పొద్దు కంటే ముందు
నిద్రలేచినప్పుడు
కొండల మధ్యనుండి
సూర్యుడి ఎంట్రీ
రోజూ చూస్తున్నదేగా!
అదిగో కోయిల
కూ…కూ…మని పాడుతోంది
వింటున్నానని బదిలివ్వు
తోటలో
పూల పరిమళాలను
ఎవరికోసం
ఇంటిదాకా మోసుకెళ్తావ్
పొలం గట్టుపై
కొంగల బారుని
ఫోటో కోసం
కదలకుండా ఉండమంటే ఎలా!
చెరువు గట్టున కూర్చుని
చేపలకు…
చెప్పిన కథలే చెప్పి
విసిగించకు
ప్రేయసి ప్రేమను
గుండె గోడపై
ఎన్ని రోజులని మోస్తావు
నీడై ఎన్ని మైళ్ళు నడుస్తావు
ప్రేయసి కళ్ళను
కలువలతో పోల్చి
కొలనుతో ఎందుకు
గొడవ పడతావు
చందమామను…
చుక్కల్ని ఇంటికి పిలిచి
ఈరోజైనా ! పసి నవ్వులను
పరిచయం చేయి
కల్పిత కథల దుప్పటి కప్పి
బుజ్జాయిని …
ఎన్ని రాత్రుళ్ళు బుజ్జగిస్తావు
వయసుకూ మంచానికి
ముడి పడగానే
జ్ఞాపకాలను
నెమరేసుకోవడం
చాదస్తం కాక ఇంకేమిటి!
జాలి కురవని
వేసవి జల్లుకోసం..
ఎన్ని సాయంత్రాలు
నేలవై నిరీక్షిస్తావు
ప్రకృతిలో మమేకమై
ఎన్ని పొద్దులిలా
కవితవై వినిపిస్తావు.
ఎ. నాగాంజనేయులు
9959017179.
ప్రకృతిలో ఏకమై
22 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 07, 2026, 01:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)