test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆరు రోజుల్లో ఆరు వేల కిలోమీటర్లు

16 మే, 2026

amul birds
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 16, 2026, 11:56 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- అరేబియా సముద్రం దాటి వెళ్తున్న అమూర్‌
- కేంద్ర పర్యావరణ మంత్రి వెల్లడి
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా శాస్ర్తవేత్తల దృష్టిని ఆకర్షిస్తున్న అమూర్‌ ‌ఫాల్కన్‌ ‌పక్షులు వేలకు వేలు కిలోమీటర్ల దూరాన్ని విరామం లేకుండా దూసుకెళ్తున్నాయి. పావురం పరిమాణంలో ఉండే ఈ చిన్న పక్షులు ఎక్కడా ఆగకుండా ఖండాలు దాటి, మహాసముద్రాలు మీదుగా సుదీర్ఘ ప్రయాణాన్ని సాగిస్తున్నాయి. కేవలం ఆరు రోజుల్లోనే దాదాపు ఆరు వేల కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని శనివారం నాడు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. 2025 నవంబర్ లో మణిపుర్‌లోని తమేంగ్‌లాంగ్‌ జిల్లాలో ఉన్న చియులువాన్‌ ప్రాంతంలో మూడు అమూర్‌ ఫాల్కన్లకు శాటిలైట్‌ ట్యాగ్‌లు అమర్చామని ఆయన తెలిపారు. ఈ పక్షులు దక్షిణాఫ్రికాలోని తమ శీతాకాల నివాస ప్రాంతాల్లో నాలుగు నెలలకు పైగా గడిపిన తర్వాత ఇప్పుడు వసంతకాల వలస ప్రయాణాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. తూర్పు ఆసియాలోని తమ సంతానోత్పత్తి ప్రాంతాలకు భారత్‌ మీదుగా తిరిగి వెళ్తున్నాయని ఆయన చెప్పారు. సోమాలియా నుంచి ఈశాన్య భారతదేశం వరకు ఈ అమూర్‌ ఫాల్కన్లు దాదాపు 6,000 కిలోమీటర్ల దూరాన్ని ఆరు రోజుల్లో ఎక్కడా ఆగకుండా ప్రయాణిస్తాయని కేంద్ర మంత్రి తెలిపారు.

అరేబియా సముద్రం దాటి..
శాటిలైట్‌ ట్యాగ్‌ అమర్చిన ఆడ అమూర్‌ ఫాల్కన్‌ అలాంగ్‌ ప్రస్తుతం భారత పశ్చిమ తీర ప్రాంతం వైపు వస్తోందని భూపేందర్‌ యాదవ్‌ తెలిపారు. సోమాలియా నుంచి మే 15 తెల్లవారుజామున ప్రయాణం ప్రారంభించిన ఈ పక్షి ప్రస్తుతం అరేబియా సముద్రాన్ని దాటుతోందని పేర్కొన్నారు. అనుకూలమైన గాలులు వీచడంతో ఈ సముద్ర ప్రయాణాన్ని మూడు రోజుల్లో నిర్వీరామంగా పూర్తి చేసే అవకాశం ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అలాంగ్‌తో పాటు ట్యాగ్‌ చేసిన మగ పక్షి అపాపాంగ్‌ గతంలో సోమాలియా నుంచి మధ్య భారత్ వరకు 4,750 కి.మీ దూరాన్ని కేవలం 95 గంటల్లో నాన్‌స్టాప్‌గా పూర్తి చేసింది.

అమూర్‌ ఫాల్కన్‌ విశేషాలు
పక్షి, జీవశాస్ర్త వేత్తల కథనాల ప్రకారం..అమూర్‌ ఫాల్కన్‌ అనేవి ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన దీర్ఘదూర వలస పక్షుల్లో ఒకటి. ఇది కేవలం 150 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. ప్రతి సంవత్సరం సైబీరియా, మంగోలియా, ఉత్తర చైనా ప్రాంతాల్లోని సంతానోత్పత్తి ప్రాంతాల నుంచి దక్షిణాఫ్రికా వరకు దాదాపు 29,000 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ఇది భూమి చుట్టుకొలతలో దాదాపు మూడు- వంతుల దూరంతో సమానం. అంతేకాదు, ఈ ప్రయాణాన్ని ఏడాదికి రెండుసార్లు పూర్తి చేస్తాయి. ఈ పక్షులకు శరీరంలో కొవ్వు నిల్వ చేసుకునే శక్తి ఉంటుంది. ఈ కొవ్వునే సముద్ర ప్రయాణంలో ఇంధనంగా వినియోగించుకుంటాయి. సముద్ర ప్రయాణానికి ముందు అమూర్‌ ఫాల్కన్లు మణిపుర్‌లోని తమేంగ్‌లాంగ్‌ ప్రాంతంలో పెద్ద ఎత్తున గుంపులుగా చేరుతాయి. అక్కడ లక్షకుపైగా పక్షులు చెదపురుగులను విపరీతంగా తింటాయి. దీనినే హైపర్‌ఫాజియా అంటారు. దీంతో వాటి బరువు 150 గ్రాముల నుంచి దాదాపు 280 గ్రాములకు దాదాపు రెట్టింపు అవుతుంది. ఈ కొవ్వే వాటికి సముద్ర ప్రయాణంలో ఇంధనంగా పనిచేస్తుంది. సాధారణంగా పక్షులు గాలిలో వేడి ప్రవాహాలను ఉపయోగించి తక్కువ శక్తితో ఎగురుతాయి. కానీ సముద్రంపై అలాంటి గాలి ప్రవాహాలు ఉండవు. అందువల్ల అమూర్ ఫాల్కన్లు రోజుల తరబడి రెక్కలు ఆడిస్తూ ఎగరాల్సి ఉంటుంది. ఈ సమయంలో శరీరంలోని కొవ్వును శక్తి, నీటి అవసరాలకు ఉపయోగించుకుంటాయి.

​దారిని ఎలా గుర్తిస్తాయి?
ఈ పక్షులు భూమి అయస్కాంత క్షేత్రం, సూర్యుడు, నక్షత్రాల స్థానాలను ఆధారంగా చేసుకుని దిశను గుర్తిస్తాయి. అలాగే గాలుల దిశ కూడా కీలక పాత్ర పోషిస్తుంది సోమాలియా ప్రాంతం నుంచి వీచే సోమాలి జెట్‌ అనే శక్తిమంతమైన సీజనల్‌ గాలిని ఉపయోగించుకునేలా తమ ప్రయాణాన్ని సమయానుకూలంగా ప్రారంభిస్తాయి. భూమికి 1,000 నుంచి 3,000 మీటర్ల ఎత్తులో వీచే ఈ గాలి వాటికి వెనుక నుంచి గాలిని అందిస్తూ, శక్తి వినియోగాన్ని తగ్గిస్తుంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్