test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జ్ఞానోదయం !

21 గంటల క్రితం

Enlightenment!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 07, 2026, 02:34 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఓ ఒంటె తన యజమానిని ఎక్కించుకుని, అడవిలో నడుస్తూ ఉంది. కొంత దూరం వెళ్లాక తనకి నీరసం వచ్చింది. కానీ యజమానిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, ముందుకు నడుస్తూనే ఉంది. యజమాని ఓ చెట్టు కింద నీడ చూసుకొని, ఒంటెను ఆపాడు. కడుపు నిండా నీళ్ళు తాగి, చెట్టు కింద కూర్చున్నాడు. క్షణాల్లో యజమానికి నిద్ర పట్టేసింది. ఒంటె చెట్ల ఆకులు తినడం మొదలుపెట్టింది. అంతలో ఏదో అలికిడి వినిపించి పక్కకు తిరిగింది. తనలాగే పెద్ద జంతువు తనవైపు నడుచుకుంటూ రావడాన్ని గమనించింది. తనకన్నా ఎత్తుగా ఉంది. ఒంటినిండా ఆకర్షణీయమైన ముదురు గోధుమరంగు మచ్చలు, నెత్తిన నిలుచున్న చిన్న కొమ్ములున్నాయి.
‘మిత్రమా! ఏంటి అలా చూస్తున్నావ్? నన్ను జిరాఫీ అంటారు. ఈ ప్రాంతం నీకు కొత్త అనుకుంటా’ అంటూ పలకరించింది జిరాఫీ.
‘నిజమే. ఈ ప్రాంతం నాకు కొత్తే. ప్రయాణంతో అలసిపోయాను. యజమాని ఇక్కడ ఆగాడు. దాంతో సేద తీరుతున్నాను. అతడు లేవగానే మళ్ళీ నడక మొదలు’ అంది.
‘అయ్యో! నాకు అలాంటి బాధలు లేవు. నచ్చింది తింటా. నాకు అందని ఆకుల్లేవు. ఇష్టం వచ్చినట్లు ఉంటా. అందరూ నా అందాన్ని అలాగే చూస్తూ ఉండిపోతారు. ఎత్తుగా ఉంటాను కదా!, దూరం నుంచే శత్రువులను పసిగడతాను. ఇక్కడి జంతువులకు శత్రువుల రాక గురించి హెచ్చరిక ఇస్తాను. అందుకే అన్ని జంతువులు నా పట్ల ఎంతో గౌరవంగా, భక్తిగా ఉంటాయి’ కాస్తంత గర్వంగా మెడ చాస్తూ చెప్పింది. ఒంటె అంతా వింటూ, ఆకులు మేస్తూ బదులు ఇవ్వలేదు.
జిరాఫీయే మళ్ళీ ‘నువ్వేమిటి అంత మురిగ్గా అసహ్యంగా ఉన్నావు. నీ వీపు మీద చిన్న కొండల్లే ఆ ఎత్తు బుడిపె.. నిన్ను పెంచుకుంటున్న యజమానిది చాలా పెద్ద మనసు. లేకపోతే అందమైన ప్రాణుల్ని పెంచుకోక నిన్ను పెంచుకోవడమేమిటి?’ అంటూ వెటకారంగా నవ్వింది.
ఒంటెకు చాలా కోపం వచ్చింది. వెంటనే ‘నిన్ను తీసుకెళ్ళి ఎడారిలో పడేస్తే తెలుస్తుంది! అందమేమిటో, శుభ్రత ఏమిటో’ అని ఇంకేదో అనబోతుండగా
‘వీర్’ యజమాని కళ్ళు మూసుకునే పిలిచాడు. వెంటనే జిరాఫీ చెట్ల చాటుకు వెళ్ళిపోయింది.
ఒంటె ‘సాబ్’ అంటూ యజమాని వద్దకు వెళ్ళింది.
యజమాని ‘నిద్రపట్టేసింది వీర్. నువ్వు ఏమైనా తిన్నావా?, లేదా?’ అని ప్రేమగా అడిగాడు. ఒంటె తలాడించింది.
యజమాని లేచి, దాన్ని నిమురుతూ ‘పద వెళ్దాం. ఎడారిలో నీవు తప్ప నాకు దిక్కెవరు? మండే ఇసుకలో మనుషుల్ని మోస్తూ, రోజుల తరబడి నడుస్తూ ఆకలిదప్పులు లేకుండా మీ జాతి మాకు సేవ చేస్తుంది. మీ రుణం మేం ఎన్నటికీ తీర్చుకోలేం’ అన్నాడు.
ఆ మాటలకు ఒంటె విసుగు మటుమాయమైంది.
‘మంచి మనసున్న మనిషికి ఎడారిలో అయినా మేం తోడుంటాము. మేమున్నదే అందుకు’ అంటూ ఒంటె వినయంగా కిందకు వంగింది.
ఆ మాటలన్నీ చెట్టు చాటునున్న జిరాఫీకి వినిపించాయి. దాని మనసులో ఆలోచన మొదలైంది. ‘గర్వంతో ఒంటెను నేను అవమానించాను. కానీ ఒంటె సేవ ముందు నా సేవ ఎంత? నా అందమెంత?’ అనుకుంది.
ఒంటె ఉన్న దిక్కు చూసింది. యజమాని డబ్బాలో నీళ్ళతో ముఖం కడుక్కోవడానికి కొద్ది దూరం వెళ్ళాడు. వెంటనే జిరాఫీ ఓ పెద్ద ఆకుల కొమ్మతో ఒంటె వద్దకు వెళ్ళి, ‘నిన్ను హేళన చేసినందుకు నన్ను క్షమించు మిత్రమా! నీ మానవ సేవ గురించి తెలుసుకున్నాను. నువ్వు నాకంటే గొప్పదానివి’ అంది.
ఒంటె నవ్వుతూ కొమ్మ అందుకుని ‘ఫర్వాలేదు అందగాడా. మనమంతా సమానమే. ఇక్కడకు రావడం వల్ల నిన్ను కలిశాను. సంతోషం. మా యజమాని వస్తున్నాడు. ఇక వెళ్ళాలి’ అంది.
‘క్షేమంగా వెళ్ళు మిత్రమా. ఉంటాను’ అంటూ జిరాఫీ చెట్ల చాటుకు వెళ్ళి, ఒంటె వైపు చూస్తుండి పోయింది.


జె. శ్యామల
9989601113


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్