“సినిమా ఇండస్ట్రీ, క్రాఫ్ట్స్‌తో పాటు పలు విభాగాల సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉంది. ప్రస్తుతం పరిశ్రమ పలు సవాళ్లను ఎదుర్కొంటున్న మాట నిజమే. ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గింది. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. ప్రేక్షకులను ఆకట్టుకునేలా వైవిధ్యమైన కథలతో మంచి సినిమాలు రావాల్సిన అవసరం ఉంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా నాణ్యమైన చిత్రాలు వస్తే ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు వస్తారు. ఆ దిశగా మా కొత్త పాలకమండలి పనిచేస్తుంది” అని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSFTVTDC) చైర్మన్ భరత్ భూషణ్ అన్నారు. “సినీ పరిశ్రమ అభివృద్ధే మా ప్రధాన లక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సహకారంతో పరిశ్రమకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తాం. నిలిచిపోయిన నంది అవార్డులను మళ్లీ ప్రారంభించే అంశంపై ప్రభుత్వంతో చర్చిస్తాం. గతంలో తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా టికెట్ ధరలు, జీఎస్టీ వంటి సమస్యల పరిష్కారంలో పనిచేసిన అనుభవాన్ని ఇప్పుడు కూడా వినియోగిస్తా” అని పేర్కొన్నారు.
APSFTVTDC నూతన చైర్మన్‌గా భరత్ భూషణ్, వైస్ చైర్మన్‌గా చిక్కాల మెహర్ రమేష్ కుమార్‌తో పాటు పలువురు డైరెక్టర్లు ఆదివారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ ఐఏఎస్, జనరల్ మేనేజర్ శ్రీనివాస నాయక్, మేనేజర్ చల్లా శ్రీనివాసరావు తదితరులు నూతన కార్యవర్గాన్ని అభినందించారు. తొలుత బాలకృష్ణ పాలకమండలితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు.
అభివృద్ధికి అపార అవకాశాలు : బాలకృష్ణ
“ఆంధ్రప్రదేశ్‌లో సినిమా షూటింగ్‌కు అనువైన అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయి. చిత్రీకరణలకు అవసరమైన అనుమతులు సింగిల్ విండో విధానంలో అందిస్తాం. ప్రస్తుతం సినిమాను నిలబెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి మారాలంటే ఎక్కువ సంఖ్యలో మంచి సినిమాలు రావాలి. నేను వ్యక్తిగతంగా సందేశాత్మక చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నా.. ఏపీలో కూడా తెలుగు సినిమా షూటింగ్‌లు జరిగేలా ప్రోత్సహిస్తాం. నంది అవార్డులు, నంది నాటకోత్సవాలను త్వరలోనే నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం” అని సినీనటుడు నందమూరి బాలకృష్ణ చెప్పారు.
సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తా ...
25 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 25, 2026, 11:34 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)