mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

యోగతో శారీరక, మానసిక ఆరోగ్యం సాధ్యం: కలెక్టర్ నిశాంత్ కుమార్

11 జూన్, 2026

yoga
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 11, 2026, 11:13 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్‌లో ‘యోగాంధ్ర-2026’ జిల్లా స్థాయి వేడుకలు

  • ఆహ్లాదకరమైన వాతావరణంలో యోగా సాధన.. వందలాదిగా తరలివచ్చిన అభ్యాసకులు

ప్రజాశక్తి – బి.కొత్తకోట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర-2026’ కార్యక్రమంలో భాగంగా.. ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీ హిల్స్‌లో జిల్లా స్థాయి యోగా వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది అభ్యాసకులు పాల్గొని ఆహ్లాదకర వాతావరణంలో యోగా సాధన చేశారు. ఈ వేడుకల ప్రారంభ సూచికగా నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం, ప్రముఖ యోగా శిక్షకులు డాక్టర్ పాల్ బ్రహ్మకుమార్ పర్యవేక్షణలో హాజరైన వారందరూ దాదాపు గంట పాటు వివిధ రకాల యోగాసనాలు, ప్రాణాయామం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ.. యోగా అనేది భారతదేశం ప్రపంచానికి అందించిన ఒక గొప్ప అమూల్యమైన జీవన విధానమని కొనియాడారు. నిత్యం యోగా సాధన చేయడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని వివరించారు. ప్రస్తుత ఒత్తిడితో కూడిన వేగవంతమైన జీవనశైలిలో ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో కొంత సమయాన్ని యోగాకు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు, యువత, ఉద్యోగులు, మహిళలు యోగాను ఒక అలవాటుగా మార్చుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడవచ్చని ఆయన పిలుపునిచ్చారు. ‘యోగాంధ్ర–2026’ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరిన కలెక్టర్.. ఈనెల 14న ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బోయకొండలో జరిగే యోగా కార్యక్రమానికి, అలాగే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే వేడుకలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ వినూత్న కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో చంద్రశేఖర్ రెడ్డి, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టరు డాక్టర్ రమణప్రసాద్, జిల్లా పర్యాటక అధికారి నాగభూషణం, సమాచార శాఖ ఏడీ పురుషోత్తం, ఏపీటీడీసీ ప్రతినిధి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్