ఎపి రైతు సంఘం రాష్ట్ర మహాసభ పోస్టర్ ఆవిష్కరణలో వి.కృష్ణయ్య
ప్రజాశక్తి- ఏలూరు అర్బన్ : రైతులకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో చేసిన చట్టాలపై పోరాటానికి రైతాంగం సమాయత్తం కావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య పిలుపునిచ్చారు. మంగళవారం ఏలూరులోని సిఐటియు జిల్లా కార్యాలయ సమావేశపు హాలులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభ బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. దీనికి సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు అధ్యక్షత వహించారు. ‘వ్యవసాయాన్ని కాపాడండి, రైతాంగాన్ని రక్షించండి` అంటూ నినాదాలు చేశారు. ముఖ్యఅతిథి వి.కృష్ణయ్య మాట్లాడుతూ విత్తన చట్టం, నూతన ఎరువుల విధానం, విద్యుత్ చట్టం, మార్కెటింగ్ ఫ్రేమ్ వర్క్ చట్టం వంటి అనేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఈ చట్టాలు రైతాంగానికి అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్పొరేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాల వల్ల రైతాంగం మరింత తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా, భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల ఎటువంటి సుంకాలూ లేకుండా అమెరికా నుండి పాలు, పాల ఉత్పత్తులు, మొక్కజొన్న, గోధుమ, బియ్యం, పత్తి, కోడి కాళ్లు, సోయాబీన్ వంటి వ్యవసాయ ఉత్పత్తులు దేశంలోకి దిగుమతి అయ్యి దేశ రైతాంగం దివాలా తీస్తుందన్నారు. రాష్ట్రంలో అన్ని పంటల ధరలు దిగనాసిగా ఉన్నాయని, ధాన్యం, మొక్కజొన్న మొదలు పొగాకు వంటి వ్యాపార పంటలకు మార్కెట్ లేదని తెలిపారు. ప్రభుత్వం మద్దతు ధరలు కల్పించాల్సిందిపోయి కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకొంటుందన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 3, 4, 5 తేదీల్లో ఏలూరులో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభలో రైతాంగ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేసి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. జులై మూడున ‘హలో రైతన్న – చలో ఏలూరు` అంటూ భారీ రైతు ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నామని, రైతాంగం పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని కోరారు. అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షులు అశోక్ ధావలే, జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ వంటి జాతీయ రైతు నేతలు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పానుగంటి రామయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి కోనా శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యులు గుర్రం రాంబాబు, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్.లింగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి డి.ఎన్.వి.డి ప్రసాద్, నాయకులు పంపన రవికుమార్, ఎం.ఇస్సాక్ తదితరులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)