test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆవకాయ

24 మే, 2026

mango
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 24, 2026, 10:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

‘ఉన్నవాడికి తింటే అరగదు. లేనివాడికి తిండే దొరకదు. పరుపులున్నా పట్టదు నిదుర, కరకు నేలను గురకలు వినరా!’ అన్న సి.నా.రే పాట నన్ను ఎప్పుడూ మేల్కొలుపుతుంటుంది.
ఆరుగురు సంతానం ఉన్న కుటుంబంలో నాలుగో సంతానం నేను. నాన్న ఓ చిన్న రైస్ మిల్లులో పని చేసేవారు. ఆ వచ్చే తక్కువ ఆదాయంతోనే అందరం బతకాలి. కానీ నాకు చదువు అంటే చాలా ఇష్టం. అందుకే ఆ ఊరి బడిలో ఎప్పుడూ నేనే ఫస్ట్. మాస్టర్లు అందరికీ నేనంటే చాలా ఇష్టం. ‘ఒరేయ్ శర్మ! నువ్వు బాగా చదువుతావు. పై చదువులు చదివావంటే పెద్ద ఉద్యోగం వస్తుంది. అప్పుడు ఈ బీదరికం మీ కుటుంబానికి ఉండదు. నువ్వే అందరికీ పెద్ద దిక్కు అవుతావు’ అనేవారు.
కానీ అందరి దీవెనలు అలా ఉన్నా.. నాకు ఎదురైన పరిస్థితులు మరోలా ఉన్నాయి. అంతవరకూ బాగానే సాగిపోతున్న మా కుటుంబానికి పెద్ద దిక్కు అయిన నాన్న హఠాత్తుగా మరణించారు. కొద్దిగా వెలుగు ఉంది అనుకున్న మా కుటుంబం మొత్తం చీకటిలో మునిగిపోయింది. ఏదో అలా టెన్త్ వరకూ పూర్తి చేసి, నాన్నగారి ఉద్యోగంలోనే నేను చేరడం జరిగింది. ఇంకా ఆ పల్లెలో మంచి విలువలున్న మనుషులు ఉండటం మా అదృష్టం. నాన్న తర్వాత ఆ ఉద్యోగం నాకు ఇవ్వడం, ఆ చిన్న ఉద్యోగంతోనే ఇంటి బాధ్యతలు మోసే ధైర్యం నాకు వచ్చింది. అలానే అక్కల, చెల్లెళ్ల పెళ్లిళ్లు చేశాను. తమ్ముడుకి కూడా ఓ చిన్న ఉద్యోగం వచ్చింది. మరొకచోటికి వెళ్లిపోయాడు. కొన్ని సంవత్సరాలకు అమ్మ కూడా నన్ను వదిలి వెళ్లిపోయింది.
అప్పుడే నా జీవితంలోకి కాంతం వచ్చింది. ఒక రకంగా నా అర్ధాంగి అనే మాటకి పూర్తి విలువ ఇచ్చింది కాంతం. ఇంట్లో ఏమున్నా, లేకపోయినా ఎప్పుడూ ఆ పేదరికాన్ని భరించిందే తప్ప తన మాటలతో, చేష్టలతో బాధించలేదు.

‘ఏవండీ! ఈ రోజైనా మామిడికాయలు తేవచ్చుగా, కొద్దిగా ఆవకాయ పెడతాను’ అన్న కాంతం మాటకి—
‘ఎలా మాట్లాడుతావు కాంతం? అటు ఫ్యాక్టరీ చూస్తే మూతపడేలా ఉంది. జీతాలు ఇప్పటివరకూ ఇవ్వలేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇవన్నీ తెలిసినా నువ్వు ఆవకాయ, మాగాయ అనడం మానడం లేదు. నాకు నిన్ను చూస్తే చాలా కోపం వస్తోంది’ అన్నాడు శర్మ.
‘కోపం రాకుండా ఎలా ఉంటుంది? కానీ రాబోయే రోజులు తలచుకునే ఆవకాయ పెట్టుకుందాం అంటున్నాను. ఏమున్నా లేకున్నా పిల్లలకి ఇంత అన్నం వండి ఆ ఆవకాయ ముక్క పెడితే, వాళ్ళ ఆకలి తీరుతుందని నా ఆశ’ అంటూ చెంగుతో కళ్లు తుడుచుకుని లోపలికి వెళ్ళింది కాంతం.
‘కాంతం చెప్పింది నిజమే కానీ, ఈ రోజుల్లో ఆవకాయ అంటే మాటలా? ఆ కారం, నూనె, ఆవపిండి ధరలు మండిపోతున్నాయి. అవి కొనాలంటే కనీసం వెయ్యి రూపాయలైనా కావాలి. ఇక మామిడికాయలు ఒక్కొక్కటి ఎంత లేదన్నా ముప్పై రూపాయలు చెబుతున్నారు. వీటన్నిటినీ అధిగమించడం ఎలా?’ అనుకుంటూ పిల్లలకి ప్రైవేట్ పాఠాలు చెప్పడానికి వెళ్ళాడు శర్మ. కనీసం ఆ ఫీజులు ఇచ్చినా కొంత భారం తీరుతుంది అనుకుంటూ.. పాఠాలు చెప్పి ఆశగా ఎదురుచూస్తున్నాడు, ఏ పిల్లవాడైనా డబ్బులు ఇస్తాడేమోనని. ఎవరూ డబ్బులు తేలేదనుకుంటా, “వస్తాం మాస్టారు!” అంటూ ఆ రామాలయం అరుగు మీద నుండి పరుగులు తీశారు. తన ఆశ నిరాశ అయిందని అనుకున్నాడు శర్మ.
‘ఒరేయ్ శర్మా! ఎలా ఉన్నావు?’ పలకరించాడు చిన్ననాటి స్నేహితుడు రాఘవ. టెన్త్ వరకు చదివిన బ్యాచ్‌ లో అందరూ ఉద్యోగాలకు వెళ్లగా, శర్మ, రాఘవ ఇద్దరే ఆ పల్లెటూరులో ఉండిపోయారు. శర్మ పక్కనే ఉన్న చిన్న ఫ్యాక్టరీలో పనిచేస్తుంటే, రాఘవ వ్యవసాయం చేసుకుంటున్నాడు.
‘ఏదో అలా ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నాలుగు రోజులుగా కనిపించడం లేదు’ అన్నాడు శర్మ.
‘మామిడికాయలు దింపుతున్నాను, అందుకే తోటలో ఉండిపోయాను. అన్నట్టు నీ కోసం మంచి కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు కోసి పక్కన ఉంచాను. ఆవకాయ పెట్టుకో’ అన్నాడు రాఘవ. మౌనంగా ఉండిపోయాడు శర్మ.
‘నాకు తెలుసురా.. ఆవకాయకి మామిడికాయ ఒక్కటే చాలదని. అందుకే వెంకట్రావు కొట్లో డబ్బులు కట్టాను. నీకు కావలసిన సరుకులు తీసుకో. మళ్ళీ సీజన్ పోతే ఆవకాయ పెట్టుకోలేవు. నీకు అది ఎంత ముఖ్యమో నాకు తెలుసు’ అన్నాడు రాఘవ. తన ఇల్లు రాగానే లోపలికి వెళ్లి, మామిడికాయల మూట తీసుకొచ్చి ఇచ్చాడు. ‘ఇదిగో ఈ సైకిల్ మీద తీసుకువెళ్ళు, అటు వచ్చినప్పుడు తీసుకుంటాను’ అంటూ తన సైకిల్ ఇచ్చాడు.
రాఘవ మామిడికాయలు, మిగతా సరుకులు ఇవ్వడంతో శర్మ గారి ఇంట్లో ఆవకాయ ఘుమఘుమలాడింది.
‘కాంతం! ఓ డబ్బాలో ఆవకాయ పెట్టు, రాఘవకి ఇస్తాను’ అన్నాడు శర్మ.
‘ఇప్పుడే పెడతాను. కిందటిసారి మామిడితోట దెబ్బతినడంతో మనకి కాయలు ఇవ్వలేదు కానీ, మీ స్నేహితుడు రాఘవ అస్సలు మర్చిపోకుండా మామిడికాయలు ఇచ్చాడండీ!’ అంది కాంతం.
కాంతం ఇచ్చిన ఆవకాయ డబ్బా పట్టుకుని రాఘవ ఇంటికి వెళ్ళాడు శర్మ.
‘రాఘవ! నువ్వు సహాయం చేయడం వల్లే ఈ సంవత్సరం మా ఇంట్లో ఆవకాయ పెట్టుకోవడం కుదిరిందిరా!’ అంటూ ఆవకాయ డబ్బా రాఘవకి ఇచ్చి కళ్లు తుడుచుకున్నాడు శర్మ.
‘ఇందులో నా స్వార్థం కూడా ఉందిరా శర్మ! మీ ఇంట్లో పెట్టిన ఆవకాయ అంటే నాకు చాలా ఇష్టం. ఆవకాయ పెట్టగానే నువ్వు నాకు తెచ్చి పెడతావని నాకు తెలుసు. ఇంతవరకు తీసుకురాకపోవడంతో విషయం అర్థం చేసుకున్నాను. నన్ను అడగడానికి కూడా మొహమాటం ఏమిటిరా!’ అంటూ, ‘అదిగో ఆ సంచిలో బంగినపల్లి మామిడిపళ్లు ఉన్నాయి, పిల్లలకి తీసుకువెళ్ళు’ అంటూ శర్మ భుజం తట్టాడు రాఘవ.

కూచిమంచి నాగేంద్ర
9 1 8 2 1 2 7 8 8 0

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్