ఇండియా × ఆఫ్ఘనిస్తాన్, ఇండియా-ఎ × ఆఫ్ఘన్-ఎ మరియు మహిళల టి20 ప్రపంచకప్ లో నెదర్లాండ్స్ తో కీలక మ్యాచ్
క్రికెట్ ప్రేమికులకు నేడు కనుల విందు కానుంది. మైదానంలో పురుషుల, మహిళల జట్లు కీలక మ్యాచ్‌లతో బిజీగా ఉండగా.. క్రీడా యవనికపై భారతీయతకు మరో అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతూ ‘టైమ్’ మ్యాగజైన్ అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో స్మృతి మంధాన చోటు దక్కించుకుని దేశం గర్వించేలా చేసింది. మరోవైపు ఇండియా-ఆఫ్గనిస్తాన్ మధ్య రెండో వన్డే జరగనుంది. శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో టీమిండియా-ఎ జట్టు ఆఫ్గనిస్తాన్-ఎ జట్టుతో కీలక మ్యాచ్ ఆడనుంది. ఇటు మహిళల టి-20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో ఇండియా తలపడనుంది. మొత్తంగా నేడు ట్రిపుల్ ధమాకా నెలకొంది.
క్రికెట్ ప్రేమికులకు బుధవారం ట్రిపుల్ మజా దక్కనుంది. పురుషుల క్రికెట్ లో ఇండియా – ఆఫ్ఘనిస్తాన్ లతో వేర్వేరు విభాగాల్లో రెండు మ్యాచ్ లు జరగనుండగా.. ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్ లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్ తో కీలక పోరులో తలపడనుంది. ధర్మశాల వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన తొలి వన్డేలో భారతజట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచి మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యతలో నిలువగా.. ముక్కోణపు వన్డే సిరీస్ లో భారత యువ జట్టు వరుసగా రెండు వన్డేల్లో ఓడి ఫైనల్ బెర్త్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఈ క్రమంలో నేడు ఆఫ్ఘన్ యువ జట్టుతో జరిగే మ్యాచ్ లో భారీ తేడాతో గెలిస్తేనే ఫైనల్ ఆశలు సజీవంగా నిలుపుకోనుంది. ఇక ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్ లో హర్మన్ ప్రీత్ సేన నేడు నెదర్లాండ్స్ తో తలపడనుండగా.. తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ మహిళలపై 64 పరుగుల తేడాతో గెలిచిన ఉత్సాహంతో నేటి మ్యాచ్ కు సిద్ధమైంది.
యుధ్ వీర్ స్థానంలో అశోక్ శర్మ
శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌కు భారత ఏ జట్టులో కొత్త ఆటగాడు వచ్చి చేరాడు. గాయపడిన యువ పేసర్ యుధ్‌వీర్ సింగ్ స్థానంలో అశోక్ శర్మ ఎంపికయ్యాడు. ఐపీఎల్ 19వ సీజన్‌లో అరంగేట్రం చేసిన అశోక్ గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. టీమిండియా తదుపరి మ్యాచుల్లో యుధ్‌వీర్ బదులు ఈ పొడగరి పేసర్ స్క్వాడ్‌లో కొనసాగుతాడని మంగళవారం బిసిసిఐ ప్రకటించింది. దీంతో యుధ్ వీర్ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కొన్నిరోజులు రిహాబిలి టేషన్‌లో ఉంటాడని, దాంతో, యుధ్‌వీర్ స్థానంలో అశోక్ శర్మను ఎంపిక చేయాల్సి వచ్చిందని బీసీసీఐ వెల్లడించింది. గత కొన్ని నెలలుగా అశోక్ శర్మ గొప్పగా రాణిస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసాడు.
స్మృతి మంధానకు అరుదైన గౌరవం
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత ‘టైమ్’ మ్యాగజైన్ 2026 ఏడాదికి ప్రకటించిన ‘క్రీడారంగంలో 100 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల’ జాబితాలో ఆమెకు చోటు లభించింది. ఈ జాబితాలో స్థానం పొందిన ఏకైక భారత క్రీడాకారిణిగా స్మృతి మంధాన మాత్రమే. దీంతో మంధాన ఫుట్‌బాల్ దిగ్గజాలు లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, బాస్కెట్‌బాల్ స్టార్ లెబ్రాన్ జేమ్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారుల సరసన చేరింది. ప్రపంచ క్రీడారంగాన్ని తమ ప్రతిభ, నాయకత్వ పటిమ, పెట్టుబడులతో ప్రభావితం చేస్తున్న క్రీడాకారులు, కోచ్‌లు, నిర్వాహకులతో ఈ జాబితాను రూపొందించినట్లు టైమ్ మ్యాగజైన్ వివరించింది. మహిళల క్రికెట్‌లో సరిహద్దులను చెరిపేస్తూ, అద్భుతమైన వ్యక్తిగత రికార్డులతో పాటు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నందుకే స్మృతిని ఈ జాబితాలో చేర్చినట్లు తన ప్రొఫైల్‌లో పేర్కొంది. “స్మృతి కోసం రికార్డులు బద్దలవుతూనే ఉన్నాయి” అని ప్రశంసించింది. దేశవాళీ వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో పాటు మూడు అంతర్జాతీయ ఫార్మాట్లలోనూ సెంచరీలు నమోదు చేసిన తొలి భారత క్రీడాకారిణిగా ఆమె ఘనతను సాధించింది.









కామెంట్‌లు (0)