test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రపంచాన్ని మోసే అదృశ్య భుజాలు

10 గంటల క్రితం

book
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 15, 2026, 05:45 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

గ్రీకు పురాణ కథలో ప్రపంచ భారాన్ని తన భుజాల మీద మోస్తూ అట్లాస్ పాత్ర కనిపిస్తుంది. ఒకసారి తాను గ్రీకు వీరుడైన హెర్క్యులస్ సహాయంతో ఆ భారాన్ని కింద దించి తప్పించుకోవాలని ప్రయత్నిస్తాడు. కానీ చివరికి మళ్లీ అదే బాధ్యతను మోయక తప్పదు. ఇదొక కల్పిత కథ. నిజ ప్రపంచంలో మాత్రం అలాంటి భారాన్ని, అలసట అనేదే లేకుండా నిశ్శబ్దంగా తమ భుజాలకెత్తుకున్నది మన ఇళ్లల్లోని తల్లులే. స్వప్న కేతవరపు రాసిన Atlas Shrugged, But Mothers Won't పుస్తకం సమాజంలో తల్లులు పోషిస్తున్న అత్యంత కీలకమైన పాత్రను ఒక సరికొత్త మానసిక, ఆర్థిక కోణంలో ఆవిష్కరిస్తుంది.
​ఈ ఆధునిక సమాజం, ఇక్కడి ఆర్థిక వ్యవస్థ కేవలం కార్యాలయాలు, వ్యాపారాలు, పురుషుల శ్రమ వల్లే నడుస్తోందని మనం పైకి అనుకుంటాం. కానీ వీటన్నింటి వెనుక ఒక తల్లి పడే నిశ్శబ్ద శ్రమ, అదృశ్య నిర్వహణ దాగి ఉన్నాయి. లోకం ఎప్పుడూ పైకి కనిపించే, గంభీరమైన శక్తినే నాయకత్వంగా గుర్తిస్తుంది. నిశ్శబ్దంగా బాధ్యతను భుజాలకెత్తుకునే తల్లులను పెద్దగా పట్టించుకోదు. మాతృత్వం అంటే కేవలం ప్రేమ, లాలన, త్యాగం మాత్రమే కాదు; అది ప్రతి క్షణం నడిచే ఒక అపారమైన మేధోశ్రమ. ఒక లీడర్‌లా తల్లి ఇంటి అవసరాలను ముందే ఊహిస్తూ, పిల్లల చదువు, ఆరోగ్యం, ఆర్థిక సర్దుబాట్లు వంటి అనేక బాధ్యతలను సమన్వయం చేస్తుంది. ఇంట్లో ఎలాంటి అలజడి ఉన్నా ఆ ఒత్తిడిని తనే భరిస్తూ కుటుంబాన్ని స్థిరంగా ఉంచుతుంది. సమాజం వారిని 'త్యాగమూర్తి', 'మల్టీటాస్కర్' అనే ముద్రలతో కట్టేసి, వారిలోని అసలైన మేధస్సును, నాయకత్వాన్ని గుర్తించకుండా దాచేస్తోంది.
​రచయిత్రి ఈ పుస్తకంలో మాతృత్వాన్ని కేవలం ఒక అనుభూతిగా కాకుండా, ఏడు విభిన్న పొరల మేధోప్రయాణంగా విశ్లేషించారు. మనసు గ్రహించేలోపే శరీరం స్పందిస్తుంది. విచ్ఛిన్నమయ్యే నిద్ర, ప్రసవ నొప్పులు ఆమెకు కాలంతో కొత్త బంధాన్ని నేర్పుతాయి. పిల్లలు మాటల కంటే తల్లి స్పర్శ, ఆమె గొంతులోని స్థిరత్వం ద్వారా రక్షణను పొందుతారు. పనులు అస్తవ్యస్తం కాకుండా ఒకేసారి అనేక బాధ్యతలను మనసులోనే సమన్వయం చేసుకునే అద్భుత ఆలోచనా వ్యవస్థ ఇది. సమాజపు పోలికలు, అంచనాలు, తీర్పుల మధ్య ఒత్తిడిని భరిస్తూనే పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఇల్లు కుప్పకూలిపోకుండా రోజువారీ జీవితాన్ని క్రమశిక్షణతో నడిపించే అదృశ్య చట్రం ఇది. తల్లి కేవలం విలువల గురించి మాట్లాడదు; ఆమె హావభావాలు, ఎంపికలు, నిశ్శబ్దాలు పిల్లల మనసులో శాశ్వతంగా ఉండిపోతాయి. ఒక మనిషి భావోద్వేగ బాధ్యతను స్వీకరించినప్పుడే సంక్షోభ నిర్వహణ, వివాదాల పరిష్కారం, వనరుల నిర్వహణ వంటి నాయకత్వ నైపుణ్యాలు అలవడతాయి.
​ప్రసవ సెలవుల తర్వాత ఒక స్త్రీ తిరిగి ఆఫీసులో అడుగుపెట్టినప్పుడు, పని ప్రపంచంలోని 'పురుష భాష' ఆమెకు ఎదురవుతుంది. అక్కడ పనిలో ఆలోచన కంటే వేగానికి, సందర్భం కంటే అంటీముట్టనట్లు ఉండటానికి ప్రాధాన్యత ఇస్తారు. స్త్రీలకు ఈ భాష మాట్లాడటం వచ్చు, కానీ అది ఎప్పుడూ ఎవరో వేరొకరి కోటును తొడుక్కున్నట్లే ఉంటుంది. తిరిగి ఇంటికి రాగానే 'సంరక్షణలోని స్త్రీత్వ భాష' మొదలవుతుంది. ఇంట్లోని నిశ్శబ్దాన్ని బట్టి ఎక్కడో ఏదో సరిగ్గా లేదనే విషయాన్ని ముందే గ్రహించే నేర్పు ఇది. ఈ రెండు ప్రపంచాల మధ్య నలిగే స్త్రీ ఒక 'ద్విభాషా నైపుణ్యం' సంపాదిస్తుంది. ఇంట్లోని అయోమయాన్ని సర్దడం వల్ల ఆఫీసులో క్రైసిస్ మేనేజ్ చేయగలదు; ఆఫీసులోని రూల్స్ వల్ల ఇంట్లో హద్దులను పెట్టగలదు. కానీ లోకం ఆమెను 'స్వరంలో ఇరుక్కుపోయే ఉచ్చు' (Tone Trap)లోకి నెడుతుంది. ఒక పురుషుడు గట్టిగా మాట్లాడితే అది పరిస్థితి డిమాండ్ అంటారు; అదే స్త్రీ ఖచ్చితంగా మాట్లాడితే ఆమె స్వభావమే అంత అంటూ ఒక సామాజిక ఫిల్టర్ ద్వారా ఆమెను తప్పుగా అంచనా వేస్తారు. పూర్వం పిల్లలను పెంచే బాధ్యతను ఉమ్మడి కుటుంబం పంచుకునేది. నేటి ఆధునిక జీవితం ఆ భారాన్ని పూర్తిగా తల్లిపైనే నెట్టేసింది. కుటుంబాన్ని సురక్షితంగా ఉంచాలనే తల్లుల తాపత్రయాన్ని, ఆందోళనను మార్కెట్లు తమ లాభాల కోసం అవకాశంగా మార్చుకుంటాయి. 'అన్నీ నేనే చేయగలను' అనే అపోహను సమాజం ఆమె నరనరాల్లోకి ఎక్కిస్తుంది. ఎందుకంటే ఇది వ్యవస్థలోని లోపాలను దాచిపెట్టి, ఆ భారాన్ని ఒక వ్యక్తిపైకి నెట్టేయడానికి సులువైన మార్గం.
​ప్రసిద్ధ రచయిత్రి ఐన్ రాండ్ (Ayn Rand) తన Atlas Shrugged నవలలో వ్యక్తిగత స్వేచ్ఛ, సృజనాత్మకత, ఉత్పాదక వ్యక్తుల పాత్రను సమాజ పురోగతికి కేంద్రంగా ప్రతిపాదించారు. స్వప్న ఆ నమూనా అసంపూర్ణమైనదని వాదించారు. స్వార్థం కేవలం ఉత్పత్తిని ఇవ్వగలదు. కానీ సమాజాన్ని కలిపి ఉంచే 'నిరంతరత్వాన్ని' (Continuity) ఇవ్వలేదు. ఆ నిరంతరత్వాన్ని ఇచ్చేది తల్లుల 'సంరక్షణ' (Care) మాత్రమే! చిన్న చిన్న మనస్పర్థలు పెద్ద గాయాలుగా మారకుండా ఆపే సంరక్షణ, సాంప్రదాయ కోణంలో లాభాన్ని సృష్టించకపోవచ్చు. కానీ ఇది లేకుండా ఏ ఆర్థిక వ్యవస్థా ఎక్కువ కాలం నడవలేదు. సంరక్షణ అనేది ఏ జీడీపీ కంటే నిశ్శబ్దమైనది, ఏ కొత్త ఆవిష్కరణ కంటే అయినా అత్యంత కీలకమైన సామాజిక పెట్టుబడి. సమాజానికి అత్యంత అవసరమైన ఈ శ్రమను అందించే వ్యక్తులే తరచుగా తమ ఆత్మగౌరవాన్ని ఎక్కువగా కోల్పోవాల్సి వస్తోంది.
​పురాణాల్లో అట్లాస్ భారాన్ని దించేసి తప్పించుకోవాలని చూశాడు. కానీ ఇక్కడి తల్లులు అలా ఎన్నడూ చేయరు. త్యాగం వారి విధి కాదు. సమాజం కూలిపోతే జరిగే నష్టం ఎంతయో వారికి తెలుసు. తల్లుల మేధస్సుకు, శ్రమకు తగిన గుర్తింపునిస్తూ, వారు ఇకపై ఆ భారాన్ని ఒంటరిగా మోయాల్సిన అవసరం లేని ఒక సరికొత్త, సమతుల్యమైన, మానవీయ ప్రపంచాన్ని నిర్మించడమే ఈ పుస్తకం అంతిమ లక్ష్యం. నవ ప్రపంచ నిర్మాణంలో మహిళలకు పురుషులు కేవలం సహాయకులుగానో, ఉద్ధారకులుగానో కాకుండా సమాన భాగస్వాములైన 'సహ-నిర్మాతలు'గా నిలవాలి. ఇన్నాళ్లూ మహిళల భుజాలపైనే ఆధారపడిన ఈ లోకం, ఇకపై ఆ భారాన్ని వారితో పంచుకునేలా మారాలి. అప్పుడే, తల్లుల దృఢ సంకల్పం నుంచి పుట్టే కొత్త ప్రపంచం మరింత బలంగా, స్థిరంగా, గొప్ప మానవత్వంతో విలసిల్లుతుందని రచయిత్రి స్వప్న కేతవరపు ఈ పుస్తకంలో దృఢమైన ఆశాభావం వ్యక్తపరిచారు.

- ఎల్. ఎన్. కొల్లి

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్