test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆలూతో అదిరే స్నాక్స్‌ !

6 రోజుల క్రితం

Amazing snacks with potatoes!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 07, 2026, 12:52 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

పిల్లలు అత్యధికంగా తినే ఆహార పదార్థాలలో బంగాళదుంప ఒకటి. ఇది కేవలం సైడ్ డిష్ మాత్రమే కాదు.. ఎనర్జీ బూస్టర్! అన్నం, చపాతీల్లాగే దీనిలో కూడా కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే దీన్ని మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన తక్షణ శక్తి లభిస్తుంది. బంగాళదుంప అంటే కేవలం పిండిపదార్థం మాత్రమే అనుకుంటే పొరపాటే! దీనిలో మన శరీరానికి కావలసిన ఎన్నో అద్భుతమైన విటమిన్లు, ఖనిజాలు దాగున్నాయి. విటమిన్ సి, బి6, పొటాషియం మెండుగా ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉండటానికి, రక్తప్రసరణ సరిగ్గా జరగడానికి తోడ్పడతాయి. ఇందులో ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. మరి దీనితో చేసే స్నాక్ అదిరిపోవాల్సిందే… అవి ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..


Amazing snacks with potatoes!


క్రిస్పీ పొటాటో బైట్స్
కావల్సినవి: బంగాళ దుంపలు- 3 లేదా 4 (ఉడికించినవి), మొక్కజొన్న పిండి: 4 స్పూన్లు, బియ్యం పిండి: 2 స్పూన్లు, ఎండుమిర్చి ముక్కలు- స్పూన్, మిరియాల పొడి- అర టీస్పూన్, వెల్లుల్లి తరుగు- స్పూన్, కొత్తిమీర తరుగు- కొద్దిగా, ఉప్పు- రుచికి సరిపడా, నూనె- డీప్ ఫ్రైకి సరిపడా.
తయారీ : ఉడికించిన బంగాళదుంపల పొట్టు తీసి, మెత్తగా చేసుకొని, ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఈ మిశ్రమంలో సన్నగా తరిగిన వెల్లుల్లి, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత అందులోనే కార్న్‌ఫ్లోర్, బియ్యం పిండి వేసి, చపాతీ పిండి ముద్దలా గట్టిగా కలుపుకోవాలి. ఆ పిండి ముద్దను చిన్న చిన్న భాగాలుగా తీసుకుని, చపాతీ పీటపై పొడవాటి రోల్స్ లాగా చేయాలి. తర్వాత చాకుతో చిన్న చిన్న ముక్కలుగా బైట్స్ సైజులో కట్ చేసుకోవాలి. డీప్ ఫ్రై కడాయిలో నూనె పోసి, వేడి చేసి, మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, కట్ చేసుకున్న పొటాటో బైట్స్‌ను ఒక్కొక్కటిగా నూనెలో వేస్తూ, అవి బంగారు రంగులోకి మారి, క్రిస్పీగా అయ్యేంత వరకూ వేయించి, తీసేయండి. వేడివేడి క్రిస్పీ పొటాటో బైట్స్‌ను టొమాటో కెచప్ తో సర్వ్ చేస్తే పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు.


Amazing snacks with potatoes!


ఆలూ పకోడి
కావల్సినవి : బంగాళదుంపలు- రెండు, శనగపిండి- కప్పు, బియ్యం పిండి- రెండు స్పూన్లు, కారం- స్పూన్, వాము- అర స్పూన్, పసుపు- పావు స్పూన్, అల్లంవెల్లుల్లి పేస్ట్- అర స్పూన్, కొత్తిమీర- కొద్దిగా, కరివేపాకు- రెండు రెమ్మలు, ఉప్పు- రుచికి సరిపడా, నూనె- డీప్ ఫ్రైకి సరిపడా.
తయారీ: బంగాళదుంపల పొట్టు తీసి, వాటిని నీళ్లలో కడిగి, ఉల్లిపాయ పకోడీకి కోసినట్టు పొడవుగా, వీలైనంత సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్‌లోకి కట్ చేసిన ఆలూ ముక్కలను వేయాలి. అందులోనే శనగపిండి, బియ్యం పిండి, కారం, పసుపు, వాము, అల్లంవెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. మొదట పొడిగా అన్ని కలిసేలా బాగా కలుపుకోవాలి. ఆలూ ముక్కల్లో ఉండే తడి వల్ల పిండి ముక్కలకు పట్టుకుంటుంది. ఇప్పుడు కొద్దిగా కొద్దిగానే నీళ్లు చిలకరిస్తూ గట్టి పకోడీ పిండిలా కలుపుకోవాలి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి బాగా వేడి చేయాలి. నూనె కాగాక, మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, కలిపి పెట్టుకున్న ఆలూ మిశ్రమాన్ని పకోడీల్లా విడివిడిగా నూనెలో వేయాలి. గోల్డెన్ కలర్ వచ్చేవరకూ పకోడీలను వేగనివ్వాలి. వేగాక ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే ఎంతో టేస్టీ ఆలూ పకోడీ రెడీ.


Amazing snacks with potatoes!


ఫ్రెంచ్ ఫ్రైస్ !

కావాల్సినవి: బంగాళ దుంపలు- 4 , మొక్కజొన్న పిండి- 2 నుండి 3 టేబుల్ స్పూన్లు, ఐస్ వాటర్ – ఒక పెద్ద బౌల్ నిండా, ఉప్పు- రుచికి సరిపడా, నూనె- డీప్ ఫ్రైకి సరిపడా, చాట్ మసాలా- స్పూన్ (ఆప్షనల్ – పైన చల్లుకోవడానికి)
తయారీ: బంగాళదుంపల పొట్టు తీసి, వాటిని సమానమైన మందంతో పొడవాటి ముక్కలుగా (ఫ్రెంచ్ఫ్రైస్ షేప్‌లో) కట్ చేసుకోవాలి. కట్ చేసిన ఆలూ ముక్కలను సాధారణ నీళ్లలో మూడు సార్లు బాగా కడగాలి. దీనివల్ల వాటిలో ఉండే స్టార్చ్ (తెల్లటి జిగురు) పోతుంది. ఆ తర్వాత ఆ ముక్కలను ఐస్ ముక్కలు ఉన్న చల్లటి నీళ్లలో వేసి, 20 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఇలా చేయడం వల్ల ఫ్రై చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి, కొద్దిగా ఉప్పు వేసి బాగా మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు, ఐస్ వాటర్ లోంచి తీసిన ఆలూ ముక్కలను అందులో వేసి కేవలం నాలుగు నిమిషాలు మాత్రమే (సగం ఉడకాలి, పూర్తిగా మెత్తబడకూడదు) ఉడికించి, వెంటనే నీటిని వడకట్టాలి. ఉడికిన ముక్కలను ఒక పొడి కాటన్ క్లాత్‌పై వేసి, తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టాలి. తడి ఆరిపోయాక, ఒక బౌల్‌లోకి తీసుకుని వాటిపై మొక్కజొన్న పిండి చల్లి, ముక్కలన్నింటికీ బాగా పట్టేలా బాగా కలపాలి. బాండీలో నూనె వేడి చేసి, మీడియం ఫ్లేమ్‌పై ఈ ఆలూ ముక్కలను వేసి కేవలం రెండు నిమిషాలు మాత్రమే వేయించి (రంగు మారక ముందే) బయటకు తీసి చల్లార్చాలి. రెండోసారి నూనెను బాగా హై ఫ్లేమ్‌లో వేడి చేసి, చల్లారిన ఫ్రై ముక్కలను మళ్లీ నూనెలో వేసి గోల్డెన్ కలర్ వచ్చేవరకూ వేయించి తీసేయాలి. అంతే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. వేడివేడిగా ఉన్న ఫ్రెంచ్ ఫ్రైస్‌పై కొద్దిగా ఉప్పు, చాట్ మసాలా చల్లి, టొమాటో కెచప్‌తో సర్వ్ చేస్తే పిల్లలు ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్