DRISHYAM
సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘నమామి గంగే’ తరహాలో గోదావరి ప్రక్షాళన

16 జూన్, 2026

pk
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 16, 2026, 11:47 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • కేంద్ర ప్రభుత్వానికి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ వినతి

  • పలువురు మంత్రులతో భేటీ

ప్ర‌జాశ‌క్తి – న్యూఢిల్లీ బ్యూరో : నమామి గంగే ప్రాజెక్టు తరహాలో క్లీన్ గోదావరి నది ప్రాజెక్టును చేపట్టి.. గోదావరి ప్ర‌క్షాళ‌నకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ కోరారు. మంగ‌ళ‌వారం నాడిక్క‌డ ఆయ‌న కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి సిఆర్ పాటిల్‌, పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాద‌వ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ అయ్యారు. అనంతరం పవన్‌ మీడియాతో ‌మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జరగబోయే గోదావరి పుష్కరాలను స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలు థీమ్‌తో చేపడుతున్నామని చెప్పారు. దీనికనుగుణంగా గోదావరిని స్వచ్ఛంగా మార్చేందుకు కేంద్రం అందించే సహకారం చాలా అవసరం అన్నారు. ‘గోదావరి నది కాలుష్యం, శుద్ధి చేయని నీరు ప్రత్యక్షంగా నదిలో కలవడం వంటి సవాళ్లు ముడిపడి ఉన్నాయి. వీటిని అధిగమించేందుకు కేంద్రం తగిన విధంగా సహకారం అందించాలి. మున్సిపాలిటీల్లో నీటి శుద్ధి కేంద్రాలను మరిన్ని నిర్మించి మురుగునీటిని గోదావరిలో కలవకుండా నివారించాల్సిన అవసరం ఉంది. ఘన, ద్రవ వ్యర్థాలు గోదావరిలో ప్రత్యక్షంగా కలవకుండా ఎలా నివారించాలన్న అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. పుష్కరాలకు ముందే గోదావరి కాలుష్యాన్ని నివారించే చర్యలు తీసుకుంటాం. దీనికి కేంద్రం కూడా తగిన విధంగా సహకరిస్తుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. పుష్కరాలను కాలుష్య రహితంగా ఎలా నిర్వహించవచ్చో అన్న అంశాలతో మంత్రికి నివేదిక రూపంలో అందించాం. గతంలో సూరత్, వారణాసి, ప్రయాగ్ రాజ్‌లలో నిర్వహించిన మహాకుంభ మేళాలో చేసిన ఏర్పాట్లు, భక్తుల రద్దీ నియంత్రణ తరహా మోడల్‌ను వచ్చే పుష్కరాల్లో అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని కోరాం.
జల్ జీవన్ మిషన్‌కు కేంద్రం నుంచి మరింత సహకారం అందించాలని కోరాం’ అని తెలిపారు. గోదావరి కాలుష్య నివారణకు కేంద్ర ప్రభుత్వ సహకారం కోరిన వెంటనే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యుల‌ను పంపేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అంగీకారం తెలిపినట్టు చెప్పారు. అటవీశాఖ కామన్ ఫెసిలిటీ సెంటర్ నూతన అరణ్యారామం నిర్మాణంతోపాటు బేస్ క్యాంపుల పెంపు, గ్రేట్ గ్రీన్ వాల్‌‌కు మద్దతు, ఒడిశా నుంచి కుంకీ ఏనుగులు, మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి 50 అడవి దున్నలు రాష్ట్రానికి రప్పించేందుకు సహకారం, తగ్గుతున్న ఆడ పులుల పెంపు చర్యలు తదితర ఎనిమిది అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించినట్టు తెలిపారు. చిత్తూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోకి సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చేస్తున్న ఏనుగుల రాకపోకల మానిటరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామ న్నారు. జులై ఒకటిన విబి గ్రామ్‌ ‌జి పథకం జాతీయ స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్‌ను కోరిన‌ట్లు పవన్‌ తెలిపారు. అలాగే ఈ కార్య‌క్ర‌మానికి రావాల‌ని ఆహ్వానించామ‌న్నారు. ప‌వ‌న్‌‌కల్యాణ్‌ ‌వెంట ఎంపిలు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, లింగమనేని రమేష్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, అటవీ, పర్యావరణశాఖల ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే, పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ కృష్ణ తేజ తదితరులు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్