test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బుచ్చిబాబు సినిమాల ‘ఉప్పెన’

31 మే, 2026

Buchi Babu's Cinematic 'Tidal Wave'
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 31, 2026, 02:56 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

టాలీవుడ్ సంచలనం బుచ్చిబాబు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణే విజయానికి పునాది. ఈ మాటలకు నిలువెత్తు సంతకం ‘పెద్ది’ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా. ‘కష్టేఫలే’ అన్న మాటను ఆయన ఒంటబట్టించుకున్నారు. ‘సత్తా చాటేస్తా’ అంటూ సినిమా బరిలోకి దిగేశారు. సినిమా ఇండస్ట్రీకి ‘ఉప్పెన’ తెచ్చారు. డబ్బు, కులం, మతం, ప్రాంతం ప్రాణాన్ని నిలబెట్టవు. మానవత్వం, మానవీయ విలువలు, పరస్పర ప్రేమ, ధైర్యం, బలం ఉంటే ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చనే సందేశాన్ని ఇచ్చారు. ఆ ‘ఉప్పెన’ కెరటాలు ఇప్పుడు ‘పెద్ది’ రూపంలో బలంగా తాకబోతున్నాయి. సుకుమార్ శిష్యుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన బుచ్చి, తనదైన పంథాలో ముందుకు సాగుతూ అందరితోనూ శభాష్ అనిపించుకుంటున్నారు. తన దర్శకత్వంలో వాస్తవికత, నిజజీవితాన్నే కథగా మలిచిన ‘పెద్ది’ సినిమా జూన్ 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వెంకటరావు, గంగాభవానీ కుమారుడే బుచ్చిబాబు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరు ఇప్పుడు ఒక సంచలనం. చేసింది ఒక్క సినిమానే అయినా, క్రేజ్ మాత్రం ఓ రేంజ్‌లో సంపాదించుకున్నారు. తొలి చిత్రం ‘ఉప్పెన’తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత కొంత విరామం తీసుకుని, ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ‘పెద్ది’ అనే పాన్ ఇండియా చిత్రం తెరకెక్కిస్తున్నారు. తల్లిదండ్రుల కోరిక మేరకే ఆయన సినిమాల్లోకి వచ్చారు. డబ్బు కోసం తాను ఇండస్ట్రీకి రాలేదని, సినిమాలపై ఉన్న ప్యాషన్‌తోనే ఈ రంగంలోకి అడుగుపెట్టానని చెబుతుంటారు. ప్రాథమిక, మాధ్యమిక విద్య అంతా కాకినాడ పరిసర ప్రాంతాల్లోనే సాగింది. డిగ్రీలో ఆయనకు లెక్కలు బోధించిన లెక్చరర్ సుకుమార్, సినిమాల్లోనూ గురువయ్యారు. సుకుమార్ వద్ద ప్రధాన సహాయ దర్శకుడిగా పనిచేశారు. ‘ఆర్య 2’, ‘రంగస్థలం’, ‘నాన్నకు ప్రేమతో’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సేవలందించారు.

మొదటి సినిమాకే ప్రశంసల ‘ఉప్పెన’..
తొలి చిత్రంగా ‘ఉప్పెన’ (2021) తెరకెక్కించి, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. కొత్త వారితో రూపొందించిన ‘ఉప్పెన’కు బాక్సాఫీస్ టైమింగ్ భలేగా కలిసొచ్చింది. ఇప్పుడు ‘పెద్ది’ సినిమా ప్రోమోలు కూడా మంచి స్పందన తెచ్చుకుంటున్నాయి. దీనికి తోడు బాక్సాఫీస్ పరిస్థితులు కూడా ఈ చిత్రానికి అనుకూలంగా కనిపిస్తున్నాయి. బుచ్చిబాబుకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఎంతో ఇష్టం. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేకమైన అభిమానం. వారి సినిమాలు విడుదలైతే అదేరోజు చూసే అలవాటు ఉండేది. సినిమాల కోసం హైదరాబాద్‌కు వెళ్లినప్పుడు “నాన్నా.. ముందు జీవితంలో స్థిరపడు. ఆ తర్వాత సినిమాలు చేసేద్దువు” అంటూ కుటుంబసభ్యులు నచ్చజెప్పారు. వారిని నొప్పించడం ఇష్టం లేక హైదరాబాద్‌లో ఎంబీఏ క్లాసులకు ఒకపూట వెళ్లి, మరోపూట దర్శకుడు సుకుమార్ డైరెక్షన్ విభాగంలో చేరి పనిచేశారు. ఎమోషనల్ ప్రేమకథకు సెన్సిబుల్ ప్రెజెంటేషన్‌తో తెరకెక్కించిన ‘ఉప్పెన’లో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి వంటి కొత్త నటీనటులతో పెద్ద ప్రయోగమే చేశారు. సరికొత్త కంటెంట్, ఎంతో రిస్క్ ఉన్నప్పటికీ, కొత్త దర్శకుడు అనే భావన రాకుండా అనుభవజ్ఞుడిలా తెరకెక్కించాడనే ప్రశంసలు వచ్చాయి. ‘ఉప్పెన’ తర్వాత రెండో చిత్రమే ‘పెద్ది’. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నేపథ్యంలో, క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌తో సాగే అద్భుతమైన కథగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ కథను ఆయన కొన్నేళ్ల క్రితమే సిద్ధం చేసుకున్నారు. ‘గేమ్ ఛేంజర్’ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రమే ‘పెద్ది’. జాన్వీకపూర్ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాతో ఒక సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నారు. 1980 కాలం నాటి రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. టైటిల్ కార్డ్ పడినప్పటి నుంచి ఎండ్ కార్డ్ వరకూ ప్రేక్షకుడు కథలో లీనమైపోయేలా చిత్రాన్ని తీర్చిదిద్దారు. కథ విన్న క్షణం నుంచే ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఎంతో ఉత్సాహంగా, ప్రత్యేక శ్రద్ధతో సంగీతం అందించారు. డీఓపీ రత్నవేల్ తన కెరీర్ బెస్ట్ విజువల్స్ అందించారు. కళా దర్శకుడు అవినాష్ కొల్లా, ఆ కాలం వాతావరణాన్ని ప్రతిబింబించేలా అద్భుతమైన సెట్స్ నిర్మించారు. కథకు సహజత్వం తీసుకురావడానికి శ్రీలంక, పూణే, ఢిల్లీ వంటి వాస్తవ లొకేషన్లలో షూటింగ్ నిర్వహించారు. బుచ్చిబాబు

ప్రయోగం.. మాండలికం..
‘పెద్ది’ సినిమాలో బుచ్చిబాబు చేసిన మరో ముఖ్యమైన ప్రయోగం మాండలికం, యాస. సినిమాల్లో వీటిని ఉపయోగించడం ద్వారా ఆ ప్రాంత జీవన విధానం, సంస్కృతి, కట్టుబొట్లు సహజంగా తెరపై కనిపిస్తాయని ఆయన భావిస్తున్నారు. దీనివల్ల ప్రేక్షకులు పాత్రలతో సులభంగా కనెక్ట్ అవుతారని అంటున్నారు. మట్టి కథలకు సహజత్వాన్ని అద్దడానికి, కథానాయకుల పాత్రల్లో సైతం యాసను ఉపయోగించిన ‘కేరింత’, ‘కంచె’, ‘మత్తు వదలరా’, ‘తండేల్’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి చిత్రాలు అఖండ విజయాన్ని సాధించాయని గుర్తుచేస్తున్నారు. తెలంగాణ యాసను ఒకప్పుడు విలన్లకే పరిమితం చేసేవారని, ఇప్పుడు స్టార్ హీరోలు సైతం ఆ యాసలో మాట్లాడి, ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారని చెబుతున్నారు. ‘ఫిదా’, ‘దసరా’, ‘బలగం’, ‘జాతిరత్నాలు’ ఇందుకు ఉదాహరణలని పేర్కొంటున్నారు. ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’లో కొమురం భీమ్ పాత్రలో, రవితేజ ‘వాల్తేరు వీరయ్య’లో తెలంగాణ యాసలో సంభాషణలు పలికారు. ‘రంగస్థలం’, ‘పుష్ప’, ‘నాగరాజ చోళన్ ఎంఏ’, బోయపాటి శ్రీను దర్శకత్వంలోని అనేక మాస్ యాక్షన్ చిత్రాల్లో సీమ లేదా కోస్తా-సీమ మిశ్రమ యాస వినిపిస్తోంది. తెలంగాణ మాదిరిగానే ఉత్తరాంధ్ర యాస కూడా ఇప్పుడు సినిమాల్లో మంచి ప్రాచుర్యం పొందుతోంది.

– యడవల్లి శ్రీనివాసరావు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్