ప్రపంచ బజారులో
బక్కచిక్కిన రూపాయి
దిక్కు తోచక వేస్తోంది
బిక్కమొహం జావగారి
డాలరు పోటీలో రూపాయి
నిలువలేక కరిగిపోతోంది
కొవ్వొత్తి మాదిరి.
పడితే పడింది గానీ...!
రూపాయి...
సామాన్యుడి బతుకును
చేస్తోంది బేజారు
ఉలుకూ పలుకూ లేని
వికాస పురుషుడు
ఊరుకున్నంత ఉత్తమం
లేదన్నట్టు చలనం లేని
రాతి బండలా...!
చూస్తున్నాడు చేష్టలుడిగి
కోతల రాయుళ్లు పాలకులు.
ఎగబాకుతున్నా
డాలరు విలువ
దిగజారిపోతున్నా
రూపాయి మారకపు విలువ
బెరుకు లేకుండా, బెంగ పడకుండా
చేస్తున్నారు పొసగని ప్రకటనలు
ఇస్తున్నారు మతలబు హామీలు
రూపాయి అంటే...!
కరెన్సీ మాత్రమేనా...? అది,
దేశ ఆర్థిక స్థితిని కొలిచే తూకం.
రూపాయంటే..!
కేవలం నాణెమేనా...? అది,
కోట్లాది ప్రజల జీవితం
ధరల బాదుడికి
రూపాయి పతనమే
అతి పెద్ద కారణం
పాలక ప్రభువుల విధానాలే...!
అవుతున్నాయి
రూపాయి మెడకు ఉరి తాళ్లు
సామ్రాజ్యవాదులకు సలాం
కార్పొరేట్లకు ఊడిగం. అదే కదా...!
రూపాయి పతనం వెనుక
దాక్కున్న అసలు సిసలు నిజం.
- వి. రాజగోపాల్, విజయనగరం.
సెల్: 9133084262








కామెంట్‌లు (0)