test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కువైట్‌ ఎయిర్‌‌పోర్ట్‌‌పై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్‌ దాడి

5 రోజుల క్రితం

war
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 03, 2026, 10:41 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

FacebookEmailWhatsAppXTelegram

  • భారతీయుడు మృతి, పలువురికి గాయాలు

  • ఖమేనీని కలవాలని వుందన్న ట్రంప్‌

  •  నెతన్యాహు వైఖరితో కలత చెందుతున్నానంటూ వ్యాఖ్యలు

  • ఇరాన్‌ క్రిప్టో ఎక్స్ఛంజ్‌‌పై అమెరికా ఆంక్షలు

కువైట్‌, టెహ్రాన్‌ : కువైట్‌ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్‌ ‌వన్‌ భవనంపై బుధవారం తెల్లవారు జామున డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్‌ ‌దాడి జరిపింది. ఈ దాడిలో పలువురు గాయపడ్డారని కువైట్‌ ‌ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది. దీంతో విమానాలను కూడా దారి మళ్లించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. రక్షణ శాఖ ప్రతినిధి బ్రిగేడియర్‌ ‌సాద్‌ అబ్దుల్లా అజీజ్‌ అల్‌ ‌కైతబి మాట్లాడుతూ, విమానాశ్రయంలోని ప్రయాణికుల భవనాన్ని లక్ష్యంగా చేసుకుని అనేక డ్రోన్లు దాడి చేశాయని తెలిపారు. భవనం తీవ్రంగా ధ్వంసమైందన్నారు. అనేకమంది గాయపడ్డారని చెప్పారు. భారతీయుడు ఒకరు మృతి చెందారని అధికారులు తెలిపారు. కువైట్‌‌లోని భారత్‌ ఎంబసీ ఈ విషాద ఘటనకు సంతాపం తెలియచేస్తూ ఎక్స్‌‌లో పోస్టు పెట్టింది. బాధిత కుటుంబానికి అలాగే గాయపడిన వారికి అవసరమైన సాయం అందించడానికి సిద్ధంగా వున్నట్లు తెలిపింది. ఈ దాడిలో ఎయిర్‌‌పోర్టులో కొన్ని సదుపాయాలు దెబ్బతిన్నందున ఎయిర్‌ ‌ట్రాఫిక్‌‌ను నిలిపివేసినట్లు డిజిసిఎ ప్రతినిధి అబ్దుల్లా తెలిపారు. మంగళవారం పొద్దుపోయిన తర్వాత కూడా ఇరాన్‌, అమెరికాల మధ్య క్షిపణి దాడులు జరిగాయి. ఇరాన్‌ ‌మిలటరీ స్థావరాలపై దాడి చేశామని అమెరికా మిలటరీ ప్రకటించింది. అందుకు ప్రతిగా కువైట్‌, బహ్రెయిన్‌‌లపై ఇరాన్‌ ‌క్షిపణులు పడ్డాయి. ఆ నేపథ్యంలోనే కువైట్‌పై దాడి కూడా చోటు చేసుకుంది. బహ్రెయిన్‌‌పై ప్రయోగించిన మూడు క్షిపణులను అమెరికా, బహ్రెయిన్‌ ‌బలగాలు అడ్డుకున్నాయి. గల్ప్‌ ‌ప్రాంతంలో క్షిపణులు, డ్రోన్లతో జరిగిన వరుస దాడులను విజయవంతంగా అడ్డుకున్నామని అమెరికా మిలటరీ ప్రకటించింది. ఇరాన్‌ ‌క్వెషమ్‌ ‌దీవిపై దాడులు కూడా జరిపామని తెలిపింది. బహ్రెయిన్‌‌లోని అమెరికా నావికాదళానికి చెందిన ఫిఫ్త్‌ ‌ఫ్లీట్‌ ‌ప్రధాన కార్యాలయంపై, అదే ప్రాంతంలోని మరో వైమానిక స్థావరంపై దాడి చేశామని ఐఆర్‌‌జిసి ప్రకటించడాన్ని అమెరికా సెంట్రల్‌ ‌కమాండ్‌ ‌తిరస్కరించింది.

ఖమేనీని కలుసుకోవాలనుకుంటున్నా : ట్రంప్‌

ఇరాన్‌ ‌సుప్రీం నేత ముజ్తబా ఖమేనీని కలవాలని తాననుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‌చెప్పారు. ‘‘ఆయనను కలవాలని వుంది, ఏదో ఒక సమయంలో మేం కలుస్తాం, అది ఎలా జరుగుతుందనే దానిపై అంతా ఆధారపడి వుంటుంది.’’న్యూయార్క్‌ ‌పోస్టు పాడ్‌‌కాస్ట్‌‌లో బుధవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ అణ్వాయుధాన్ని కలిగివుండరాదన్నది తమ వైఖరి అని ట్రంప్‌ ‌స్పష్టం చేశారు. ఇరాన్‌‌ కూడా ఇందుకు అంగీకరించిందన్నారు.
ఇరాన్ యుద్ధం ముగిస్తే అమెరికాలో గ్యాస్‌ ‌ధరలు తగ్గుతాయని అన్నారు. అయితే ప్రస్తుతం ద్రవ్యోల్బణం అంత ఎక్కువగా లేదన్నారు. గ్యాస్‌‌ ధరను తీసేస్తే అసలు ద్రవ్యోల్బణమే వుండదన్నారు.

నెతన్యాహు వైఖరి నచ్చట్లేదు

లెబనాన్‌‌తో ఇజ్రాయిల్‌ ‌యుద్ధం చేయడం తనకు నచ్చడం లేదన్నారు. అందువల్లే ఆయనతో కఠినంగా మాట్లాడాల్సి వచ్చిందని అంగీకరించారు. ‘నాకు కోపం వచ్చిందనడం లేదు. కానీ ఆయన నిరంతరంగా లెబనాన్‌‌తో యుద్ధం చేయడం పట్ల కలత చెందా. అది మీకు కూడ తెలుసు.’’ అని ఇంటర్వ్యూలో చెప్పారు. ఐఆర్‌‌జిసితో సంబంధాలున్నాయన్న కారణంతో ఇరాన్‌‌లోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛంజ్‌‌పై అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్‌ ‌ప్రభుత్వం, బ్లాక్‌ ‌లిస్ట్‌‌లో పెట్టిన ప్రభుత్వ సంస్థలు పశ్చిమ దేశాల ఆంక్షలను తప్పించుకోవడానికి ఇది ఉపకరించిందంటూ ట్రంప్‌ ‌విమర్శించారు.
కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుండగానే హర్మూజ్‌ జలసంధిలోని ఖెష్మ్‌ దీవిపై ‘ఆత్మరక్షణ’ దాడులు జరిపానని అమెరికా సైన్యం బుధవారం ఉదయం తెలిపింది. ఇరాన్‌ వైపు నుంచి దూసుకొచ్చిన పలు బాలిస్టిక్‌ క్షిపణులు, డ్రోన్లను విజయవంతంగా తిప్పికొట్టామని సెంట్రల్‌ కమాండ్‌ (సెంట్‌కామ్‌) సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. . హర్మూజ్‌ జలసంధి సమీపంలో ఓ ఇరాన్‌ చమురు ట్యాంకర్‌పై అమెరికా దాడి చేసిందని, దానికి ప్రతిగా నౌకాదళ క్షిపణులతో ప్రయాణిస్తున్న అమెరికా-ఇజ్రాయిల్‌ ఓడపై దాడి చేశామని ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జిసి) అంతకుముందు తెలియజేసింది. ఖెష్మ్‌ దీవికి దక్షిణంగా ఉన్న ఐఆర్‌జిసి కమ్యూనికేషన్‌ టవర్‌పై కూడా అమెరికా సేనలు దాడి చేశాయని తెలిసింది. దీంతో బహ్రెరైన్‌లోని అమెరికా వైమానిక స్థావరంపై క్షిపణులు, డ్రోన్లతో ఐఆర్‌జిసి దాడి జరిపింది. దాడికి గురైన వాటిలో అమెరికా ఫిప్త్‌ ఫ్లీట్‌ కేంద్ర కార్యాలయం, హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. అయితే బరైన్‌లో ఎలాంటి దాడులు జరగలేదని అమెరికా సైన్యం చెబుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్