DRISHYAM
గురువారం, 10 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆర్టిసి సమ్మె ఎఫెక్ట్ – మహిళలు కొనాల్సిందే టిక్కెట్ ..!

22 ఏప్రిల్, 2026

telangana rtc

tg rtc strike

వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఏప్రి 22, 2026, 04:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు ఫలించకపోవడంతో, రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ఉధృత రూపం దాల్చింది. మంగళవారం అర్ధరాత్రి నుంచే కార్మికులు సమ్మెకు దిగడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, బీహెచ్‌ఈఎల్ వంటి కీలక డిపోలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన కేంద్రాల్లో ఉద్యోగులు విధులను బహిష్కరించి నిరసనలు చేపట్టారు. బస్సులు డిపోల నుంచి బయటకు రాకుండా కార్మికులు అడ్డుకోవడంతో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ కుప్పకూలింది. సమ్మె నేపథ్యంలో …. పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని ఆర్టీసీ డిపోల వద్ద పోలీసులకు, కార్మికులకు మధ్య ఘర్షణలు జరిగాయి. సంగారెడ్డిలో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పోలీసుల పహారాలో బస్సులను నడపడానికి ప్రయత్నించగా, కార్మికులు వాటిని తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ క్రమంలో పటాన్‌చెరు వద్ద నిరసనకారులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. భారీ భద్రత నడుమ కొన్ని బస్సులను రోడ్లపైకి తెచ్చినప్పటికీ, కార్మికుల ఆందోళనల వల్ల పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి రాలేదు. ఈ క్రమంలో …. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అద్దె బస్సులు.. ప్రైవేట్‌ డ్రైవర్లు, కండక్టర్లతో పోలీసు ఎస్కార్ట్‌ వాహనాల నడుమ రోడ్డెక్కాయి. అయితే …. ఆ బస్సులు ఎక్కిన మహిళలకు పెద్ద షాకే తగులుతోంది. సమ్మె నేపథ్యంలో ఈ బస్సులలో ఉచిత ప్రయాణం కుదరదని.. టికెట్‌ తీసుకోవాల్సిందేనని కండక్టర్లు పట్టుబడుతున్నారు. దీంతో ఆధార్‌ కార్డు చేతబట్టిన మహిళలకు నోట మాట రావడం లేదు. కొన్ని రూట్లలో జరుగుతున్న ఈ పరిణామాలపై ఆర్టీసీ స్పందించాల్సి ఉంది. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువు దీరినప్పటి నుంచి మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్