DRISHYAM
సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జాగ్రత్తగా ఉండాలి : మంత్రి అనితపై వ్యాఖ్యలను ఖండించిన డిప్యూటి సిఎం పవన్‌

16 జూన్, 2026

Must be careful: Deputy CM Pawan condemns remarks against Minister Anita.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 16, 2026, 11:40 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

అమరావతి : మహిళల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఎపి డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి, ప్రతిపక్ష వైసిపి నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది. వైసిపి సర్కారులో మాజీ మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్, ప్రస్తుత హోం మంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి ‘మేకప్ మంత్రి’ అని చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు, మహిళా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న ఒక మహిళా మంత్రిని, అది కూడా రాష్ట్ర శాంతిభద్రతలను పర్యవేక్షించే హోంమంత్రిని పట్టుకుని వ్యక్తిగత రూపం, ఆహార్యంపై ఇలాంటి చౌకబారు విమర్శలు చేయడం రాజకీయ సంస్కృతికి తగదని ధ్వజమెత్తుతున్నారు. అమర్నాథ్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో …. గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఎపి డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ ఖండించారు. దీనిపై ఓ ప్రకటన మంగళవారం విడుదల చేశారు. మహిళల కట్టు, బొట్టుపై వ్యాఖ్యానించే స్థాయికి వైసిపి నేతలు దిగజారిపోయారని విమర్శించారు. ఆ వ్యాఖ్యలు కేవలం అనితను అన్నట్టు కాదని, సగటు మహిళలందరినీ కించపరిచినట్లేనని పవన్‌ అభిప్రాయపడ్డారు. మహిళల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ప్రజా జీవితంలో ఉన్నవారి నోటి నుంచి వచ్చే ప్రతి మాటను పౌర సమాజం గమనిస్తోందనే విషయాన్ని మరచిపోవద్దని హెచ్చరించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయని.. అవి విధానపరంగానే ఉండాలని అభిప్రాయపడ్డారు. ఏదైనా ఓ విధానం నచ్చకపోతే ఆ విషయం పైనే విమర్శించాలన్నారు. నోటికొచ్చినట్టు ఇళ్లలోని స్త్రీలను కించపరచే నైజం ఉన్న పార్టీ నేతలు చేసే వ్యాఖ్యల్ని బలంగా తిప్పికొట్టాలని కూటమి నేతలకు సూచించారు. వారు మాట్లాడే మాటలు ఎంతటి అభ్యంతరకరమైనవో ప్రజలకు తెలియజేయాలన్నారు. పౌర సమాజం హర్షించే భాషలోనే కూటమి నేతలందరూ బలంగా బదులివ్వాలని స్పష్టం చేశారు. అవతలి పార్టీ వాళ్ల మాదిరి దిగజారుడు భాష, అర్థరహిత వ్యాఖ్యలు కూటమికి అవసరం లేదని డిప్యూటి సిఎం పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్