పిల్లలెందరివో
బతుకులు వీధుల్లో చెరబడుతుంటే,
కళ్లుండి చూడలేని కబోది రాజ్యం!
ఎవరి గర్భం? ఎవడి హుకుం?
అలసి సొలసిన బతుకుల ఆదరణ లేదు.
ఆ గర్భాల వేటలో ఎరగా
కాసుల వెదజల్లే ఆరంభ కుట్ర!
అద్దె గర్భం,
పేద గూటిలోకి చొరబడి,
నయానా భయానా వేయబడే వేలంలో
విపత్కర పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుంటే,
రాజ్యం గర్భాన్ని విచ్ఛుకత్తులతో ఛిద్రం చేయ చూస్తుంది.
ముగ్గురు, నలుగురిని కనమంటూ
హోరెత్తించే రాజ్యం విదిల్చే పైకం,
పెంచే క్రమంలో ఏ మూలకీ సరిపోదు!
రాజకీయ బకాసురుల చేతుల్లో
విద్య, వైద్యం సగటు మనిషిని పీల్చి పిప్పి చేస్తుంటే,
వత్తాసు పలికే రాజ్యం
ప్రభుత్వ రంగానికి నిధులనీ కేటాయించదు.
నిఘాని అటకెక్కించింది.
బీదా బిక్కి గర్భాలతో
రాజకీయ పబ్బం గడుపుకునే కుతంత్రం
అందరికీ తిండి ఇవ్వలేని రాజ్యం
రూకల్లో మతాన్ని జొప్పించి ఏలే నాటకాల తెరలు.
ఒక్కో తెర తీస్తుంటే, జుగుప్స ఒళ్లంతా.
ఒక్కో ప్రశ్న ఉదయించాలి.
జవాబే దొరక్క, రాజ్యం ఉరిపోసుకునే దాకా
నిరంతర పోరాటం అవశ్యం!
– గిరి ప్రసాద్ చెలమల్లు, 94933 88201








కామెంట్‌లు (0)