test1
ఆదివారం, 14 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబడి గంటలు మోగే వేళ..!

2 గంటల క్రితం

perents
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 14, 2026, 01:16 అపరాహ్నం | 5 నిమిషాల చదవడం

వేసవి సెలవుల సరదా, విహారయాత్రలు, తెల్లవారుఝాము వరకూ మేల్కొని టీవీ చూడటం, చిట్టీలతో ఆటలు.. ఇలా సంతోషంగా గడిచిన రోజులు ఇప్పుడు ముగిశాయి. మళ్లీ బడి గంటలు మోగే సమయం వచ్చింది. పిల్లల్ని స్కూలుకు సిద్ధం చేయడం తల్లిదండ్రులకు ఒక సవాల్‌‌గా మారుతుంది. సెలవుల రిలాక్సేషన్‌ నుంచి బడి క్రమశిక్షణ వైపు పిల్లల్ని ఎలా నడిపించాలి? ఈ ప్రయాణంలో పేరెంటింగ్ పాత్ర ఎలా ఉండాలి? ఇవే ఈ కథనం విశేషాలు.


పిల్లలు సెలవుల్లో ఎంత ఆనందంగా ఉంటారో, బడి తెరిచిన మొదటివారం అంత కంగారుగా ఉంటారు. ఉదయం ఆరు గంటలకు నిద్ర లేవడం, టిఫిన్ బాక్స్, యూనిఫాం, బ్యాగ్ సిద్ధం చేసుకోవడం వారికి పెద్ద పనిలా అనిపిస్తుంది. కొంతమంది పిల్లలకు ‘ సెపరేషన్ యాంగ్జయిటీ’ కూడా రావచ్చు. మరికొందరు నేరుగా బడికి వెళ్లడానికి నిరాకరిస్తారు. ఇది పూర్తిగా సహజమే. కానీ దీన్ని ఎదుర్కోవడంలో తల్లిదండ్రుల స్థితప్రజ్ఞత చాలా ముఖ్యం.

ముందస్తు సన్నద్ధత..

చాలామంది తల్లిదండ్రులు బడి తెరిచిన రోజు ముందు రాత్రే పిల్లలకు ‘స్కూల్ టైం’ గుర్తు చేస్తారు. అది సరిపోదు. కనీసం ఒక వారం ముందుగానే పిల్లల దినచర్యను నెమ్మదిగా స్కూలు రొటీన్ కు దగ్గరగా మార్చాలి. ఉదయం ఏడు గంటలకు లేపడం, రాత్రి తొమ్మిది గంటలకు పడుకోబెట్టడం అలవాటు చేయండి. స్క్రీన్ టైమ్ తగ్గించండి. ఆకస్మికంగా మార్పు వచ్చినప్పుడు పిల్లలు తిరస్కరిస్తారు. కానీ, మెల్లిగా చేస్తే వారు స్వీకరిస్తారు.

perents

​పాజిటివ్ టాక్స్‌ అవసరం

“బడి మళ్లీ మొదలైంది కదా.. నీకు నచ్చదు కదూ?” అని ప్రశ్నించొద్దు. బదులుగా “స్కూల్లో నీ స్నేహితులు ఎవరెవరు మిస్ అవుతున్నారు?”, “నీకు బాగా నచ్చే టీచర్ ఎవరు?”, “కొత్త పుస్తకాలు వాసన ఎలా ఉంటుందో తెలుసా?” అంటూ సంభాషణను సానుకూలంగా నడిపించండి. సెలవుల్లో వారికి నచ్చిన పనులు, విహారయాత్రలను గుర్తు చేస్తూ “ఇప్పుడు బడికి వెళ్తే.. సెలవుల్లో నేర్చుకున్న విషయాలు టీచర్ తో షేర్ చేసుకోవచ్చు” అని ప్రోత్సహించండి.

ఓపెన్ కమ్యూనికేషన్

ఇదే కీలకమైన పేరెంటింగ్ స్ట్రాటజీ. పిల్లలు బడికి వెళ్లడానికి భయపడటానికి కారణాలు ఉండవచ్చు. కొత్త క్లాస్, కొత్త టీచర్, హోంవర్క్ భారం, బుల్లింగ్ భయం.. ఇలా చాలా ఉంటాయి. తల్లిదండ్రులు వారి మాటలు ఓపికగా వినాలి. ”నేను చెప్పను. నువ్వేచేసుకో“ అనే కంటే ”చెప్పు.. ఏమి కష్టంగా ఉంది? కలిసి పరిష్కారం వెతుకుదాం” అనే ధోరణి అవసరం. పిల్లలు తమ భావోద్వేగాలను వ్యక్తం చేసుకోవడానికి అనుమతించండి. అప్పుడే వారు ఆత్మవిశ్వాసంతో బడికి వెళతారు.

​మార్నింగ్ రొటీన్ సింపుల్ గా ఉంచండి

​సెలవుల్లో నిద్ర లేవడానికి సమయం లేదు. కానీ బడి రోజుల్లో ఉదయం గొడవలు తల్లిదండ్రులకు తలనొప్పిగా మారతాయి. రాత్రికి రాత్రే బ్యాగ్, యూనిఫాం సిద్ధం చేసి పెట్టుకోవడం అలవాటు చేయండి. ఉదయం అలారం పెట్టుకుని లేవడం, నెమ్మదిగా తయారవడం.. టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్ వాళ్లనే బ్యాగులో సర్దుకోనివ్వండి. ఇది కూడా ఒక సాధనగా మార్చండి. గట్టిగా అరవకుండా, ఓపికగా పిల్లల్ని లేపండి. సంగీతం లేదా వారికి నచ్చిన బ్రేక్ ఫాస్ట్‌ ‌చేసి, వాళ్ల ఉదయాన్ని ఆహ్లాదకరంగా మార్చండి.

​హోంవర్క్ .. ఒత్తిడి కానివ్వొద్దు

బడి తెరిచిన మొదటిరోజుల్లో హోంవర్క్ ఒత్తిడి పెద్దగా ఉండదు. కానీ క్రమంగా పెరుగుతుంది. తల్లిదండ్రులు ‘స్టడీ టైం’ అనే పేరుతో పిల్లలపై ఒత్తిడి తీసుకురావద్దు. దానికి బదులుగా ‘క్వాలిటీ టైమ్’గా మార్చండి. పిల్లల పక్కన కూర్చుని వారు రాయడానికి సహాయం చేయండి. టీచరుతో మాట్లాడండి. పిల్లలు ఏ విషయంలో వెనుకబడి ఉన్నారో తెలుసుకుని, వాళ్లకి సపోర్ట్ చేయండి. హోంవర్క్ చేయకపోతే శిక్షించకండి, సహకరించండి.

perents

స్క్రీన్ టైమ్ నియంత్రణ

అలాగని అదేమీ ఫుల్ బ్యాన్ కాదు.. సెలవుల్లో పిల్లలు మొబైల్, టీవీ, టాబ్లెట్లకు అలవాటు పడతారు. బడి ప్రారంభమైన వెంటనే వాటిని పూర్తిగా నిషేధించడం వల్ల తిరుగుబాటు వస్తుంది. బదులుగా ఒప్పందం చేసుకోండి. ‘ఒక గంట స్క్రీన్ టైమ్, ఆ తర్వాత ఆటల సమయం’ అని నిబంధన పెట్టండి. ఆ స్క్రీన్ టైమ్‌‌లో నాణ్యమైన కంటెంట్ చూపించండి. సాయంత్రం ఆరు గంటల తర్వాత స్క్రీన్లను పూర్తిగా దూరం పెట్టడం మంచిది.

​తల్లిదండ్రులే రోల్ మోడల్స్

పిల్లలు చేసేది వినడం కాదు, చూసి నేర్చుకోవడం. మీరు ఉదయం ఆరు గంటలకు లేవకపోతే, పిల్లలు ఎలా లేస్తారు? మీరు మొబైల్ చూస్తూ వారికి ”స్టడీ చేయి” అంటే ఎంతవరకు ప్రభావం ఉంటుంది? కాబట్టి ముందు మీ దినచర్యను సర్దుబాటు చేసుకోండి. పిల్లలతో కలిసి చదవండి, కలిసి బ్రేక్ ఫాస్ట్‌ చేయండి. ఉదయం వ్యాయామం లేదా వాకింగ్ వెళ్లడం అలవాటు చేసుకోండి. ఇది పిల్లల్లో క్రమశిక్షణను నెమ్మదిగా పెంచుతుంది.

సిద్ధం చేసే యాక్టివిటీలు

  • చిన్న చిన్న ఆటల ద్వారా పిల్లలను స్కూలుకు సిద్ధం చేయవచ్చు.

  •  ‘స్కూల్ రోల్ ప్లే’.. నువ్వు టీచర్, నేను స్టూడెంట్.. ఈ గేమ్ ద్వారా వారు స్కూల్ ఎంజాయ్ చేస్తారు.

  •  ‘సెలవుల ఫొటో ఆల్బమ్’.. సెలవుల్లో తీసిన ఫొటోలతో ఒక చిన్న ఆల్బమ్ తయారుచేసి, దాన్ని క్లాసులో చూపించడానికి ఇవ్వండి. ఇది ఆత్మవిశ్వాసం పెంచుతుంది.

  •  ‘స్టేషనరీ షాపింగ్’ .. పిల్లల్ని తీసుకెళ్లి కొత్త పెన్, నోట్ బుక్, బ్యాగ్ కొనివ్వండి. కొత్త వస్తువుల పట్ల ఆసక్తి స్కూలుపైనా ఉంటుంది.

నిపుణుల సలహా ఏమిటి?

చైల్డ్ సైకాలజిస్టుల ప్రకారం, వేసవి సెలవుల తర్వాత ఒత్తిడి (Post-vacation stress) పెద్దలకే కాదు, పిల్లలకూ వస్తుంది. కాబట్టి మొదటి రెండు వారాల్లో పిల్లలపై విపరీతమైన అంచనాలు పెట్టుకోకూడదు. వారికి ‘సర్దుబాటు టైమ్’ ఇవ్వాలి. తల్లిదండ్రులు కూడా కూల్ గా ఉండాలి. పిల్లవాడు ఏదైనా పొరపాటు చేస్తే.. ‘పర్లేదు, రేపు సరిచేసుకోవచ్చు’ అనే భరోసా ఇవ్వాలి.

వారాంతపు విహారయాత్రలు..

బడిలో వారం రోజుల ఒత్తిడి తర్వాత వారాంతంలో పిల్లలను బయటకు తీసుకెళ్లండి. పార్కు, సినిమా, ట్రెక్కింగ్ లేదా ఇంట్లోనే ఒక క్రాఫ్ట్ యాక్టివిటీ చేయండి. ఇది మెదడుకు విశ్రాంతి ఇస్తుంది. సోమవారం మళ్లీ స్కూలుకు సర్దుబాటు చేసుకోవడానికి సహాయపడుతుంది.

perents

స్కూల్ హోమ్ మధ్య వంతెన

​టీచర్లతో సన్నిహితంగా ఉండండి. పిల్లల ప్రగతిని అడిగి తెలుసుకోవడంలో సంకోచించకండి. స్కూలు సమావేశాలకు హాజరుకావడం, పిల్లలు టీచరుతో కమ్యూనికేట్ చేయడం చాలా ముఖ్యం. కానీ పిల్లలను టీచర్ ముందు తప్పుబట్టే విధంగా మాట్లాడొద్దు. ‘నా పిల్లవాడు చాలా సోమరి’ వంటి లేబుల్స్ అతనికి నష్టం చేస్తాయి. బదులుగా ‘ఇంట్లో కొన్ని మార్పులు చేస్తున్నాం, మీరు కూడా సూచించండి’ అని సహకారం తీసుకోండి. అలాగే పిల్లల ముందే కొందరు తల్లిదండ్రులు టీచర్లను అగౌరవంగా మాట్లాడుతుంటారు. అది సరైంది కాదు. అది తర్వాతర్వాత తల్లిదండ్రుల్నీ నలుగురిలో తక్కువచేసి మాట్లాడేందుకు దారితీస్తుంది.

టీచర్-పేరెంట్ భాగస్వామ్యం

మంచి పేరెంటింగ్ అంటే టీచర్లతో చేతులు కలపడం. పిల్లల స్కూలు డైరీని ప్రతిరోజూ పరిశీలించండి. టీచర్ ఏమైనా రాసి ఉంటే, దాన్ని సీరియస్‌గా తీసుకోండి. అలాగే, ఇంటి విషయాలు కూడా టీచర్‌‌కు తెలియజేయండి. ఉదాహరణకు ‘పిల్లవాడికి నిన్న జ్వరం వచ్చింది, కాస్త జాగ్రత్తగా చూసుకోండి’ వంటి సమాచారం చాలా ఉపయోగపడుతుంది.

​ఏం చేయకూడదు?

పోల్చి మాట్లాడటం: ‘చూడు రాము ఎంత త్వరగా సిద్ధమవుతున్నాడో!` అంటూ పోల్చడం వల్ల పిల్లల ఆత్మగౌరవం దెబ్బతింటుంది.
అతిగా కేరింగ్: ‘అమ్మ లేకుండా బడికి ఎలా వెళ్తావు?’ అంటూ అతిగా చూపించే ఆందోళన పిల్లల్లో భయాన్ని పెంచుతుంది.
శారీరక శిక్ష: నిద్ర లేవకపోతే, హోంవర్క్ చేయకపోతే కొట్టడం పిల్లల పరిస్థితిని మరింత దిగజారుస్తుంది.
స్కూలును నెగటివ్ గా చిత్రించడం: ‘స్కూలుకు వెళ్లకపోతే నిన్ను టీచర్ కొడతారు’ అంటూ బెదిరించడం పిల్లల్లో స్కూలు పట్ల విరక్తి పెంచుతుంది.


​ఓపిక, ప్రేమ, స్థిరత్వం..

వేసవి సెలవుల తర్వాత పిల్లల్ని బడికి సిద్ధం చేయడం రాత్రికి రాత్రి జరిగేపని కాదు. ఇది ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియలో తల్లిదండ్రులు చూపించే ఓపిక, అర్థంచేసుకునే గుణం, స్థిరమైన దినచర్యే విజయానికి మూలం. పిల్లలు చిన్న చిన్న విజయాలతో ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. వారిని ప్రేమగా నడిపించండి.. కానీ గట్టిగా కాదని గుర్తుంచుకోండి. పిల్లలు తమ స్వంత వేగంలో అలవాటుపడతారు. మీరు వాళ్లకి వెన్ను తట్టండి, వాళ్లు బడి బాటలో నమ్మకంగా అడుగులు వేస్తారు.

శాంతిశ్రీ
8333818985


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్