పది నిమిషాలు. అంతే. అది మీ బిడ్డ జీవితాన్ని ఎంతగా మార్చగలదు? చాలా మంది తల్లిదండ్రులు ఈ ప్రశ్నకు జవాబు తెలియకుండానే ఉంటారు. రోజులోని అల్లరి, అరుపులు, పనుల ఒత్తిడి తర్వాత, ఆ చిన్నారి కళ్ళు మూసుకోబోయే సమయంలో మీతో చేసే సరదా ముచ్చట్లే వారి మానసిక వికాసానికి, మీ సంబంధానికి ఎంతో మేలు చేస్తాయంటే నమ్ముతారా? ఈ సాయంత్రం లేదా రాత్రి పూట, మీరు లాప్ ట్యాప్ మూసివేసి, ఫోన్ పక్కన పెట్టి, మీ పిల్లలకు దగ్గరగా కూర్చున్న క్షణాలు – అవే నిజమైన పేరెంటింగ్ లోని మాణిక్యాలు. నిద్రపోయే ముందు ఆ చిన్ని ముచ్చట్లే… పిల్లల మనసులోకి తలుపు తెరిచే తాళాలు. కాబట్టి, ఈరోజు రాత్రి నుంచే ప్రయత్నం మొదలుపెట్టండి. మీ బిడ్డకు దగ్గరగా చేరి, ఒక చిన్ని ప్రశ్న వేయండి. వారి సమాధానం మీకు అర్థంకాని ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లనివ్వండి. అక్కడే మీరు నిజమైన తల్లిదండ్రిగా ఎదుగుతారు. పేరెంటింగ్ ఒక ప్రయాణం. కచ్చితమైన నియమాలు ఏమీ లేవు. ఈ రోజు మాట్లాడకపోతే, రేపు ప్రయత్నించండి. ముఖ్యమైనది నిరంతరత. మీ ప్రేమ, ఓపికే గొప్ప మార్గదర్శి.
ఈ టాక్స్..
డిజిటల్ డిటాక్స్ కంటే మంచిది..
మనం తరచూ అనుకుంటాం.. పిల్లలకు కావాల్సింది ఖరీదైన బొమ్మలు, పెద్ద టీవీ, లేటెస్ట్ ట్యాబ్ అని. కానీ నిజం చాలా సరళమైనది. వారికి కావాల్సింది మన సమయం. ముఖ్యంగా పడుకునే ముందు, చీకటి ముసుగులో, ప్రపంచం నిశ్శబ్దంగా మారినప్పుడు, పిల్లల మనసులోని అతి లోతైన భావాలు బయటికి రావడానికి ఇదే సరైన సమయం. ఇది వారికి ఒక థెరపీ సెషన్ లాంటిది. రోజంతా స్కూల్లో, ఫ్రెండ్స్ తో, టీచర్లతో జరిగిన విషయాలను వాళ్లు తమ స్వంత భాషలో మీకు చెప్పుకుంటారు.
”నాన్నా, ఈ రోజు రాహుల్ నా పెన్ తీసుకున్నాడు.”
“అమ్మా, సిరి అన్నది నేను బాగా డ్రా చేయలేనని.”
ఇవి చిన్న మాటల్లా అనిపించవచ్చు. కానీ ఈ మాటల్లోనే వారి నిజమైన భావోద్వేగం దాగి ఉంటుంది. వారి బాధను, సంతోషాన్ని, భయాన్ని వ్యక్తపరచడం నేర్చుకుంటారు.
లిజన్ ఫస్ట్, టాక్ నెక్ట్స్ ఫార్ములా..
చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పు ఏమిటంటే – పిల్లలు ఏదైనా చెప్పగానే వెంటనే ‘సొల్యూషన్’ చెప్పడం. “అలా కాదు రా నాయనా, ఇలా చెయ్యి”, “నువ్వు సరిగ్గా లేవు, నీ తప్పు”. బెడ్ టైమ్ ఛాటింగ్ కి ఇది ప్రమాదకరం. ఈ సమయంలో మీరు చేయాల్సింది వినడం మాత్రమే. అవును, కేవలం వినడం. వాళ్ల మాటలను శ్రద్ధగా వినండి. వాళ్ల మాటలను పునరావృతం చేస్తూ ఊరట ఇవ్వండి.
ఉదాహరణకు: మీ పిల్లవాడు చెప్పాడు: “ఈరోజు గేమ్ లో నేను ఓడిపోయాను.” మీరు వెంటనే “పర్లేదు, ఓడడం.. గెలవడం సహజం” అనకండి.
బదులుగా ఇలా అనండి: “నీకు చాలా బాధగా ఉంది కదా? నువ్వు గెలవాలని ఎంత ప్రయత్నించావో నాకు తెలుసు.” ఈ ఒక్క వాక్యం వారికి చెప్పే గొప్ప సందేశం – “మీ భావాలు ముఖ్యమైనవి.. నేను మీ వైపు ఉన్నాను.” అనే భావం వారికి గొప్ప ధైర్యాన్నిస్తుంది.
బెడ్ టైమ్ స్టోరీస్ ను ఎలా మార్చుకోవాలి ?
రోజూ ఒకే ఒక కథ చదవడం లేదా చెప్పడం బదులు, ఆ కథను ఒక సంభాషణగా మార్చండి. కథలోని పాత్రల పట్ల పిల్లల రియాక్షన్ ఏమిటి? ఆ పాత్రకు వాళ్లు ఏమి సలహా ఇస్తారు? ఈ ప్రశ్నలు వారి సృజనాత్మకతను, తార్కిక సామర్ధ్యాన్ని పెంచుతాయి. మీరు కూడా మీ చిన్నప్పటి కథలు చెప్పండి. మీరు కూడా ఒకసారి భయపడ్డారని, తప్పులు చేశారని, అలాగే వాటిని ఎలా అధిగమించారో చెప్పండి. దీంతో మీరు పిల్లలకు మనమంతా సాధారణ మనుషులమనే సందేశం వెళ్తుంది. ఇది మీ మధ్య ఉన్న అంతరాన్ని చాలా తగ్గిస్తుంది.
నిపుణులు ఏమంటున్నారు ?
నిద్ర ముందు మెదడు యొక్క ట్రాన్సిషన్ స్టేజ్ లో ఉంటుంది. అంటే, ఆ సమయంలో మీరు చెప్పే ప్రతి సానుకూల మాట, ప్రతి బిగ్గర నవ్వు, ప్రతి ఆలింగనం, పిల్లల సబ్ కాన్షియస్ మైండ్ లో నిక్షిప్తమైపోతుంది. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని రాత్రికి రాత్రే రెట్టింపు చేస్తుంది. ముఖ్యంగా, ఈ ఛాటింగ్ వల్ల పిల్లల్లో ‘సెక్యూర్ అటాచ్ మెంట్’ ఏర్పడుతుంది. ప్రపంచంలో ఎంత తుపాను వచ్చినా, నాన్న లేదా అమ్మ దగ్గరకు వెళ్తే భద్రత అనే భావన వారిలో పెరుగుతుంది. ఇదే ఆరోగ్యకరమైన పేరెంటింగ్ కు మూలస్తంభం.
కొన్ని సింపుల్ టిప్స్..
అద్భుతమైన ప్రశ్న ఒకటి: ప్రతి రోజూ “ఈ రోజు నువ్వు ఎవరికైనా సహాయం చేశావా?” లేదా “ఈ రోజు నిన్ను ఏది నిజంగా నవ్వించింది?” అని అడగండి. ఇలాంటి ప్రశ్నలు సానుకూలమైన జ్ఞాపకాలను గుర్తు తెస్తాయి.
స్క్రీన్ ఫ్రీ జోన్ : పడుకునే గంట ముందు ఫోన్లు, టీవీలు, ట్యాబ్ లను పూర్తిగా నిషేధించండి. నీలి కాంతి వల్ల నిద్ర పట్టదు. అంతేకాదు మీ సంభాషణల నాణ్యత తగ్గిపోతుంది.
‘డిప్రెషన్’ పేరు చెప్పకండి, భావాలను గుర్తించండి: “నీకు డిప్రెషన్ అనేది తెలుసా?” అని అడగకండి. “నీకు చాలా బాధగా ఉందా? మనసు బరువుగా ఉందా?” అని సాదాగా అడగండి. ఇది వారి మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది.
ఆటలోకి రండి : కొన్నిసార్లు నేరుగా మాట్లాడకపోయినా, “నువ్వు ఏ జంతువు అవ్వాలనుకుంటావు?” లేదా “ఏ రంగు నీ మూడ్ ను చూపిస్తుంది?” అని అడగండి. చిన్నపిల్లలు తమ భావాలను ప్రత్యక్షంగా కాకుండా, రంగులు, జంతువులు, కార్టూన్ల ద్వారా సులభంగా చెబుతారు.
‘గుడ్ నైట్’ మాటకి మించిన బంధం
“గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్” అని చెప్పి లైట్ ఆఫ్ చేయడం కేవలం ముగింపు మాత్రమే. కానీ ఆ మాటలకు ముందు జరిగే ఆ చిన్ని చర్చ, ఆ నవ్వులు, ఆ కౌగిలి – అవే పిల్లలను మానసికంగా దృఢంగా తయారుచేస్తాయి. ఇది సింపుల్ గా అనిపించే బెడ్ టైమ్ రొటీన్. నిజానికి ఒక శక్తివంతమైన ఎమోషనల్ ఇన్వెస్టిమెంట్. ఇది వారికి ఇప్పుడు నిద్ర మాత్రమే కాదు, రేపటి ప్రపంచంలో ఒత్తిళ్లను ఎదుర్కొనే సత్తువను కూడా ఇస్తుంది.








కామెంట్‌లు (0)