test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎఫ్ సిఐని అదానీ గ్రూప్ కు కట్టబెట్టడాన్ని తక్షణమే నిలిపివేయాలి

03 జూన్, 2026

Halt Adani-Leap India Takeover of India’s Public Food Security Infrastructure
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 03, 2026, 06:20 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ప్రభుత్వ మంత్రిత్వ శాఖల పాత్రపై జెపిసిని ఏర్పాటు చేయాలి

  • సిపిఎం డిమాండ్‌

​న్యూఢిల్లీ : భారత ఆహార సంస్థ (ఎఫ్ సిఐ)కి చెందిన సైలో పథకాన్ని అదానీ గ్రూప్‌నకు కట్టబెట్టడాన్ని తక్షణమే నిలిపివేయాలని సిపిఎం పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది. సైలో పథకంలో తొలగించిన ఏకస్వామ్య వ్యతిరేక నిబంధనను వెంటనే పునరుద్ధరించాలని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇటీవల ‘న్యూస్ లాండ్రీ’ అనే స్వతంత్ర వార్తా సంస్థ ప్రచురించిన పరిశోధనాత్మక కథనాన్ని ప్రస్తావిస్తూ.. దేశ ఆహార భద్రతా మౌలిక సదుపాయాలను కార్పొరేటీకరించడానికి జరుగుతున్న ప్రమాదకరమైన ప్రయత్నాన్ని ఇది బట్టబయలు చేసిందని ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తం 134 సైలో కాంట్రాక్టుల్లో 110 కాంట్రాక్టులను అదానీ అగ్రీ లాజిస్టిక్స్ లిమిటెడ్, లీప్ ఇండియా ఫుడ్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు రూ.16,500 కోట్లకు దక్కించుకున్నాయని పొలిట్ బ్యూరో తెలిపింది. దీంతో దేశ తిండిగింజల భద్రతా నెట్‌వర్క్‌లో మెజారిటీ వాటా ఈ రెండు సంస్థల చేతుల్లోకి వెళ్లనుందని, ఈ పథకం కింద నిల్వ చేయాల్సిన మొత్తం 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో, సుమారు 46.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ రెండు సంస్థల ఆధీనంలోనే ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో ఎఫ్ సిఐ స్వయంగా ప్రతిపాదించిన గుత్తాధిపత్య వ్యతిరేక నిబంధనను ఉల్లంఘిస్తూ ఈ పరిణామం చోటుచేసుకుందని విమర్శించింది.
​ఈ ప్రాజెక్టులో భాగంగా అదానీ గ్రూప్ ధాన్యాగారాలను (సైలోలను) పంపిణీ కేంద్రాలకు అనుసంధానించేందుకు ఒక భారీ ప్రైవేట్ రైల్వే నెట్‌వర్క్‌ను నిర్మిస్తోందని, దీని ద్వారా ధాన్యం సేకరణ, నిల్వ, రవాణా నుండి ఎగుమతి వరకు సరఫరా గొలుసులోని అన్ని దశలు పూర్తిగా అదానీ గ్రూప్‌ నియంత్రణలోకి వెళతాయని ఆందోళన వ్యక్తం చేసింది. కార్పోరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరించే ఉద్దేశంతో నీతి ఆయోగ్, ఆర్థిక వ్యవహారాల శాఖ జోక్యం చేసుకుని టెండర్ విధానంలో సమూల మార్పులు చేశాయని, అందులో భాగంగానే ఎఫ్ సిఐ ప్రతిపాదించిన గుత్తాధిపత్య నిరోధక నిబంధనను కూడా తొలగించారని వెల్లడించింది. రైతుల పోరాటాల వల్ల మూడు వ్యవసాయ చట్టాలు రద్దయినప్పటికీ, ఇప్పుడు దేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించేందుకు ‘దొడ్డి దారి’లో ప్రయత్నాలు జరుగుతున్నాయని సిపిఎం మండిపడింది. కనీస మద్దతు ధరకు (ఎంఎస్‌పి) చట్టపరమైన హామీ ఇస్తామంటూ రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి నిరాకరిస్తున్న మోడీ ప్రభుత్వం, మరోవైపు వ్యూహాత్మకంగా ప్రజా పంపిణీ వ్యవస్థను, ఎఫ్ సిఐని బలహీనపరుస్తోందని ఆరోపించింది. ప్రభుత్వ పెట్టుబడులతో ఎఫ్ సి ఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలే తప్ప, వాటిని కార్పోరేట్ సంస్థలకు అప్పగించకూడదని పొలిట్ బ్యూరో స్పష్టం చేసింది. కార్పోరేట్ సంస్థల నియంత్రణకు దోహదపడటంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ అప్రైజల్ కమిటీ, ప్రభుత్వ మంత్రిత్వ శాఖల పాత్రపై సమగ్ర విచారణ జరిపేందుకు ఒక సంయుక్త పార్లమెంటరీ కమిటీని (జెపిసి)ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. ఎఫ్ సిఐని కార్పొరేట్లు స్వాధీనం చేసుకోవడాన్ని నిరోధించేందుకు దేశంలోని ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్