ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద బుట్టల అల్లిక కార్మికుడు ఉండేవాడు. అతనికి ఒక చిన్న గుడిసె, దాని పక్కనే ఉన్న పెద్ద జామచెట్టే సర్వస్వం. ఆ చెట్టు ప్రతి సీజన్‌లో ఎంతో తియ్యని జామపండ్లను కాసేది. ఆ ఊరి పిల్లలందరికీ రామయ్య జామపండ్లంటే ఎంతో ఇష్టం. రామయ్య కూడా వారందరికీ ప్రేమగా పండ్లు కోసి ఇచ్చేవాడు. రామయ్య గుడిసె పక్కనే జగన్నాథం అనే ధనవంతుడైన భూస్వామి బంగళా ఉండేది. రామయ్య పేదరికమూ, అతని గుడిసె పక్కనే అంత పెద్ద జామచెట్టు ఉండటమూ జగన్నాథానికి అస్సలు నచ్చేవి కావు. ఎలాగైనా ఆ చెట్టును కొట్టేయించాలని అతడు అవకాశం కోసం ఎదురుచూస్తుండేవాడు. ఏపుగా పెరిగిన జామచెట్టు కొమ్మలు జగన్నాథం ఇంటి ఆవరణ వైపుకు వంగాయి. చెట్టు నుంచి రాలే ఎండిన ఆకులు రోజూ అతని ఇంటి మేడమీద, ముంగిట్లో పడసాగాయి. దీనినే సాకుగా చేసుకుని జగన్నాథం రామయ్యను ఊరి పంచాయితీకి లాగాడు.
“ఈ రామయ్య చెట్టు ఆకులు రోజూ నా ఇంటి నిండా పడి అపరిశుభ్రం చేస్తున్నాయి. వాటిని ఊడ్చించడానికి అయ్యే ఖర్చంతా రామయ్యే భరించాలి. లేదంటే ఆ చెట్టును కొట్టేయించాలి” అని జగన్నాథం డిమాండ్ చేశాడు. జగన్నాథానికి భయపడి పంచాయితీ పెద్దలెవరూ రామయ్యకు మద్దతుగా మాట్లాడలేదు. రామయ్య ప్రతి నెలా కొంత డబ్బు చెల్లించాలని తీర్పు చెప్పారు.
రామయ్య మాత్రం ప్రశాంతంగా తలవంచి, “పెద్దల తీర్పును శిరసావహిస్తాను. అయితే చెట్టు నుంచి ఎండుటాకులు పడుతున్నట్లే, రోజూ ఎన్నో దోర జామపండ్లు కూడా వారి ఇంట్లోనే పడుతున్నాయి. ఆ పండ్లను భూస్వామి గారి పిల్లలు, వారి ఇంటికి వచ్చే బంధువులు ఎంతో ఇష్టంగా తింటున్నారు. పంచాయితీ నిబంధనల ప్రకారం సరిహద్దు దాటి అవతలి వైపు పడిన ప్రతిదానికీ లెక్క కట్టాల్సి వస్తే, నా జామపండ్ల మార్కెట్ ధరను కూడా భూస్వామి గారు నాకు చెల్లించాలి” అని చెప్పాడు.
రామయ్య మాటల్లోని న్యాయాన్ని పెద్దలు వెంటనే గ్రహించారు.
“జగన్నాథం గారూ! రామయ్య చెప్పింది నూటికి నూరు పాళ్లు నిజం. అతను ఆకుల ఖర్చు ఇస్తే, మీరు పండ్ల ఖర్చు ఇవ్వాలి. మరి లెక్కలు కడదామా?” అని అడిగారు.
జగన్నాథం ముఖం ఒక్కసారిగా తెల్లబోయింది. ఆ లెక్కలు నిజంగా కడితే, తనే రామయ్యకు ప్రతి నెలా డబ్బు చెల్లించాల్సి వస్తుందని అతనికి అర్థమైంది. అందరి ముందు పరువు పోతుందని భావించి, “వద్దు… వద్దు… ఎలాంటి లెక్కలు అవసరం లేదు. రామయ్య నాకు కూలీ డబ్బులు ఇవ్వనవసరం లేదు. నేను కూడా పండ్ల డబ్బులు ఇవ్వనవసరం లేదు. రామయ్య! నన్ను క్షమించు. నీ చెట్టు నీ దగ్గరే ఉంటుంది. నా ఇంటి ఆవరణను నేనే శుభ్రం చేయించుకుంటాను” అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
– ధనలక్ష్మి,
బెంగళూరు, 81237 72783








కామెంట్‌లు (0)