test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హోర్ముజ్ జలసంధి మూసివేత..!

4 రోజుల క్రితం

i-iran-attack.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 11, 2026, 08:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • పశ్చిమాసియాలో భీకర దాడులు..

  • ఇరాన్‌పై అమెరికా క్షిపణుల వర్షం..

  • సైనిక స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులు!

టెహ్రాన్‌ : పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యానికి, అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘హోర్ముజ్ జలసంధిని’ పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. ప్రాంతీయ అభద్రతా పరిస్థితుల దృష్ట్యా చమురు ట్యాంకర్లతో సహా అన్ని వాణిజ్య ఓడల రాకపోకలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. “హోర్ముజ్ జలసంధిని అశాంతికి గురిచేస్తే ఇరాన్ నలుమూలల నుండి ఈ ప్రాంతాన్ని మీకు నరకంగా మారుస్తాం” అని  ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ మాజిద్ మూసవి అమెరికా కూటమిని తీవ్రంగా హెచ్చరించారు.

మరోవైపు, ఒకవైపు శాంతి చర్చల పేరుతో కాల్పుల విరమణ గురించి మాట్లాడుతూనే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు యూఎస్ సైన్యం ఇరాన్‌పై భీకర వైమానిక దాడులకు తెరలేపింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో పాటు సిరిక్, మినాబ్, బందర్ అబ్బాస్ వంటి వ్యూహాత్మక ప్రాంతాలే లక్ష్యంగా అమెరికా క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దాడులతో ఆయా నగరాల్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అమెరికా వైమానిక దాడుల నేపథ్యంలో ఇరాన్ సైన్యం కూడా తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేసింది. అంతకుముందు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా ఇరాన్‌కు చెందిన కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బాంబులు వేయనున్నట్లు వెల్లడించడం గమనార్హం.

అమెరికా దాడులకు ఇరాన్ సైతం అంతే దీటుగా బదులిచ్చింది. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌ దేశాలలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ క్షిపణులతో ప్రతిదాడులు చేసింది. తమ దేశంలోని ‘మువాఫాక్ సాల్టీ’ వైమానిక స్థావరం లక్ష్యంగా దూసుకొచ్చిన ఐదు ఇరాన్ క్షిపణులను విజయవంతంగా కూల్చివేసినట్లు జోర్డాన్ రక్షణ వర్గాలు ప్రకటించాయి. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చల ప్రక్రియ సాగుతున్న తరుణంలోనే హోర్ముజ్ జలసంధి మూసివేత, పరస్పర క్షిపణి దాడులు చోటుచేసుకోవడంతో పశ్చిమాసియాలో మళ్లీ భయానక పరిస్థితులు నెలకొన్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్