వెండితెరపై కొందరు నటీమణులు కేవలం అందంతోనే కాదు, అద్భుతమైన నటనతో, అంతకు మించిన సాహసాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తారు. సరిగ్గా ఇదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు యువ నటి ప్రీతి ముకుందన్. దశాబ్దాలుగా వెండితెరపై తన మార్క్ యాక్షన్‌తో ‘యాక్షన్ కింగ్’గా మెస్మరైజ్ చేస్తున్న హీరో అర్జున్ సర్జా లీడ్ రోల్‌లో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చ్రితం ‘బ్లాస్ట్’. ఈ చిత్రంలో అర్జున్ కు కూతురిగా, ఒక పవర్‌ఫుల్ కరాటే ఫైటర్‌గా ప్రీతి ముకుందన్ నటించిన తీరు థియేటర్లలో ఈలలు వేయిస్తోంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ఒక యాక్షన్ క్వీన్‌లా మారి ఆమె చేసిన కరాటే ఫైట్స్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పుట్టినతేది : జులై 30, 2001.
మలయాళం (సర్వం మాయ).

తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో ప్రీతి ముకుందన్ జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ వృత్తిరీత్యా వైద్యులు. విద్యా నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో చిన్నతనం నుంచే చదువులో చురుకుగా ఉండేవారు. చదువుతోపాటు ఇతర కళల్లోనూ ఆమె చురుగ్గా పాల్గొనేవారు. ఆమె పాఠశాల విద్యాభ్యాసం తిరుచ్చిలోనే సాగింది. చదువుకుంటూనే భరతనాట్యంతో పాటు వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకున్నారు. సోషల్ మీడియాలో ఆమె చేసే డ్యాన్స్ వీడియోలకు మిలియన్లలో వ్యూస్ వస్తుంటాయి. చిన్నప్పటి నుంచి నటన, మోడలింగ్, నృత్యం (డ్యాన్స్) అంటే ప్రీతికి ఎంతో ఆసక్తి. ప్రతిష్టాత్మక విద్యాసంస్థ అయిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT, Trichy) లో బీటెక్ (B.Tech) పూర్తి చేశారు. సాంకేతిక రంగంలో మంచి చదువు చదివినప్పటికీ, కళలపై ఉన్న ఆసక్తి ఆమెను సినీ పరిశ్రమ వైపు నడిపించింది. తల్లిదండ్రులు కూడా ఆమెకు మద్దతు ఇచ్చారు.
మ్యూజిక్ ఆల్బమ్స్‌తో క్రేజ్
బీటెక్ చదువుతున్న రోజుల్లోనే ప్రీతి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. పలు బ్రాండ్స్ కోసం మోడల్‌గా పనిచేశారు. అదే సమయంలో తన క్లాసికల్, మోడరన్ డ్యాన్స్ నైపుణ్యాలతో సోషల్ మీడియాలో, మ్యూజిక్ ఆల్బమ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రీతి ముకుందన్ కెరీర్‌లోనే అత్యంత
ప్రజాదరణ పొందిన వీడియో “ముట్టు ముట్టు”. ఇది ఒక ఫుల్ జోష్ అండ్ ఎనర్జిటిక్ పాట. ఈ పాటలో ప్రీతి తన అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్, ట్రెడిషనల్ కమ్ మోడ్రన్ లుక్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్స్‌తో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నారు. యూట్యూబ్‌లో ఈ పాట విడుదలైన కొద్దిరోజుల్లోనే మిలియన్ల వ్యూస్ సాధించి, రీల్స్ లో ట్రెండ్ అయింది. దాంతో తమిళ, తెలుగు ఆడియన్స్‌కు ప్రీతి బాగా పరిచయం అయిపోయారు. ఇలా ఎన్నో పాటలకు తన డ్యాన్స్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
సినిమా అవకాశాలు..
ఈ మ్యూజిక్ ఆల్బమ్స్ వైరల్ అవ్వడం వల్ల దర్శకులకు, నిర్మాతలకు ప్రీతి స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్ స్కిల్స్ ముందే తెలిసిపోయాయి. ఆమెలోని ఈ ప్రతిభను గమనించిన సినిమా మేకర్స్ ఆమెకు ఆడిషన్స్ అవకాశాలు ఇచ్చారు. అలా చదువు పూర్తయిన వెంటనే సినిమాల్లోకి అడుగుపెట్టి, హీరోయిన్‌గా ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రీతి ముకుందన్ చాలా తక్కువ సమయంలోనే తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో సినిమాలు చేశారు. తెలుగులో ‘‘ఓం భీమ్ బుష్’’ చిత్రంలో హీరో శ్రీవిష్ణుతో కలిసి నటించారు. ఈ హార్రర్ అండ్ కామెడీ సినిమాలో ప్రీతి ఒక కీలకమైన పాత్రలో నటించారు. ఇందులో అమాయకంగా తన క్యూట్ లుక్స్, నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ముగ్గురు క్రేజీ హీరోల (శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ) మధ్య సాగే ఈ హార్రర్, కామెడీ డ్రామాలో తనదైన నటనతో కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందించారు. ఆ తర్వాత హీరో మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పౌరాణిక, జానపద చిత్రం, పాన్ ఇండియా మూవీ ‘‘ కన్నప్ప’’లో ప్రీతి ముకుందన్ మెయిన్ హీరోయిన్‌గా ఎంపికయ్యారు. ఈ భారీ చిత్రంలో శివభక్తుడైన కన్నప్ప భార్య పాత్రలో ఆమె కనిపించారు. ఇందులో ఆమె యాక్షన్ అద్భుతంగా ఉంది. ఇది ఆమె కెరీర్‌కు మైలురాయిగా మారింది.
కరాటే నేర్చుకుని..
సుభాష్ కె రాజ్ దర్శకత్వంలో తీసిన ‘‘బ్లాస్ట్’’ (Blast Zone) మే 28న విడుదలైంది. ఈ సినిమాలో ఆమె ‘యాక్షన్ కింగ్’ అర్జున్ కూతురి పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ సినిమా బ్యాక్‌డ్రాప్ మొత్తం కరాటే చుట్టూ తిరుగుతుంది. ‘బ్లాస్ట్’ సినిమాలో ప్రీతి కేవలం డైలాగులు చెప్పే సాధారణ పాత్ర చేయలేదు. అన్యాయాన్ని ఎదిరించే కరాటే మాస్టర్ (అర్జున్) కూతురిగా, తండ్రికి తగ్గ తనయగా సరిసమానమైన యాక్షన్ సీన్స్ చేశారు. ఈ పాత్ర కోసం ఆమె ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్, కరాటే శిక్షణ తీసుకున్నానన్నారు. సినిమాలో ఇంట్లోకి విలన్లు వచ్చినప్పుడు చేసే ఫైట్స్, కాలితో ‘హై కిక్స్’ కొట్టే సీన్లలో ప్రీతి నటన, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను అబ్బురపరిచాయి. యాక్షన్ కింగ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం, యాక్షన్‌లో ఆయనకే పోటీ ఇచ్చే విధంగా ‘అదిరిపోయే కరాటే గర్ల్’గా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు.








కామెంట్‌లు (0)