కొచ్చి : సిఎంఆర్ఎల్ చెల్లింపుల వ్యవహారం ఆరోపణలపై కేరళ మాజీ సిఎం విజయన్ కుమార్తె టి.వీణ బుధవారం ఈడి విచారణకు హాజరయ్యారు. దీంతో ఈడి కార్యాలయం ఎదుట భద్రతను కట్టుదిట్టం చేశారు. సిఐఎస్ఎఫ్, కేరళ పోలీసు సిబ్బందిని మోహరించారు. టి.వీణ బుధవారం ఉదయం 10.25 గంటలకు ఈడి కార్యాలయానికి చేరుకున్నారు. ఆమె భర్త, బేపూర్ ఎమ్మెల్యే పి.ఎ.మహమ్మద్ రియాస్ ఆమెతో పాటు వచ్చారు. ప్రస్తుతం మూత పడిన ఆమె సంస్థ ఎక్సలాజిక్ ఐటికి సిఎంఆర్ఎల్ రూ.2.78కోట్లు చెల్లింపులు జరిపిందన్న ఆరోపణలపై ఈడి విచారణ చేపట్టింది. మొదట జూన్ 12న విచారణకు హాజరుకావాలని ఈడి నోటీసులు జారీ చేసింది. అయితే అనారోగ్య సమస్యలతో విచారణను వాయిదా వేయాలని కోరగా, జూన్ 17న హాజరుకావాలని మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఆమె విచారణకు హాజరుకావడం ఇదే మొదటి సారి.
సిఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శశిధరన్ ఎస్. కర్తా కుమార్తె శిబీ ఎస్. కర్తాను ఈడి సోమవారం విచారించింది. మంగళవారం సిఎంఆర్ఎల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శరణ్ ఎస్. కర్తాను, శశిధరన్ కర్తా భార్య జయ ఎస్. కర్తాను ప్రశ్నించింది. శశిధరన్ కర్తా నిర్వహిస్తున్న ఎంపవర్ ఇండియా క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఆమె డైరెక్టర్‌గా ఉన్నారు. ఎక్సలాజిక్ కంపెనీ సకాలంలో తిరిగి చెల్లింపులు చేయడంలో విఫలమైనప్పటికీ, ఈ సంస్థ ఆ కంపెనీకి రూ. 50 లక్షల రుణాలు ఇచ్చినట్లు ఈడి ఆరోపించింది.









కామెంట్‌లు (0)