వెండితెరపై ‘దబాంగ్’ గర్ల్‌గా అడుగుపెట్టి, తనదైన శైలిలో మాస్ ప్రేక్షకులను మెప్పించిన సోనాక్షీ సిన్హా, ఇప్పుడు డిజిటల్ తెరపై ఒక పరిణతి చెందిన నటిగా విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. అశ్విని అయ్యర్ తివారీ దర్శకత్వంలో రూపొందిన ‘‘సిస్టమ్’’ సిరీస్‌లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ నేహాగా ఆమె నటన ఒక అద్భుతం. న్యాయం కోసం వ్యవస్థతో పోరాడే ఒక దృఢ సంకల్పం కలిగిన న్యాయవాదిగా ఆమె నటనలో ఒక కొత్త గాంభీర్యం కనిపిస్తుంది. కేవలం మాటలతోనే కాకుండా, కళ్ళతోనే తీక్షణమైన భావాలను పలికిస్తూ, వాదనల్లో పదును చూపిస్తూ సోనాక్షి ఈ పాత్రకు ప్రాణం పోశారు. ప్రేక్షకాదరణ పొందారు. ఈ సందర్భంగా ఆమె గురించి తెలుసుకుందాం.
సోనాక్షీ సిన్హా ముంబైలో జన్మించారు. ఆమె తండ్రి భారతీయ సినీ దిగ్గజం, రాజకీయ నాయకుడు శత్రుఘ్న సిన్హా, తల్లి పూనమ్ సిన్హా. ముగ్గురు సంతానంలో సోనాక్షి అందరికంటే చిన్నది. సినిమా వాతావరణం ఉన్న ఇంట్లోనే ఆమె బాల్యం గడిచింది. సోనాక్షి తన ప్రాథమిక విద్యను ముంబైలోని ఆర్య విద్యామందిర్‌లో పూర్తిచేశారు. ఆ తర్వాత శ్రీమతి నాథీబాయ్ దామోదర్ థాకర్సే (SNDT) ఉమెన్స్ యూనివర్సిటీ నుండి ఫ్యాషన్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. నిజానికి ఆమెకు నటన కంటే ఫ్యాషన్ రంగంపైనే మక్కువ ఎక్కువ. సినీరంగ ప్రవేశానికి ముందు ఆమె కొన్ని సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా కూడా పనిచేశారు.
30 కేజీలు తగ్గి..
సోనాక్షి నటి అవుతారని కుటుంబంలో ఎవరూ ఊహించలేదు. ఒకప్పుడు సుమారు 90 కేజీల బరువు ఉన్న ఆమె, సల్మాన్ ఖాన్ ప్రోత్సాహంతో దాదాపు 30 కేజీల బరువు తగ్గారు. 2010లో సల్మాన్ ఖాన్ పక్కన ‘దబాంగ్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఘనంగా అడుగుపెట్టారు. రాజో అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఆమె చూపిన హావభావాలు, “థప్పడ్ సే డర్ నహీ లగ్తా సాబ్.. ప్యార్ సే లగ్తా హై”(నాకు దెబ్బలంటే భయం లేదు సాబ్.. ప్రేమ అంటేనే భయం వేస్తుంది!) అన్న డైలాగ్ ఆమెను స్టార్‌ను చేశాయి. ఈ ఒక్క డైలాగ్‌తో సోనాక్షి సిన్హా పేరు బాలీవుడ్‌లో మారుమోగిపోయింది. ఆ పాత్రలో ఆమె చూపిన ధైర్యం, కళ్ళలోని తీక్షణత ఆ డైలాగ్‌కు అంతటి పవర్‌ను ఇచ్చాయి. ఇప్పటికీ సోనాక్షి గురించి మాట్లాడితే అందరికీ గుర్తొచ్చే మొదటి డైలాగ్ ఇదే. సోనాక్షి తన కెరీర్‌లో ఇప్పటివరకు సుమారు 40కి పైగా చిత్రాల్లో నటించారు. సోనాక్షి నటనలో సహజత్వం ఉంటుంది. ముఖ్యంగా భావోద్వేగపూరిత సన్నివేశాల్లో ఆమె కళ్ళతోనే అభినయిస్తారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంచుకుంటూ తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకున్నారు. కేవలం నటిగానే కాకుండా, అద్భుతమైన గాయనిగా, చిత్రకారిణిగా కూడా ఆమె తన బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటున్నారు.


గాయని కూడా..
కేవలం నటన మాత్రమే కాదు, సోనాక్షికి మంచి గాత్రం కూడా ఉంది. 2015లో ‘ఆజ్ మూడ్ ఇష్కోహోలిక్ హై’ అనే సింగిల్ సాంగ్‌తో గాయనిగా పరిచయమైంది. తన సినిమాల్లోని కొన్ని పాటలకు కూడా ఆమె గొంతు అందించింది. 2016లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, ఒకేసారి అత్యధిక మంది మహిళలు గోళ్ళకు రంగు వేసుకునే కార్యక్రమంలో పాల్గొని, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. సోనాక్షికి జంతువులంటే చాలా ప్రాణం. ‘పెటా’ (PETA) సంస్థతో కలిసి కుక్కలు, పిల్లుల సంరక్షణ కోసం ఆమె అనేక ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. హాలీవుడ్ యానిమేషన్ చిత్రం ‘రియో 2’ (Rio 2) హిందీ వెర్షన్‌లో ‘జ్యువెల్’ అనే పక్షి పాత్రకు ఆమె డబ్బింగ్ చెప్పారు.
కీలక ప్రాతల్లో..
‘‘రౌడీ రాథోడ్’’ (Rowdy Rathore, 2012) బాలీవుడ్ సినిమాలో ‘పార్వతి’ ప్రాతలో నటించారు. హీరో అక్షయ్ కుమార్ పక్కన చాలా సరదాగా, చురుకైన పాత్రలో మెప్పించారు. ఈ సినిమా ఆమెకు మాస్ ఆడియన్స్‌లో మంచి గుర్తింపు తెచ్చింది. లూటెరా (Lootera, 2013) లో పాఖీ రాయ్ చౌదరి ప్రాతలో సోనాక్షి కెరీర్‌లో అత్యుత్తమ నటన కనబరిచిన చిత్రం ఇది. క్షయ వ్యాధితో బాధపడుతూ, ప్రేమ కోసం పరితపించే యువతిగా ఆమె పండించిన భావోద్వేగాలు విమర్శకుల ప్రశంసలు పొందాయి. ఆ తర్వాత ‘‘అకిరా’’ చ్రితంలో ‘అకిరా శర్మ’ ప్రాతలో మొదటిసారి పూర్తిస్థాయి యాక్షన్ హీరోయిన్‌గా కనిపించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే కాలేజీ స్టూడెంట్‌గా ఆమె నటన చాలా అద్భుతంగా ఉంటుంది. ‘‘మిషన్ మంగళ్’’ చిత్రంలో ‘ఎకా గాంధీ’ ప్రాతలో ఒక స్వతంత్ర భావాలున్న మోడ్రన్ సైంటిస్ట్‌గా, ఇస్రో మిషన్‌లో కీలక పాత్ర పోషించే యువతిగా తన నటనతో కథకు బలాన్ని ఇచ్చారు. ‘‘దహాద్’’ వెబ్ సిరీస్ లో‘అంజలి భాటి’ ప్రాతలో పోలీసు ఆఫీసర్ ప్రాతలో నటించారు. డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతూ చేసిన ఈ పాత్రలో చాలా సీరియస్ అండ్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ‘‘హీరామండి’’ లో ‘ఫరీదాన్/రెహానా’ పాత్రలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో గంభీరమైన, ప్రతీకారేచ్చ ఉన్న పాత్రలో తన నటనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు.
గతంలో ‘లూటెరా’ వంటి చిత్రాల్లో సున్నితమైన భావోద్వేగాలను, ‘అకిరా’ లో ధైర్యసాహసాలను ప్రదర్శించిన సోనాక్షి, ఇప్పుడు ‘‘సిస్టమ్’’ వెబ్ సిరీస్‌లో ‘నేహ’ పాత్రలో ఆ రెండింటి కలయికను అద్భుతంగా పండించారు. ఇందులో మరో హీరోయిన్ జ్యోతిక కూడా ఉన్నారు. వృత్తిపరమైన బాధ్యతలకు, వ్యక్తిగత సంఘర్షణలకు మధ్య నలిగే నేహా పాత్రలో సోనాక్షి కనబరిచిన నైపుణ్యం చూస్తుంటే, ఆమె కెరీర్‌లోనే ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుం దనడంలో సందేహం లేదు. తన గత చిత్రాల కంటే భిన్నంగా, ఒక క్లాస్ అండ్ మాస్ ఎలివేషన్‌తో సాగే ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.
పేరు : సోనాక్షి సిన్హా
పుట్టిన తేది : 1987, జూన్ 2న
అన్నయ్యలు :
లవ్ సిన్హా- నటుడు, రాజకీయ నాయకుడు.
కుష్ సిన్హా- షార్ట్ ఫిలిమ్స్, యాడ్ ఫిలిమ్స్ డైరెక్టర్.








కామెంట్‌లు (0)