు సిద్ధం!. వేసవిలో వేడి తాపాన్ని ఈ మామిడిపండు మజ్జిగచారు తగ్గిస్తుంది.








కామెంట్‌లు (0)