'పిల్లలకు ఆటలు ఆడడం చాలా ఇష్టం' అనుకుంటాం. మైదానాల్లో పరుగులు పెడుతున్న చిన్నారులను చూసి మురిసిపోతాం. క్రీడల్లో రాణిస్తున్న పిల్లలను చూసి మనసారా అభినందిస్తాం. వెన్నోళ్ల కొనియాడుతాం. కేరళ కొచ్చికి చెందిన 15 ఏళ్ల ఆర్యన్ అజిత్ ఆ పిల్లల్లో ఒకడు. అయితే ఆర్యన్ క్రీడాకారుడిగా తన ప్రతిభను కనబరచలేదు. 10వ తరగతి కూడా పూర్తిచేయని ఈ పిల్లాడు ఏకంగా క్రీడా టోర్నమెంట్లనే నిర్వహిస్తున్నాడు. ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ అంటే ఇష్టపడే ఆర్యన్ వాటిని ఆడడంతోనే సరిపెట్టక, టోర్నమెంట్లు నిర్వహించేంత పెద్దగా ఆలోచించాడు. ఇంత చిన్నవయసులోనే బృహత్తర కార్యక్రమానికి పూనుకున్న ఆర్యన్ భవిష్యత్తు ప్రణాళికలు తెలుసుకుంటే ఔరా అనిపిస్తుంది.
పాకెట్ మనీ కోసం ఆర్యన్ టోర్నమెంట్లు నిర్వహించాడంటే చాలామందికి ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఈ విషయాన్ని స్వయంగా తనే చెప్పాడు. ‘‘నాకు వ్యాపార ఆలోచనలు చాలా ఉన్నాయి. క్రీడలంటే కూడా చాలా ఇష్టం. ‘ఈ ఇష్టాన్ని వ్యాపారకేంద్రంగా ఎందుకు మార్చుకోకూడదు?’ అని ఆలోచించాను. అప్పుడే ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఐడియా వచ్చింది’’ అంటున్న ఆర్యన్, కొచ్చిలోని చాయిస్ స్కూలులో 10వ తరగతి చదువుతున్నాడు.
ఆలోచన రావడంతోనే దాన్ని మార్కెటింగ్ చేశాడు ఆర్యన్. సోషల్ మీడియా వేదికగా టోర్నమెంట్ ప్రచార పోస్టర్‌ను షేర్ చేశాడు. అది బాగా వైరల్ అయింది. ఈ ఏడాది మార్చి 21న నిర్వహించిన ఈ టోర్నమెంట్‌కు చాలా టీమ్‌లు పేర్లు నమోదు చేసుకున్నాయి. త్రిసూర్ లాంటి సుదూర ప్రాంతం నుంచి కూడా టీమ్ వచ్చింది. మొత్తం 16 టీమ్‌లు టోర్నమెంట్లో పాల్గొన్నాయి. ఒక్కో టీమ్ రూ.1,500 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాయి. పోటీలో గెలిచిన టీమ్‌కు రూ.8,000 బహుమతి, రన్నరప్‌కు రూ.4,000 బహుమతిని ఆర్యన్ ప్రకటించాడు. ఈ లెక్కలు చూస్తుంటే పెద్ద పెద్ద టోర్నమెంట్లు నిర్వహించే పెద్దలకే ఔరా అనిపిస్తుంది. కానీ 15 ఏళ్లకే ఆర్యన్ ఇంత పరిణతిగా ఆలోచించాడు. టోర్నమెంట్లు నిర్వహించేందుకు ఆర్యన్ కక్కనాడ్ సాకర్ పార్క్‌ను అద్దెకు తీసుకున్నాడు. టోర్నమెంట్ తరువాత ఎంతో కొంత మొత్తాన్ని మిగుల్చుకోవాలని ఆర్యన్ ఎక్కడికక్కడ పక్కాగా లెక్కలు వేసుకున్నాడు.
రెండో టోర్నమెంట్ కూడా....
ఫుట్‌బాల్ టోర్నమెంట్ ముగిసి నెల రోజులు కూడా గడవక ముందే ఆర్యన్ మరో ఆలోచనతో ముందుకు వచ్చాడు. మొదటిసారి తన ప్రయత్నాన్ని తేలికగా తీసుకున్న తన తల్లిదండ్రులు, రెండో ప్రయత్నాన్ని మాత్రం సీరియస్‌గా పరిగణించారు. కొడుకుపై వాళ్లకు ఎనలేని నమ్మకం వచ్చేసింది. ఆ సంగతులను ఆర్యన్ తల్లి ఇషా పత్తలి ఇలా చెప్పారు. ‘‘ఆర్యన్ ఎప్పుడూ రకరకాల బిజినెస్ ఆలోచనలు చెబుతుండేవాడు. ఫుట్‌బాల్ టోర్నమెంట్ కూడా అందులో ఒకటి. దాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహించాడు. అప్పుడే నేను ఆర్యన్ తన ఆలోచనలను ఆచరణలో పెట్టడంలో ఎంత కచ్చితంగా ఉంటాడో అర్థమైంది’’ అంటున్నారు.
ఫుట్‌బాల్ టోర్నమెంట్ విజయవంతంగా పూర్తిచేసిన ఆర్యన్, రెండోసారి బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌కు సిద్ధమయ్యాడు. రెండో ప్రయత్నంలో తన స్నేహితుడితో పాటు కొన్ని సంస్థలు కూడా స్పాన్సర్ చేసేందుకు ముందుకు వచ్చాయి. పది రోజుల క్రితం, మే 24న బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌ను ఆర్యన్ నిర్వహించాడు. 8 టీమ్‌లు రిజిస్టర్ చేసుకున్నాయి. 16 టీమ్‌లు పాల్గొంటాయని ఆర్యన్ అంచనా వేశాడు. అయితే తన అంచనా తారుమారైనా ఎక్కడా నిరుత్సాహపడలేదు. ఈ విషయాన్ని ఆర్యన్ తండ్రి అజిత్ ఇలా చెప్పారు.
‘‘ఒక రోజు భోజనం టేబుల్‌పై కొన్ని మెమెంటోలను తీసుకొచ్చి పెట్టాడు. అప్పటివరకు బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహించే సంగతి నాకు తెలియదు. ఎందుకంటే నెల రోజుల ముందే ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను నిర్వహించాడు. ఇంత తక్కువ కాలంలో రెండో టోర్నమెంట్‌కు సిద్ధమయ్యాడు. అనుకున్నన్ని టీమ్‌లు రాకపోయినా ఎంతో సమర్థవంతంగా టోర్నమెంట్ ముగించాడు’’ అని ఎంతో గర్వంగా ఆర్యన్ గురించి అజిత్ మాట్లాడారు.
10వ తరగతి పూర్తిచేయాలి
ఒక పక్క చదువు, మరో పక్క టోర్నమెంట్లు నిర్వహిస్తున్న ఆర్యన్ ఈ సందర్భంగా తన ప్రయాణం గురించి, భవిష్యత్తు ప్రణాళికల గురించి కూడా చెప్పాడు. ‘‘నాకు పోర్చుగల్, క్రిస్టియానో రోనాల్డో అంటే ఇష్టం. వ్యాపారం చేయడంపై చాలా ఆలోచనలు ఉన్నాయి. మెకానికల్ ఇంజినీరింగ్ చేయాలని లక్ష్యం పెట్టుకున్నాను. ఇవన్నీ సాధించడానికంటే ముందు నేను పదో తరగతి పరీక్షలకు బాగా సిద్ధమవ్వాలి. సెలవుల్లో వచ్చిన విరామ సమయంలో టోర్నమెంట్లు నిర్వహించాను. మళ్లీ 10వ తరగతి పూర్తయ్యాకే ప్రారంభిస్తాను’’ అంటున్నాడు. ఆర్యన్‌ను క్రికెటర్‌గా చూడాలన్నది తండ్రి ఆశ. కోవిడ్‌కు ముందు క్రికెట్ కిట్ కొని సిద్ధం చేశారు కూడా! కానీ కోవిడ్‌లో ఆ ప్రాక్టీస్ అటకెక్కింది. ఆర్యన్‌కు ఫుట్‌బాల్ అంటే చాలా ఇష్టం కావడం వల్ల కోవిడ్ తరువాత కూడా ఆ కిట్ ఓపెన్ చేయలేదు. ‘‘అది అలమరలో అలాగే ఓ మూలన ఉంది. ఆర్యన్ మాత్రం ఫుట్‌బాల్ ఆడేందుకు మైదానానికి పరుగులు పెడుతున్నాడు’’ అని అజిత్ సంతోషం నిండిన కళ్లతో చెబుతున్నారు.
ఆర్యన్ ప్రయాణం మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. పిల్లల కలలు, ఆకాంక్షలను నెరవేర్చడం కంటే ముందు ప్రతి తల్లిదండ్రి వాటిని తెలుసుకోవాలి. అప్పుడే పిల్లలు మైదానాల్లో ఆటలు ఆడే ఛాంపియన్లుగానే కాదు.. ఆటలు ఆడించే ఛాలెంజర్లుగా కూడా మారతారు.








కామెంట్లు (0)