test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionజీవితకథలే ఆయన సినిమాలు

12 మే, 2026

vipn das
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 12, 2026, 06:39 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

విపిన్ దాస్‌కు వినూత్నమైన కథలు చెప్పడం అంటే చాలా ఇష్టం. ఆ కథల్లో వాస్తవం ఉంటుంది. మన ఇంట్లో జరిగిన సంఘటనే కదా అనిపిస్తుంది. కొన్ని పాత్రలు మనతో నేరుగా మాట్లాడుతున్నట్లు అనిపిస్తోంది. కొన్ని సంఘటనలు మనసుల్ని కదిలిస్తాయి. కొన్ని సంఘటనలు గత జ్ఞాపకాల్ని తట్టి లేపుతాయి. అదే ఆయన కథల్లో ఉన్న నిజాయితీ. తీసింది తక్కువ సినిమాలు, తక్కువ బడ్జెట్ అయినా.. కోట్ల లాభాలు సంపాదించి పెడుతున్నాయి. సమాజం, తల్లిదండ్రుల దృష్టిలో ఈ పిల్లలు పనికిరాని వారని ముద్రపడిన కొంతమంది యువకుల కథతో ‘వాళా` చ్రితం తెరకెక్కించారు. ఏప్రిల్ 24న విడుదలై యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

మలయాళ దర్శకుడు విపిన్ దాస్ కేరళ రాజధాని తిరువనంతపురంలోని మాంగాట్టుకడవులో జన్మించారు. చదువుకుంటున్న రోజుల్లో సాంస్కృతిక, సాహిత్యరంగంలో ఎక్కువగా పాల్గొనేవారు. ఆయన రచనల్లో సృజనాత్మకత స్పష్టంగా కనిపించేది. విపిన్ దాస్ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. ఆర్థిక, సామాజికాంశాలను చాలా దగ్గరగా చూసి, అర్థం చేసుకున్నారు. ఐటి రంగంలో ప్రవేశించి, చదువు పూర్తిచేశారు. ఆయన ఒక అడ్వర్టైజింగ్ కంపెనీలో ఐటీ ప్రొఫెషనల్‌గా, క్రియేటివ్ రైటర్‌గా చాలా సంవత్సరాలు పనిచేశారు.

ఉద్యోగం వదిలి..
కథల పట్ల తనకున్న ఆసక్తితో, స్థిరమైన ఉద్యోగాన్ని వదిలి సినిమా వైపు అడుగులు వేశారు. ఆయన ఏ పెద్ద దర్శకుడి వద్ద అసిస్టెంట్‌గా పని చేయలేదు. కేవలం ఆయన కథల శైలి మీద ఉన్న నమ్మకంతోనే సినిమా రంగంవైపు వచ్చారు. షార్ట్ ఫిలిమ్స్, ప్రకటనలు చేస్తూ సినిమా మెళకువలు నేర్చుకున్నారు. తన సినిమాల్లో తల్లిదండ్రులు – పిల్లల మధ్య ఉండే అనుబంధాలను ఆయన చూపించే విధానం తన సొంత పరిశీలనల నుండే వస్తుందని పలు ఇంటర్వ్యూలలో విపన్ దాస్ పేర్కొన్నారు.

దర్శకుడిగా..
విపిన్ దాస్ మొదటి సినిమా ”ముదుగావ్ “(Mudhugauv – 2016).. ఒక విచిత్రమైన సమస్యతో బాధపడే విలక్షణమైన డాన్ గురించిన ఒక సాహస హాస్య చిత్రం. ఇందులో హీరో భరత్ (గోకుల్ సురేష్) కంగారుగా ఉన్నా లేదా సంతోషంగా ఉన్నా, తన పక్కన ఉన్నవారిని ముద్దుపెట్టుకునే అలవాటు ఉంటుంది. నటుల్లో ఒకరు రామకృష్ణన్ బోనకాడ్ అలియాస్ రాంబో (విజయ్ బాబు), ఒక డాన్. విచిత్రమైన కథతో పాటూ నటులు కూడా చాలా బాగా నటించారు. ఈ సినిమా చూసి, ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. మలయాళ ప్రేక్షకులకు, అభిమానులకు ఈ సినిమా ఎంతగానో వినోదం పంచింది. ఆ తర్వాత తెలుగులోనూ విడుదల చేశారు. విజయాన్ని అందుకున్నారు. తర్వాత ”అంత్యాక్షరి“ (Antakshari – 2022) తీశారు. ఈ కథ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దాస్ (సాయిజు కురుప్) చుట్టూ తిరుగుతుంది. దాస్ కి అంత్యాక్షరి ఆడటం అంటే ప్రాణం. కథలో మలుపు.. ఒక అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి, దాస్‌ను అంత్యాక్షరి ఆడమని ఛాలెంజ్ చేసి, అతని సహనానికే పరీక్ష పెడతాడు. ఈ సినిమా కేవలం క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు, సమాజంలోని కొన్ని చీకటి కోణాలను కూడా సున్నితంగా బయటపెడుతుంది. ఆ తర్వాత ”జయ జయ జయ జయ హే (2022)“ సినిమా తీశారు. బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అయిన సినిమా. ”గురువాయూర్ అంబల నదయిల్ “(2024): పృథ్వీరాజ్, బాసిల్ జోసెఫ్‌లతో తీసిన బ్లాక్ బస్టర్ కామెడీ సినిమా. ఇవన్నీ ప్రజాదారణ పొందిన సినిమాలు. మంచి విజయాన్ని సంపాదించి పెట్టాయి.

మనసులను దగ్గర చేసిన ‘వాళా`
విపిన్ దాస్ కేవలం స్టార్ల మీద ఆధారపడకుండా, కథలోని బలాన్ని నమ్మి, సినిమాలు తీస్తారని ‘వాళా’ సినిమా మరోసారి నిరూపించింది. విపన్ దాస్ దీనికి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించారు. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ ఒత్తిడి ఎదుర్కొనేది విద్యార్థి. కావాల్సినవన్నీ సమకూరుస్తున్నామని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ మనకు ఇష్టమైంది మాత్రం చదవనీయరు. తాను ఇంజినీర్‌ అవలేకపోయాననో.. డాక్టర్‌ను కాలేకపోయాననో పిల్లల్ని అదే చదవమంటారు. క్లాస్‌ టాపర్‌గా వచ్చినా, యూనివర్సిటీ టాపర్‌గా నిలవాలంటారు. ‘వాళా’లోనూ అదే చూపిస్తారు. కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రం మన అమ్మానాన్నలే అండగా నిలుస్తారు. భరోసా ఇస్తారు. పతాక సన్నివేశాలు చూస్తే, కన్నీళ్లు ఆగవు. గుండెలు బరువెక్కుతాయి. చదువు సరిగా రాని వాళ్ల కథ ఇలా ఉంటే, కాలేజ్‌ టాపర్ అయిన విద్యార్థి పరిస్థితి కూడా కష్టంగానే ఉంటుంది. ఉద్యోగం లేక, తల్లిదండ్రుల మీద ఆధారపడలేక చాలా బాధపడతాడు. ఇటువంటి కథలు, సన్నివేశాలు అన్నీ మనం ఏదో ఒక దశలో ఎదుర్కొనే ఉంటాము. అదే విపిన్ దాస్ పట్టుకొని, మనముందు ఉంచుతున్నారు. అదే ఆయన విజయ రహస్యం.​

– పేరు : విపిన్ దాస్

పుట్టిన తేది : జనవరి 1, 1984

తండ్రి: హరిదాస్,

తల్లి: గీతా కుమారి.

వృత్తి: దర్శకుడు, రచయిత, ఛాయాగ్రాహకుడు, నిర్మాత .

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్