మన జీవనయానం మొత్తం లెక్కలతోనే ముడిపడి ఉంటుంది. పండితులు, పామరులు ఎవరైనా సరే ఏదో సందర్భంలో లెక్కలతో కుస్తీపట్టక తప్పదు. జీవితంలో ఇంత భాగమైపోయిన గణితమంటే చాలా మందికి భయం. ‘‘వామ్మో.. లెక్కలా..? నా వల్ల కాదు బాబోయ్..’’ అనేవారే అధికం. కానీ కష్టపడి, ఇష్టంతో చేస్తే గణితాన్ని మించిన సులువైన శాస్త్రం మరొకటి లేదు.
నిరంతరం ప్రోత్సహిస్తూ సాధన చేయించి ఫార్మూలాలు నేర్పిస్తే పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తరగతిలో పాఠాలు విన్నా, వీడియోల ద్వారా మరోసారి ఫార్మూలాలను చూసి తెలుసుకోవడం ద్వారా బాగా గుర్తుంటుంది. వాస్తవానికి అన్ని శాస్త్రాల్లోనూ గణితం మిళితమై ఉంటుంది. సాంఘికశాస్త్రంలో అక్షాంశాలు, రేఖాంశాలు, దేశాల విస్తీర్ణాలు, మ్యాప్‌ల నిర్మాణంలో ఉన్న నిష్పత్తులు మొదలైనవన్నీ గణితమే. సైన్స్‌లో భారం, ద్రవ్యరాశి, మూలకాల ఆవర్తనం, సమీకరణాలు, జీవక్రియలన్నీ గణిత ప్రస్థావనతోనే సాధ్యం. భాషా వ్యాకరణాల్లోనూ గణితం ఉంటుంది. ప్రస్తుతం అన్ని పోటీ పరీక్షల్లో గణితం తప్పనిసరి అయింది.
మెళకువలను నేర్పించాలి
గణితంపై మక్కువ చూపితే ఏ సమస్యనైనా సులభంగా సాధించొచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు గణితంలోని మెళకువలను తెలుసుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. పిల్లలకైతే సూత్రాలను బట్టీ తరహాలో కాకుండా అంకెలు, సంజ్ఞల రూపంలో చెప్పించడం, సబ్జెక్టులో వెనుకబడిన వారికి అర్థమయ్యే రీతిలో స్వేచ్ఛగా భావవ్యక్తీకరణకు అవకాశం ఇవ్వటం చాలా ముఖ్యం. విద్యార్థులతో మాట్లాడటం, చర్చించడం ద్వారా సులభంగా లెక్కలు చేయొచ్చు. వ్యక్తిగతంగానూ, జట్టు కృత్యంగానూ చేయిస్తూ మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. చిన్నపాటి బహుమతులు, ప్రశంసలు కూడా విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంచుతాయి. కూడికలు, గుణకారాలు, తీసివేతలు, భాగహారాలు, ఆరోహణ, అవరోహణ అంశాలను ఉపాధ్యాయులు వివరించడమే కాకుండా పిల్లలు ఆడుతూ పాడుతూ వాటిని గుర్తుపెట్టుకునేలా వారితోనే చెప్పించాలి. సూత్రాలు, పీరియాడిక్ టేబుళ్లను ఆటలు, పాటలతో అనుసంధానించి నేర్పిస్తే విద్యార్థులు వాటిని సులభంగా అర్థం చేసుకుని అన్వయించుకోగలుగుతారు.
భయాన్ని పోగొడుతూ ....
పిల్లల చేత వివిధ ప్రాజెక్టులు చేయిస్తూ, సరికొత్త నమూనాలు తయారు చేయిస్తే గణిత అంశాలపై సమగ్ర అవగాహన ఏర్పడుతుంది. మార్కెట్‌కు, కిరాణా దుకాణాలకు వెళ్లేటప్పుడు పిల్లలను కూడా తీసుకెళ్లాలి. అక్కడ కావాల్సిన సరుకులు వారితో కొనిపించాలి. డబ్బులు కూడా వారికే ఇచ్చి కొనుగోళ్లు, చెల్లింపులు చేయించాలి. షాపుల్లో ఇచ్చే ఆఫర్లు, డిస్కౌంట్ల గురించి కూడా వారితో చర్చించాలి. అసలు డిస్కౌంట్, రాయితీల లెక్కింపు తెలియజేసి వారితో కూడా చేయిస్తే అలా గుర్తుపెట్టుకుంటారు. ఇలాంటి విషయాలను సబ్జెక్టు అంశాలుగా పాఠశాలలోనే చేయిస్తే ప్రతి విద్యార్థికీ సులభంగా అర్థమవుతుంది. గణితంలో బలమైన పునాది ఏర్పడితే ఉన్నత విద్యలోనూ, పోటీ పరీక్షల్లోనూ రాణించడం సులభమవుతుంది. గణితం కేవలం ఒక సబ్జెక్టు మాత్రమే కాదు; సమస్యలను విశ్లేషించే తార్కిక శక్తిని, నిర్ణయ సామర్థ్యాన్ని, ఆలోచనా క్రమాన్ని పెంపొందించే జీవన నైపుణ్యం కూడా. అందుకే గణితాన్ని భయపడకుండా, స్నేహితుడిగా మార్చుకోవడం ప్రతి విద్యార్థి లక్ష్యంగా ఉండాలి.
నేర్చుకోవచ్చు ఇలా ...
గణితాన్ని సులభంగా నేర్చుకోవాలంటే సరైన విధానం, క్రమబద్ధమైన సాధన, నిరంతర అభ్యాసం అవసరం. కింది సూచనలు అందుకు ఉపయోగపడతాయి.
1. ప్రాథమికాలపై పట్టు
• సంఖ్యల స్వరూపం, వాటి లక్షణాలను బాగా అర్థం చేసుకోవాలి.
• కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం వంటి ప్రాథమిక ప్రక్రియల్లో నైపుణ్యం పెంచుకోవాలి.
• వర్గాలు, ఘనాలు, కసాగు, గసాగు వంటి ప్రాథమిక సూత్రాలను అవగాహన చేసుకోవాలి.
• భిన్నాలు, శాతాలు, నిష్పత్తులు, అనుపాతాలపై స్పష్టమైన పట్టు సాధించాలి.
2. ఆటలతో అభ్యాసం
• సంఖ్యలతో కూడిన ఆటలు, చిక్కు ప్రశ్నలు, మేధస్సును పెంపొందించే కార్యక్రమాల్లో పాల్గొనాలి.
• రోజువారీ జీవితంలోని లావాదేవీలు, కొనుగోళ్లు, అమ్మకాలు, పొదుపు వంటి అంశాలను గణితంతో అనుసంధానించాలి.
• గణితాన్ని పాఠ్యాంశంగా కాకుండా సరదా కార్యకలాపంగా భావిస్తే ఆసక్తి పెరుగుతుంది.
3. మానసిక గణన
• చిన్న లెక్కలను కాగితం అవసరం లేకుండానే చేయగల సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి.
• వేగంగా గుణించడం, భాగించడం వంటి పద్ధతులను అభ్యసించాలి.
• క్లిష్టమైన అంశాలను సులభంగా అర్థం చేసుకునేందుకు వివిధ చిట్కాలను నేర్చుకోవాలి.
4. నిరంతర సాధన
• ప్రతిరోజూ కొంత సమయాన్ని గణిత సాధనకు కేటాయించాలి.
• ఒకే రకమైన సమస్యలు కాకుండా విభిన్న రకాల సమస్యలను పరిష్కరించాలి.
• సాధన ఎంత ఎక్కువ చేస్తే, గణితంపై అంతటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
5. సమస్యల విభజన
• పెద్ద సమస్యలను చిన్న చిన్న దశలుగా విభజించి పరిష్కరించాలి.
• ప్రతి దశను అర్థం చేసుకుంటూ ముందుకు సాగితే సంక్లిష్ట సమస్యలూ సులభమవుతాయి.
• సమస్యలోని ముఖ్యాంశాలను గుర్తించడం అలవాటు చేసుకోవాలి.
6. సూత్రాల పునశ్చరణ
• ముఖ్యమైన సూత్రాలను ప్రత్యేకంగా రాసి ఉంచుకోవాలి.
• వాటిని తరచూ చదవడం, ఉపయోగించడం ద్వారా సులభంగా గుర్తుంచుకోవచ్చు.
• సూత్రాలను బట్టీ పట్టడం కాకుండా వాటి వెనుక ఉన్న భావాన్ని అర్థం చేసుకోవాలి.
7. తార్కిక ఆలోచన
• గణితాన్ని ఒక సవాలుగా స్వీకరించి ఆలోచించే అలవాటు పెంచుకోవాలి.
• సమస్యలను వివిధ కోణాల్లో పరిశీలించి పరిష్కార మార్గాలను అన్వేషించాలి.
• ఓర్పు, ఏకాగ్రత, విశ్లేషణా సామర్థ్యాలను పెంపొందించుకోవాలి.
గణితం కేవలం పరీక్షల్లో మార్కులు సాధించడానికి మాత్రమే కాదు. తార్కికంగా ఆలోచించడం, సమస్యలను విశ్లేషించడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం వంటి జీవిత నైపుణ్యాలను పెంపొందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది.

- సరికొండ లెనిన్ బాబు
అధ్యాపకులు,
ప్రభుత్వ జూనియర్ కళాశాల,
సిరిపురం,
సత్తెనపల్లి మండలం,
పల్నాడు జిల్లా.









కామెంట్‌లు (0)