test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవిజ్ఞాన సర్వస్వం

24 మే, 2026

book
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 24, 2026, 10:25 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

విశ్వం ఎలాగైతే బిగ్ బ్యాంగ్ ద్వారా అన్ని శక్తులను, పదార్థాలను విడుదల చేసిందో.. ఈ పుస్తకం కూడా సైన్స్, హిస్టరీ, సమాజం, మానవ సంబంధాలు, ఆర్థిక వ్యవస్థ, క్రీడలు వంటి అన్ని రంగాల విజ్ఞానాన్ని ఒకేచోట గుప్పించి, పాఠకుల ముందుకు రచయిత తీసుకొచ్చారు. విశ్వానికి బిగ్ బ్యాంగ్ ఎలాగైతే ఒక ప్రారంభ బిందువో, అలాగే ఈ పుస్తకం చదివిన వారికి అన్ని విషయాలపై ఒక ప్రాథమిక అవగాహన, విశ్లేషణ దొరుకుతుందనే ఉద్దేశంతో ‘బిగ్ బ్యాంగ్` పేరు పెట్టి ఉండవచ్చు. సైన్స్, గణితం, సామాజిక విప్లవాలు, క్రీడలు, మానసిక వికాసం, అంతరిక్ష పరిశోధనలు.. ఇలా ఏ ఒక్క రంగానికో పరిమితం కాకుండా, ఒక సంపూర్ణ విజ్ఞాన సర్వస్వాన్ని అందించే ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది.
గణితాన్ని కేవలం అంకెలుగా కాకుండా విశ్వాన్ని నడిపించే ఒక అద్భుతశక్తిగా అభివర్ణించారు. ‘విశ్వమంతా గణితమయం` అని ప్రకృతిలోని ప్రతి సృష్టి వెనుక, నక్షత్రాల గమనం వెనుక దాగున్న గణిత సూత్రాలను ఈ వ్యాసం విశ్లేషిస్తుంది. గణితం లేనిదే ఏ శాస్త్రమూ ముందుకు సాగదని తన వ్యాసం ద్వారా రచయిత పేర్కొన్నారు. భారతదేశం గర్వించదగ్గ గణిత మేధావి రామానుజన్ జీవితాన్ని, ఆయన ప్రతిభను స్ఫూర్తిగా తీసుకుంటూ, నేటి తరంలో గణితం పట్ల భయాన్ని పోగొట్టి, ఆసక్తిని ఎలా పెంచాలో ఈ వ్యాసంలో అద్భుతంగా చర్చించారు.
‘విశ్వమానవాళి సంక్షేమం సైన్సు’, ‘ఇస్రో విన్నింగ్ సెంచరీ’ వంటి వ్యాసాల ద్వారా మానవ వికాసానికి సైన్స్ ఏవిధంగా తోడ్పడుతుందో ఆచరణాత్మక కోణంలో వివరించారు. సైన్స్ అనేది కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాదని, అది మానవాళి ఆకలి, రోగాలు, మూఢనమ్మకాలను తొలగించి, సంక్షేమాన్ని చేకూర్చే సాధనమని రచయిత నొక్కి చెప్పారు. అంతరిక్ష రంగంలో భారతీయ శాస్త్రవేత్తలు సాధించిన విజయ కేతనాన్ని, శతాధిక ఉపగ్రహాల ప్రయోగాల ద్వారా ఇస్రో ప్రపంచ వేదికపై సాధించిన అగ్రస్థానాన్ని ఇందులోని వ్యాసం విశ్లేషణాత్మకంగా ప్రతిబింబిస్తుంది. ‘అంబేద్కర్ స్ఫూర్తి’ , వంటి వ్యాసాల్లో సామాజిక కోణాన్ని, సమాజ శ్రేయస్సు పట్ల రచయితకు ఉన్న తపనను తెలియజేస్తాయి. సమాజంలో సమానత్వం, హక్కుల సాధన కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన స్ఫూర్తిని నేటి సమకాలీన పరిస్థితులకు అన్వయిస్తూ రాసిన వ్యాసం బాగుంది. వెనుకబడిన వర్గాల హక్కులు, వారి సామాజిక, రాజకీయ ఎదుగుదలకు ఐక్యత ఎంత అవసరమో చారిత్రాత్మక ఆధారాలతో, బలమైన విశ్లేషణతో రచయిత ‘బీసీల ఐక్యత-ఓ చారిత్రాత్మక అవసరం` వ్యాసంలో ప్రస్తావించారు.
స్వామి వివేకానంద భావజాలాన్ని నేటి భారతదేశ ఆకలి కేకలతో ముడిపెడుతూ రాసిన అత్యంత హృద్యమైన వ్యాసం‘ఆకలి చావులు లేని భారతమే వివేకానంద స్వప్నం’. ఆధ్యాత్మికత అంటే కేవలం పూజలు మాత్రమే కాదు, తోటి మనిషి ఆకలి తీర్చడమే పరమార్థం అని వివేకానందుడు నమ్మారు. దేశంలో దారిద్ర్యం, ఆకలిచావులు లేని రోజే వివేకానందుడికి నిజమైన నివాళి అని రచయిత ఎంతో ఆవేదనతో, బాధ్యతాయుతంగా విశ్లేషించారు. పట్టుదల, కఠోర శ్రమ ఉంటే ప్రతి ఒక్కరూ తమ రంగంలో ‘సచిన్ టెండూల్కర్’ లాగా శిఖరాగ్రానికి చేరుకోవచ్చని క్రీడా స్ఫూర్తితో వివరించిన వ్యాసం ‘మనందరిలో ఓ సచిన్ ఉంటాడు’. పుస్తకాలు కేవలం జ్ఞానాన్ని మాత్రమే కాదు, జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పుతాయని, మంచి పుస్తకాలతో స్నేహం మనిషిని ఎలా మారుస్తుందో ‘జీవిత పాఠాలను నేర్పిన పుస్తకాలు’ వ్యాసంలో రచయిత తన అనుభవాల ద్వారా పంచుకున్నారు. గమ్యాన్ని చేరడం మాత్రమే కాదు, జీవితం అనే ప్రయాణాన్ని ప్రతి క్షణం ఆస్వాదించడం, కష్టనష్టాలను తట్టుకుంటూ సాగిపోవడమే అసలైన జీవన తత్వమని ‘జర్నీని ప్రేమిద్దాం` వ్యాసం బోధిస్తుంది.
ఇటీవలే కన్నుమూసిన ప్రముఖ కమ్యూనిస్ట్ మేధావి, ప్రజా నాయకుడు సీతారాం ఏచూరి గారి జీవితానికి, ఆయన సిద్ధాంత పటిమకు అర్పించిన అద్భుతమైన నివాళి ‘అస్తమయం లేని ఓ అరుణతార`వ్యాసం. విలువలతో కూడిన రాజకీయం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఆయన పోషించిన కీలకపాత్రను, సమాజంపై ఆయన వేసిన చెరగని ముద్రను రచయిత ఎంతో గౌరవపూర్వకంగా విశ్లేషించారు.
దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తీసిన ‘బాహుబలి`, RRR చిత్రాల ద్వారా తెలుగు సినిమాను, భారతీయ సంస్కృతిని ఆస్కార్ వంటి అంతర్జాతీయ వేదికలపై ఎలా నిలబెట్టారో ‘విశ్వసినీ వేదికపై మన దర్శక బాహుబలి` వ్యాసంలో అభినందించారు. ప్రాంతీయ సరిహద్దులు దాటి ప్రపంచాన్ని గెలిచిన మన సినిమా కథను ఇది ఆవిష్కరిస్తుంది. ‘వినేశ్.. మా కోహినూర్ వజ్రం` వ్యాసంలో ఒలింపిక్స్ వేదికపై, వ్యక్తిగత జీవితంలో ఎన్నో సవాళ్లను, అన్యాయాలను ఎదుర్కొని పోరాడిన మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగాట్ సాహసానికి అద్దం పట్టేలా ఉంది. పతకాల కంటే ఆమె చూపిన పోరాట పటిమే దేశానికి ‘కోహినూర్ వజ్రం’ లాంటిదని రచయిత భావోద్వేగంగా విశ్లేషించారు. భారతదేశం అంతరిక్షంలోకి పంపిన తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ ప్రయోగించి, దాదాపు 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాసిన చారిత్రాత్మక వ్యాసం. నాడు ఆర్యభట్టతో మొదలైన మన సైన్స్ ప్రయాణం… నేడు చంద్రయాన్, గగన్‌యాన్ల వరకూ ఎలా ఎదిగిందో, శాస్త్ర, సాంకేతిక రంగంలో భారత్ స్వయంసమృద్ధిని ఈ వ్యాసం ఘనంగా కొనియాడుతుంది. మనిషి అంతర్గత శక్తిని, వ్యక్తిత్వ వికాసాన్ని మేల్కొలిపే వ్యాసాలు రచయిత చాలానే రాశారు.
రచయిత రాసిన ‘బిగ్ బ్యాంగ్’ వ్యాసాల సంకలనం చదువుతుంటే, ఒకే పుస్తకంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన అనుభూతి కలుగుతుంది. ఒకవైపు సైన్స్, గణితాల తార్కికతను చూపిస్తూనే, మరోవైపు సామాజిక సమస్యలపై గళం విప్పడం ఈ రచయిత ప్రత్యేకత. సమాజంపై అవగాహన పెంచుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువత తప్పక చదవాల్సిన వైవిధ్యభరిత విజ్ఞాన భాండాగారం ఈ పుస్తకం.

-వీర

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్