DRISHYAM
సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅమరావతి, రాష్ట్ర నిర్మాణాలకు విశాఖ స్టీల్ వాడాలి

16 జూన్, 2026

visaka
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 16, 2026, 11:55 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు

ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తుల అమ్మకాలకు యార్డు కోసం అమరావతిలో పదెకరాల భూమి కేటాయించి, రాజధాని అమరావతి, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు నాణ్యమైన విశాఖ స్టీల్ ను వినియోగించాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఏచూరి భవన్‌‌ (పార్టీ జిల్లా కార్యాలయం)లో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌‌కెఎస్‌‌వి.కుమార్‌, వి.కృష్ణారావులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అమరావతి నిర్మాణానికి స్టీల్ ఎక్స్ఛేంజ్ ఇండియా లిమిటెడ్, జిందాల్ వంటి ప్రయివేటు సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకొనే ప్రయత్నాలు ఆపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యతో విశాఖ స్టీల్ ప్లాంట్‌‌కు, ప్రభుత్వానికి, ప్రజలకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యత కలిగిన విశాఖ స్టీల్ ను రాష్ట్ర ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణాలకు ఉపయోగిస్తే విశాఖ ఉక్కు ఆర్థికంగా లాభపడుతుందని తెలిపారు. ప్రభుత్వం అనేక ప్రయివేటు సంస్థలకు భూములు కేటాయిస్తోందని, అమరావతిలో విశాఖ ఉక్కు మార్కెట్ యార్డుకు, ఆఫీసు నిర్మాణానికి పది ఎకరాల భూమి కేటాయించాలని కోరారు. దేశంలో చెన్నయ్‌, ముంబయి, హైదరాబాద్ తదితర ముఖ్య నగరాల్లో స్టీల్ ప్లాంట్ కు యార్డులు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. అమరావతిలో కూడా యార్డు ఉండాల్సిన అవసరముందన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు స్టీల్ యాజమాన్యంతో ఈ అంశాలకు అనుగుణంగా ఎంఒయు చేసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కులో ఘోర ప్రమాదం జరిగి తొమ్మిది రోజులైందని, ముఖ్యమంత్రి వచ్చి తమను ఆదుకుంటారని బాధితులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. తక్షణమే ముఖ్యమంత్రి మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు, క్షతగాత్రులకు రూ.50 లక్షల పరిహారం ప్రకటించి ఆదుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించి ఉపముఖ్యమంత్రి పవన్, మంత్రి లోకేష్ వెళ్లిపోయారు తప్పితే, ఈ రోజు వరకూ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సహకారం అందించలేదన్నారు. మృతుల కుటుంబ సభ్యుల జీవనానికి ఆర్థిక సహకారం అవసరమని, నోటిమాటలతో ప్రయోజనం ఉండదని తెలిపారు. ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ప్రకటించకపోవడం వెనుక ఆర్సెలార్ మిట్టల్, అదాని, ఇతర ప్రయివేటు సంస్థల ఒత్తిళ్లు ఉన్నాయా?, స్టీల్‌ ‌ప్లాంట్‌ కార్మికులకు కోటి రూపాయలు ఇస్తే, భవిష్యత్తులో మాకు ఇది వరిస్తుందనే ఆందోళన వీరికి ఉండి మంత్రిని ప్రభావితం చేశారా? అనే అనుమానం కలుగుతోందన్నారు. లేకుంటే ఇంతవరకూ ఎందుకు ప్రభుత్వం నుంచి కోటి రూపాయలు ప్రకటించలేదని ప్రశ్నించారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కుమార్ మాట్లాడుతూ గతంలో అమరావతి రాజధాని నిర్మాణాలకు విశాఖ స్టీల్ ఉత్పత్తులను వినియోగిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రయివేటు సంస్థల స్టీల్ వినియోగానికి సిద్ధపడడం సరికాదన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్