DRISHYAM
సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionభర్తీ కాని ఉద్యోగాలు

16 జూన్, 2026

apsrtc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 17, 2026, 12:05 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఎపిఎస్‌ఆర్‌‌టిసిలో రిటైర్మెంట్ తప్ప నియామకాలు లేవు

  • కొత్తగా ప్రైవేటు ఎలక్ర్టిక్ బస్సులతో మరీ ఇబ్బంది

  • నెలకు 250 మంది ఉద్యోగ విరమణ

  • ఇప్పటికే 12 వేలకు పైగా ఖాళీలు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎపిఎస్ఆర్‌‌టిసిలో నియామకాల విషయంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రిటైర్మెంట్ అయిన సిబ్బంది వెళ్లిపోవడం తప్ప ఖాళీ పోస్టుల్లో మరొకరిని నియమించడం లేదు. ఇప్పటి వరకూ ఆర్‌‌టిసిలో కారుణ్య నియామకాలు, మెడికల్ అన్ ఫిట్ అయిన వారికి అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలిస్తున్నారు. శాశ్వత నియామకాలు దాదాపు నిలిచిపోయాయి. ఇదే సమయంలో ఎలక్ర్టిక్ బస్సులు వస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల పరిస్థితి మరీ ఇబ్బందిగా తయారైంది. డిపోలకు డిపోలను ఖాళీ చేయించడం, వెళ్లిన డిపోలో పాత బస్సులే ఉండటం, కొత్త బస్సులు కొనుగోలు చేయకపోవడంతో సమస్య మరింత జఠిలమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఉన్న బస్సుల్లో చాలా వరకూ పాడైపోయిన స్థితికి చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 55 వేల మంది సిబ్బంది ఉన్నారు. ప్రతినెలా 250 మంది వరకూ రిటైర్ అవుతున్నారు. ఏడాదికి సుమారు 2 వేల మంది వరకూ వెళ్లిపోతున్నారు. వీరి స్థానంలో కొత్త ఉద్యోగుల నియామకం లేదు. ఇప్పటికే 12 వేల మంది సిబ్బంది అవసరం ఉందని ప్రభుత్వానికి సంబంధిత అధికారులు లేఖ రాశారు.

రూ.లక్షల కోట్ల ఆస్తులపై ప్రైవేటు పెత్తనం

ఒకవైపు బస్సులు కాలం చెల్లినవని తీసేస్తున్నారు. మరోవైపు అదనపు సిబ్బంది అంటూ కొందరిని తొలగించుకుంటూ వస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో ఉండే విద్యుత్ బస్సులను తీసుకొస్తున్నారు. ఇన్నాళ్లూ సంస్థను నిలబెట్టిన ఉద్యోగులు వెళ్లిపోతున్నారు. బస్సులూ తగ్గిపోతున్నాయి. రూ.లక్షల కోట్ల సంస్థ ఆస్తులను మాత్రం నామమాత్రపు లీజుకు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. అక్కడ లీజుకు తీసుకున్న డిపోలను వారికి ఇష్ట్చినట్లు వాడుకునేలా ఒప్పందం చేసుకుంటున్నారనే విమర్శలూ ఉన్నాయి. ప్రైవేటు బస్సులు వయబులిటీ కోసం ప్రస్తుతానికి పట్టణ ప్రాంతాల్లోనే తిప్పనున్నారు. లాంగ్ రూట్లలో విద్యుత్ బస్సులు తిప్పడం కష్టంగా ఉంటుంది. ఛార్జింగు స్టేషన్లు సరిపోయినన్ని లేకపోవడంతో సమస్య మరింత జఠిలమయ్యే అవకాశం ఉండటంతో చిన్న చిన్న రూట్లలోనే తిప్పాలని నిర్ణయించారు. చిన్న చిన్న రూట్లలో, నగరాల్లో పరిమిత సంఖ్యలో తిరిగే బస్సుల కోసం రూ.వేలకోట్ల ఆస్తులను అప్పగించేస్తున్నారు. అంటే ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనే కుట్ర తప్ప మరొకటి లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. విద్యుత్ బస్సులు పర్యావరణ హితమని చెబుతున్నా.. వాస్తవంగా రెండేళ్లకు మించి ఎక్కువ మన్నిక ఉండటం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. అటువంటప్పుడు వాటిని నమ్మి ప్రస్తుతం ఉన్న బస్సుల నిర్వహణ నుండి సంస్థ తప్పుకోవడం ద్వారా ప్రజా రవాణా వ్యవస్థ దెబ్బతింటుందని చెబుతున్నారు. దీనిపై ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్