DRISHYAM
సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'సంస్కరణలకు' వంత పాట

09 జూన్, 2026

reforms
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 09, 2026, 06:30 పూర్వాహ్నం | 6 నిమిషాల చదవడం

నయా ఉదారవాద విధానాలను అమలు చేసిన ఫలితంగా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి జారిపోయిన ప్రతీ సందర్భంలోనూ మరింత ఎక్కువగా ఆ నయా ఉదారవాద 'సంస్కరణలనే' అమలు చేయడమే సంక్షోభానికి పరిష్కారం అంటూ నయా ఉదారవాదం తరఫున వకాల్తా పుచ్చుకున్న సమర్ధకులు ముందుకొస్తూ వుండడం గమనించవలసిన అంశం. రష్యాలో ఇది బాగా వ్యక్తం అయింది. అక్కడ నయా ఉదారవాద విధానాలను అమలు చేసిన కారణంగా రష్యన్‌ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి లోతుగా కూరుకుపోయింది. అలా సంక్షోభం తలెత్తిన ప్రతీ సందర్భంలోనూ మరింత ఎక్కువగా నయా ఉదారవాద సంస్కరణలను అమలు చేయాలంటూ నయా ఉదారవాద సమర్ధకులు పరిష్కారాన్ని ప్రతిపాదిస్తూ వచ్చారు. దాని ఫలితంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఒక చిన్న గుంపుగా ఉండే బడా కుబేరుల ఇనుప చేతుల్లో చిక్కుకుపోయింది. వ్లాదిమిర్‌ పుతిన్‌ గురించి ఎవరేం భావిస్తున్నా, అతడు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను ఆ బడా కుబేరుల గుప్పెట్లోంచి విడిపించి బైటకు తీసుకురాగలిగాడు.
ఇప్పుడు ఇండియాలో కూడా అటువంటి పరిస్థితే కళ్ళకి కనిపిస్తోంది. ప్రస్తుతం చాలా వేగంగా మన రూపాయి విలువ పడిపోతోతంది. ద్రవ్యోల్బణం వేగం పుంజుకుంటోంది. ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభం గుప్పెట్లో చిక్కుకుపోతోందని సూచిస్తోంది. ఇటీవల కాలంలో రూపాయి విలువ పతనం వేగం పెరిగింది. అయితే ఈ పతనం చాలా కాలం నుండీ కొనసాగుతున్న పరిణామమే. నయా ఉదారవాద విధానాలకు అనుగుణంగా 1992-93 నుండీ రూపాయి విలువ మారకాన్ని ప్రభుత్వం నియంత్రించడం నిలిపివేసి మార్కెట్‌ శక్తులకు విడిచి పెట్టింది. అప్పటికి ఒక డాలర్‌కు రూ. 22.74 విలువ ఉండేది. 2024 డిసెంబర్‌కి అది రూ.85.47కి చేరింది. ఇప్పుడు అది రూ. 95 దాటిపోయింది. విదేశీ చెల్లింపుల ఖాతాలో నిరంతరమూ లోటును కలిగివుండే ఆర్థిక వ్యవస్థలో దేశ కరెన్సీ మారకపు విలువను మార్కెట్‌ శక్తుల నిర్ణయానికి విడిచిపెట్టడం అంటే అది ఆ కరెన్సీ విలువ నిరంతరమూ పడిపోయేందుకే దారి తీస్తుంది. ఇలా మార్కెట్‌ శక్తులకు వదిలిపెట్టేయకుండా ప్రభుత్వం జోక్యం కల్పించుకుంటూ, విదేశీ మారకద్రవ్యాన్ని 'రేషనింగ్‌' పద్ధతిలో నియంత్రించినప్పుడు రూపాయి మారకపు విలువ ఒక స్థాయి దగ్గర స్థిరంగా నిలబడింది. నయా ఉదారవాద విధానాలను అమలు చేయడం మొదలు కాగానే ఆ నియంత్రణ లేకుండా, మార్కెట్‌ శక్తులకే విడిచిపెట్టినందువలన రూపాయి మారకపు విలువ పడిపోతూ వస్తోంది. తాజాగా ట్రంప్‌ సుంకాల దాడితో, ఇరాన్‌ మీద యుద్ధం ప్రభావంతో దాని విలువ మరింత వేగంగా పడిపోతోంది. అయినప్పటికీ, మరింత వేగంగా ''సంస్కరణలను'' అమలు చేయడమే ఈ సంక్షోభానికి పరిష్కారం అంటూ ఒక వంత పాట ఆలాపన మొదలైంది.
ప్రధాని నరేంద్ర మోడీ, నీతి ఆయోగ్‌ సభ్యులు, అధికారిక, అనధికారిక ఆర్థికవేత్తల సమూహాలు ఇప్పుడు ఒక వాదనను తలకెత్తుకున్నారు. విదేశీ ప్రైవేటు పెట్టుబడుల సంచారం మీద ఇంకా మిగిలిపోయిన ఆంక్షలను కూడా ఎత్తివేయాలని, వాటి ప్రవేశాన్ని ఇంకా ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి బైటకు తేవచ్చునని వాళ్ళు చెప్తున్నారు. ఈ వాదనను కాస్త జాగ్రత్తగా పరిశీలిద్దాం.
విదేశీ లావాదేవీల చెల్లింపుల ఖాతాలో లోటు నిరంతరాయంగా కొనసాగుతున్నంత కాలమూ మన దేశీయ కరెన్సీ విలువ క్రమంగా తగ్గిపోతూనే వుంటుందని అందరికీ అంచనాలు ఉంటాయి. విదేశీ మారకద్రవ్యం ఎక్కువ మొత్తంలో దేశంలోకి వచ్చినప్పుడు ఆ నిల్వలు పెరుగుతాయి నిజమే. అప్పుడు రిజర్వు బ్యాంక్‌ రూపాయి మారకపు విలువ పడిపోకుండా నిలబెట్టాలని కోరుకుంటుందన్నదీ నిజమే. కాని విదేశీ లావాదేవీల చెల్లింపుల ఖాతాలో లోటు కొనసాగుతూనే వున్నప్పుడు రూపాయి మారకపు విలువను పడిపోకుండా నిలబెట్టడం సాధ్యమేనని నమ్మేంత గుడ్డితనం స్పెక్యులేటర్లకు ఉండదు కదా? మన చెల్లింపుల ఖాతాలోని లోటును పూడ్చేందుకు విదేశీ మారకపు ద్రవ్యం ఎల్లప్పుడూ అదనంగా వచ్చిపడుతూనే వుంటుందని వాళ్ళు నమ్ముతారా?
ఒకవేళ విదేశీ మారకపు నిల్వలు తగినంత మోతాదులో మన చెల్లింపుల అవసరాలకన్నా అధికంగానే కొనసాగుతుంటాయని అనుకుందాం. అనుకోని పరిణామాలు ఎక్కడన్నా జరిగి వాటి ప్రవాహం ఆగిపోయి మన చెల్లింపుల స్థాయి కన్నా తక్కువకు పడిపోతే? అప్పుడు రూపాయి మారకపు విలువ పడిపోతుంది కదా? రిజర్వు బ్యాంక్‌ దగ్గర ఉండే విదేశీ మారకపు నిల్వలను మార్కెట్‌ లోకి విడుదల చేయడం ద్వారా రూపాయి మారకపు విలువను పడిపోకుండా నిలబెట్టవచ్చునని ఎవరైనా భావించవచ్చు. కాని అలా చేయడానికి రిజర్వు బ్యాంక్‌ అన్నివేళలా సుముఖంగా ఉండజాలదు. రిజర్వు బ్యాంక్‌ నిల్వలు కరిగిపోతున్నాయనగానే స్పెక్యులేటర్ల ఆందోళన పెరుగుతుంది. దేశం నుండి విదేశీ మారకపు ద్రవ్యం బైటకు పోతోంది అని, దాని వలన రాబోయే రోజుల్లో రూపాయి మారకపు విలువ మరింత పడిపోబోతోంది అని వారు అంచనాలకు వస్తారు. దాంతో రూపాయి మారకపు విలువ మరింత వేగంగా పడిపోవడం జరుగుతుంది.
రూపాయి మారకపు విలువ నిర్ధారణను 'స్వేచ్ఛగా' 'మార్కెట్‌ శక్తులకు' విడిచి పెట్టాలని వాదించేవారు అలా విడిచిపెట్టినందువలన ఎక్కడో ఒక దగ్గర మారకపు రేటులో 'సమతూకం' ఏర్పడుతుందని నమ్ముతారు. అప్పుడు విదేశీ చెల్లింపుల లోటు అనేది తలెత్తదని వారు వాదిస్తారు. అయితే ఈ వాదన పూర్తిగా తప్పు. ప్రపంచ మార్కెట్‌లో ఒక దేశపు సరుకులు ఎంత బాగా చెల్లుబాటు అవుతాయి అన్నది అనేక అంశాల మీద ఆధారపడి వుంటుంది. ఆ దేశంలో చెల్లించే నిజ వేతనాల రేటు, ఆ దేశం ఉపయోగించే టెక్నాలజీ, అంతర్జాతీయ సంబంధాలు వంటి అంశాలు ప్రభావం చూపుతాయి.
వాదన కోసం అంతర్జాతీయ వాణిజ్యంలో మన కరెన్సీ మారకపు రేటును ఎక్కడో ఒక స్థాయిలో పడిపోకుండా నిలబెట్టి 'సమ తూకం' సాధించడం కోసం మన దేశంలో చెల్లించే నిజవేతనాల స్థాయిని ప్రస్తుత స్థాయిలో నాలుగో వంతుకు తగ్గించామే అనుకుందాం (అప్పుడు మన సరుకులు చౌకగా అంతర్జాతీయ మార్కెట్‌ లో అమ్ముడుపోయి మన ఎగుమతులు పెరిగి వాణిజ్య లోటు భర్తీ అవుతుంది). అయితే ఆ విధంగా నిజ వేతనాలు తగ్గిపోతే అది కార్మికులకు ఆమోదయోగ్యం కాదు. కనీస జీవన భృతి స్థాయికన్నా ఆ వేతనాలు పడిపోతే వాళ్ళు బతకడం అసాధ్యం. అందుచేత ఒక స్థాయికి మించి కార్మికుల వేతనాలను తగ్గించడం సాధ్యం కాదు. అందువలన అంతర్జాతీయ మార్కెట్‌లో మారకపు రేటులో సమతూకం సాధించడం కూడా సాధ్యం కాదు. మరి పమతూకం సాధ్యం కానప్పుడు రూపాయి మారకపు విలువను నిర్ధారించే పనిని మార్కెట్‌ శక్తులకు విడిచిపెట్టేయడం సమర్ధనీయం కాదు.
అలా మార్కెట్‌ శక్తులకు విడిచిపెట్టేసి మన దేశంలో ఇప్పటికి మూడు దశాబ్దాలు గడిపాం. కాని విదేశీ చెల్లింపుల ఖాతాలో లోటు లేని పరిస్థితి ఏర్పడుతుందన్న సూచన ఎక్కడా కనిపించడం లేదు. పోనీ, ఈ కాలంలో కార్మికుల నిజ వేతనాలు ఎమన్నా బాగా పెరిగిపోయినందు వలన మన వాణిజ్య లోటు కొనసాగుతోందని అనుకుందామా అంటే కార్మిక వర్గపు నిజ వేతనాలకు కోతలు పడుతూనే వున్నాయి. అందుచేత రూపాయి మారకపు విలువను మార్కెట్‌ శక్తులకే విడిచిపెట్టి, కార్మికుల నిజ వేతనాలకు అంతకంతకూ కోతలు విధిస్తూ నయా ఉదారవాద సంస్కరణలను ఇంకా కొనసాగించడం అనేది సంక్షోభానికి పరిష్కారాన్ని తీసుకురాదు సరికదా కార్మికవర్గం మొత్తంగా ఆకలి చావులకు గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక వేళ మనతో అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ పడుతున్న దేశాలన్నీ తమ తమ కరెన్సీల మారకపు రేట్లను కూడా నియంత్రించకుండా వదిలేస్తే, అప్పుడు వారితో పోటీలో నిలదొక్కుకోడానికి. మన మార్కెట్లను వారు చేజిక్కించుకోకుండా నిలవరించడానికి కార్మికుల ఆకలి చావులు కూడా సరిపోవు.
అందుచేత రూపాయి మారకపు విలువను మార్కెట్‌ శక్తుల దయాదాక్షిణ్యాలకు వదిలేసి, సంక్షోభం నుంచి బైట పడడం కోసం నిరంకుశ కార్మిక చట్టాలను తెచ్చి, విదేశీ మదుపుదారులకు మరింత పన్ను రాయితీలను ప్రకటించి, వారికి చెల్లించే వడ్డీ రేట్లను మరింత పెంచి-ఇలా ఎంత చేసినా మన ఆర్థిక వ్యవస్థ ఎటువంటి సమతూకాన్నీ సాధించలేదు. పైగా ఈ చర్యలు మన దేశీయ ఆర్థిక వ్యవస్థను మరింత ముడుచుకుపోయేట్టు మాత్రమే చేయగలవు.
పోనీ, ఇటువంటి చర్యల ఫలితంగా రూపాయి మారకపు విలువ పడిపోకుండా ఆగే అవకాశం ఏమైనా ఉందా అంటే అదీ లేదు. ఇప్పుడు ట్రంప్‌ మన దేశం అమెరికా విధించిన అధిక సుంకాలనైనా అంగీకరించాలని లేదా వేరే రూపంలోనైనా అమెరికాతో అసమాన వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడు. ఇందులో ఏది జరిగినా, అమెరికాతో పోల్చినప్పుడు మన వాణిజ్య ఖాతా లోటు బాగా పెరుగుతుంది. అమెరికాతో లోటు పెరగడం అంటే తక్కిన ప్రపంచంతో కూడా పెరగడానికే దారి తీస్తుంది. లోటు పెరుగుతోంది అనగానే స్పెక్యులేటర్లు మన రూపాయి మారకపు రేటు మరింత పడిపోనుందన్న అంచనాలకు వస్తారు. అప్పుడు దాని రేటు పడిపోకుండా నిలవరించడం సాధ్యం కాదు. అంటే నయా ఉదారవాదుల చెప్పిన ''సంస్కరణలను'' అమలు చేసినా రూపాయి మారకపు రేటు పడిపోకుండా నిలబడదు. మళ్ళీ మన పరిస్థితి మొదటికే వస్తుంది.
ఆర్థిక వ్యవస్థలో మరింత నయా ఉదారవాద సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దవచ్చునని చెప్పేది పచ్చి నయవంచన మాత్రమే. నిజానికి ఈ సంక్షోభ స్థితిని సరైన విధానాల తోడ్పాటుతో అధిగమించవచ్చు. నయా ఉదారవాద విధానాలకు కలిగించిన నష్టాన్ని నివారించవచ్చు. పెట్టుబడుల రాకపోకల మీద నియంత్రణలు విధించి, రూపాయి మారకపు రేటును ప్రభుత్వమే ఒక దగ్గర స్థిరంగా నిలబెట్టి వుంచితే అప్పుడు విదేశీ పెట్టుబడుల ప్రవాహం నిలిచిపోతుంది. అప్పుడు విదేశీ దిగుమతుల మీద కూడా నియంత్రణ అమలు చేయవలసి వుంటుంది. అంటే మార్కెట్‌ను ప్రభుత్వం కంట్రోల్‌ చేయవలసి వుంటుంది. ఇప్పటిలా మార్కెట్‌ మీద కంట్రోల్‌ను ఎత్తివేసే విధానాన్ని మానేసి మార్కెట్‌ను నియంత్రించడం జరగాలి. దానితోబాటు మనకు కీలకమైన దిగుమతులను సరఫరా చేసే దేశాలతో నేరుగా ద్వైపాక్షిక ఒప్పందాలను చేసుకోవాలి. ఆ ఒప్పందాలు ఉభయ దేశాల కరెన్సీల మారకం ద్వారా జరగాలే తప్ప డాలర్‌ మారకం ఉండకూడదు.
నిజానికి మోడీ ప్రస్తుతం పరోక్షంగా మార్కెట్‌ మీద నియంత్రణ ఉండడం అవసరం అని అంగీకరిస్తున్నారు. విదేశీ మారకపు నిల్వలను పదిలం చేసుకోడానికి విదేశీ యాత్రలను తగ్గించుకోవాలని ప్రజలకు సలహా ఇస్తున్నాడు. వర్క్‌-ఫ్రం-హోం ద్వారా పెట్రో ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించుకోమంటున్నాడు. ప్రజలు ఒకవేళ స్వచ్ఛందంగా తగ్గించుకోకపోతే? అప్పుడు ప్రభుత్వమే నేరుగా నియంత్రణా చర్యలకు పూనుకోవలసి వస్తుంది. మోడీ చేసే ప్రచారం వెనుక తర్కం ఇదే.

  • ప్రభాత్‌ పట్నాయక్‌
    ( స్వేచ్ఛానుసరణ )

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్