రేపు 21 తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు రాందేవ్ బాబాతో శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని తెలుస్తోంది. ఆయన గారిని ఆహ్వానించేందుకు ప్రభుత్వం కొంతమందిని హరిద్వార పంపడం సిగ్గుచేటు. ఎక్కడైనా పాలకులు, ప్రజలు... కార్యక్రమాలకు శాస్త్రవేత్తలను ఆహ్వానిస్తారు. కానీ మన దేశంలో పాలకులు సాధువులను, సన్యాసులును ఆహ్వానిస్తారు. వారికి సాష్టాంగ పడతారు. ఇది చాలా విచారకరం. ఈ రోజు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు యోగా పిచ్చి బాగా పట్టింది. యోగా శాస్త్రీయం కాదు. కానీ...ఆత్మను పరమాత్మలో కలిపేందుకు దగ్గరి మార్గమని క్రీస్తుపూర్వం 200 నాడు పతంజలి యోగాను మొదటిసారిగా ప్రతిపాదించాడు. అదే తన గ్రంథంలో మొదటిలోనే రాసుకున్నాడు. యోగా వలన చనిపోయిన వారితో మాట్లాడవచ్చని, ఏనుగు అంత బలం వస్తుందని, పరకాయ ప్రవేశం చేయవచ్చని, పశుపక్షాదుల భాషలు తెలుస్తాయని ఇంకా చాలా అశాస్ర్తీయమైనవి రాసుకొన్నాడు. ప్రాణాయామంలో గాలి పీల్చే క్రమంలో గాలిని ఎక్కువసేపు బిగబట్టినపుడు, అందులో ఆక్సిజన్ శాతం తగ్గి, బొగ్గు పులుసు శాతం పెరిగినపుడు మెదడు భ్రమలకు లోనై రకరకాల వికృతమైన భ్రమలు వస్తాయి. అందువలన పక్షవాతం రావచ్చు, పిచ్చి పట్టవచ్చు, చివరికి చనిపోవచ్చు. పైన పేర్కొన్నవన్నీ అందులో భాగమే! అది ఒక మతపరమైన ఆచారం మాత్రమే. ఎందుకంటే తుచ్ఛమైన ఈ శరీరం శాశ్వతం కాదనీ, అసలైనది పరమాత్మలో కలవటమేననీ పూర్వం ఆధ్యాత్మిక వాదులు రకరకాల మార్గాలు ఎంచుకున్నారు. అందులో ఈ యోగా ఒకటి. అంతేగాని, అందులో ఎలాంటి శాస్త్రీయతా లేదు. మోడీ ఈ దేశాన్ని రామరాజ్యంగా చేసే భాగంలో యోగాను ప్రచారం చేస్తున్నాడట. ఆయన భక్తులు యోగా భజన చేస్తున్నారు. అయితే...యోగా మాస్టర్‌గా పేరొందిన రాందేవ్ బాబాను కల్తీ సరుకులు, కల్తీ మందులు అమ్మినందుకు సుప్రీం కోర్టు పలుమార్లు చీవాట్లు పెట్టింది. అరెస్ట్ వారెంట్లు కూడా పంపింది. ఈయన మందులను నేపాల్ ప్రభుత్వం నిషేధించింది. పతంజలి మందులను వాడితే కంటిచూపు పోతుందని, చివరికి ప్రాణం కూడా పోవచ్చని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఐదు రకాల మందులను నిషేధించింది. ఈయన ఒక చీటింగ్ బాబా. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆశ్రయించి విశాఖపట్నం దగ్గర గతంలో స్వరూపానందకు కాన్సిల్ చేసిన కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు రాందేవ్ బాబా చంద్రబాబును ఆశ్రయిస్తున్నారు. తమ వద్ద మహిమలు, దివ్య శక్తులు ఉన్నాయని చెప్పుకునే, ఇలాంటి వారిని బయట తిరగనివ్వరాదు. కనుక తక్షణమే పాలకులు యోగా ప్రచారం మానుకుని, ఆరోగ్యం కోసం మంచి డ్రిల్లు పంతుళ్ల సలహాలు తీసుకోవాలి.
- నార్నె వెంకట సుబ్బయ్య








కామెంట్‌లు (0)