మంత్రి నిమ్మల రామానాయుడు
ప్రజాశక్తి-పెద్దదోర్నాల (మార్కాపురం జిల్లా) : ఈ నెలాఖరులో వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ పరిహారాన్ని సిఎం చంద్రబాబు చేతుల మీదుగా అందజేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. జులై చివరి నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యేలా కృషి చేస్తామని, నల్లమల సాగర్ రిజర్వాయర్‌లో నీళ్లు నింపడానికి, నిర్వాసితుల పునరావాసానికి అదనపు బడ్జెట్‌లో రూ.905 కోట్లు కేటాయించామని స్పష్టం చేశారు. మంగళవారం అధికారులతో కలసి దోర్నాలలో వెలిగొండ ప్రాజెక్టు జంట సొరంగాల్లోకి వెళ్లి టన్నెల్ లైనింగ్, టన్నెల్ బోరింగ్ మెషిన్ తొలగింపు పనులను క్షేత్ర స్థాయిలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ టన్నెల్-1 లో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న 1. 20 లక్షల క్యూబిక్ మీటర్ల మక్ తొలగింపు పనులలో ఇప్పటికి 40 వేల క్యూబిక్ మీటర్లు తొలగించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల్లో టన్నెల్-2లో ఏడు కిలోమీటర్ల లైనింగ్‌కిగానూ 5.5 కిలోమీటర్ల లైనింగ్ పనులు పూర్తి చేశామన్నారు. మిగిలిన 1.5 కిలోమీటర్ల లైనింగ్ జులై చివరి నాటికి పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. టన్నెల్-2లో చిక్కుకుపోయిన టన్నెల్ బోరింగ్ మెషిన్ వెలికితీత పనులు చేపట్టి, మొత్తం ఏడు కంపార్ట్‌మెంట్‌లలో ఇప్పటికి మూడు కంపార్ట్‌మెంట్లు బయటకు తీసుకొచ్చామని, టన్నెల్ బోరింగ్ మెషిన్‌లో క్లిష్టమైన హెడ్‌ను అక్కికక్కడే టన్నెల్‌లోనే పూడ్చిపెట్టడానికి అవకాశాలు పరిశీలిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం, సీజన్ మొదలయ్యే నాటికి నల్లమలసాగర్ రిజర్వాయర్ నింపేలా పనులు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, ఆర్‌డిఒ శివరాం రెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, టిడిపి యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)