1
యేం గాచ్చారమొచ్చింది
సెవట సుక్కలెన్ని రాల్సినా
సేతిలో రూపాయి మిగల్డం లేదు
సమురు పిరిమైపోనాది
ఏలుకోలేని బండి మూలొచ్చి తొంగున్నాది
దద్దమ్మల్లా సూత్తామేటి?
అన్నీ ఒట్టిపోయినా ఆవుసున్నాది గాదేటి!
నడిసేపోదుం –
2
యింటి గండు గడవడం లేదు
దినవెచ్చం పెట్టే దిక్కు లేదు
బేపికి బెట్టకూడైనా దొరకడం లేదు
సరే, యిపుడేటి సేత్తాం?
అపాసాలో, ఉపాసాలో పడుదుం
కడుపు కట్టేసుకుందుం –
3
పరువాబోరు బజారుకెక్కింది
సిప్ప పట్టుకొని అప్పు కోసం తిరగతన్నాం
గుట్టు దాసుకునే సాటు లేదు, సోటు లేదు
మరెక్కడికెళ్లిపోతామేటి?
సిగ్గుపీలిక సించెట్టు కొమ్మనెడుదుం
మొండి మొలతో నడీదిలోనే మకాం పెడుదుం –
4
ఎన్నుపూస యిరిగిపోనాది
ముడుకుల సిప్పలు అరిగిపోయున్నాయి
మూడు కాళ్ల కుర్సీ మూలనున్నాది
మరేం పరవాలేదు
అతిథికి అగుమానం జరగదు
ఎలగో ఒకలాగ కుర్సీ పొందించేసి
గడపల కూసోబెడుదుం
కాదూ కూడదు అంతిమటుకు
తుంగసాప పరిసి తొంగండబెడుదుం –
5
పుస్కర కాలం పూజ్జిమైపోనాది
కంట్లో వత్తులేసుకొని సూడ్డమే..
మంచిరోజుల కోసమని ఎదురుతెన్నులు
ఎంతకని సూత్తాం గానీ..
గొడ్డుమేగం దుక్కు ఎంత గిరెట్టినా
గడ్డిదుబ్బుల్లాగ ఎండిపోడమే..
6
ఎటు జూసినా దిగనాసి బతుకు..
సూపుల దీపం ఎలిగిత్తే
దిష్టిబొమ్మలాగ సీకటే కనబడతంది
మన బుర్రలన్నీ ఆళ్ల వలలో తోకాడించే సేపలు!
ఆళ్లు ఏలు సూపిందే ఎలుతురు
ఆళ్లు కళ్ళెర్రగిత్తే కారుసీకట్లు!
7
పా.. పా.. బేగి పా.. పొయ్యెలిగించు
నీసు కుండ మీద మూకుడెట్టు
మనల్ని మనమే ఉడికించుకోవల్ల
పాపం! మన్దుక్కు ఆళ్లెప్పుడొచ్చినా
మాంచి ఆకలిమీదే వత్తారు..
– కంచరాన భుజంగరావు
94415 89602








కామెంట్‌లు (0)