test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పెళ్లయిన కొన్ని గంటలకే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో వరుడు మృతి

6 రోజుల క్రితం

death
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 01, 2026, 01:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

జార్జియా : పెళ్లయిన కొన్ని గంటలకే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘోర ఘటన అమెరికాలోని జార్జియాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై అక్కడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అట్లాంటాలో నివసిస్తున్న 25 ఏళ్ల డేవ్‌ ఫిజీ డెల్టా ఎయిర్‌లైన్స్‌లో పైలట్‌గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితమే ఇతని తల్లిదండ్రులు కేరళలోని ఎర్నాకుళం నుంచి అమెరికాకు వలస వెళ్లారు. మే 29న జార్జియాలోని డాసన్‌ విలె ప్రాంతంలో కేరళ మూలాలున్న జెస్ని అనే యువతితో డేవ్‌కు ఘనంగా వివాహం జరిగింది. ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల కోలాహలం మధ్య వివాహ వేడుక ఎంతో సంతోషంగా సాగింది. వివాహ వేడుకలు ముగిసిన అనంతరం రాత్రి 10 గంటల సమయంలో వధూవరులిద్దరూ డాసన్‌విలెలోని వేదిక నుంచి అట్లాంటాలోని ఒక హోటల్‌కు వెళ్లేందుకు హెలికాప్టర్‌లో బయల్దేరారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పర్వత ప్రాంతంలో ఈ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో వరుడు డేవ్‌తో పాటు హెలికాప్టర్ పైలట్ కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన తర్వాత సహాయక సిబ్బంది వచ్చేవరకు వధువు జెస్ని హెలికాప్టర్ శిథిలాల కిందనే చిక్కుకుపోయింది. తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడిన ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

వాతావరణం బాలేదని, ఇప్పుడు ప్రయాణించడం క్షేమం కాదని డేవ్ మొదట అన్నాడని, అయితే ఎక్కువ ఎత్తులో వెళ్దామనే నిర్ణయంతోనే వారు హెలికాప్టర్‌లో బయల్దేరారని డేవ్ తండ్రి జార్జ్‌ ఫిజీ కన్నీటిపర్యంతమయ్యారు. కళ్లముందే కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. పెళ్లయిన కొన్ని గంటలకే భర్తను కోల్పోవడంతో జెస్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదిక 30 రోజుల్లో వస్తుందని అమెరికా అధికారులు వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్