ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.లోకనాథం
ప్రజాశక్తి- కర్నూలు కార్పొరేషన్ : పేదల భూములు, చుక్కల భూములను పరిశ్రమల పేరుతో అదాని, అంబానిలాంటి కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తూ టిడిపి కూటమి ప్రభుత్వం కేంద్రానికి దాసోహం అంటోందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.లోకనాథం విమర్శించారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా కార్మిక కర్షక భవన్ వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. అమలాపురంలో జరిగిన సంఘం రాష్ట్ర మహాసభలో ఎపి వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్ సంయుక్తంగా పోరాటాలు నిర్వహించి వ్యవసాయ కార్మికులను ఆదుకోవాలని తీర్మానించామన్నారు. పేదలు వలస వెళ్లకూడదని యుపిఎ-1 ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ఈ చట్టాన్ని మోడీ ప్రభుత్వం రద్దు చేసి ఆ స్థానంలో విబి గ్రామ్ జీ పథకాన్ని తీసుకొచ్చిందని, కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులతో ఉపాధి పనులు కల్పించాలని నిబంధనలు విధించిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులకు 40 శాతం డబ్బులు ఇవ్వలేమని చెబుతోందని, కేంద్రమే పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి పనుల్లో ఫేస్ యాప్ నిబంధన వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉపాధి కార్మికులకు సరిగా పని దొరకడం లేదన్నారు. ఉపాధి చట్టాన్ని పునరుద్ధరించి కార్మికులకు పూర్తి స్థాయిలో పని కల్పించాలని, చుక్కల భూమి, 22 ‘ఎ` భూములను పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాలకులు ప్రభుత్వ భూములను, పేదల భూములను అంబానికి, అదానికి, కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని తెలిపారు.
జులై ఒకటి నిరసన కార్యక్రమాలు
ఎపి వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్ సంయుక్తంగా జులై ఒకటి నుండి నిరసన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించినట్లు కె.లోకనాథం చెప్పారు. ఛార్టర్ ఆఫ్ డిమాండ్ పెట్టుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. గ్రామాల్లో దళితులకు నేటికీ స్మశాన వాటికలు లేవని చెప్పారు. కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమాల ఫలితంగా డిఎస్‌పి స్థాయి అధికారి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు కల్పించాల్సి ఉందన్నారు. గ్రామాల్లో దళితులపై దాడులు జరిగినా ప్రభుత్వాలు స్పందించడం లేదని తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పరిరక్షించుకోవాల్సిన, కడప ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దళిత క్రిస్టియన్లకు ఎస్‌సి హోదా కల్పనకు, అంటరానితనం నిర్మూలించేందుకు కృషి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి నారాయణ, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు మాట్లాడుతూ ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం అధికంగానే ఉందని, కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం బాగా వెనుకబడి ఉందని, బతకడానికి వలసలు వెళ్లిపోతున్నారని తెలిపారు. నూటికి 90 శాతం దళితులు వ్యవసాయ కార్మికులుగా బతుకుతున్నారని, అంటరానితనానికి, వివక్షతకు గురవుతున్నారని చెప్పారు. ఈ సమావేశంలోఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నాగన్న, కర్నూలు మండల కార్యదర్శి గోపాల్, కల్లూరు మండల నాయకులు మధు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)