‘పిల్లలు ఏం చేయగలరు!’ అంటే ‘అద్భుతాలు చేయగలరు!’ అని చాలామంది చెబుతారు. ఆ నమ్మకం ఇప్పుడు మరోసారి రుజువైంది. తెలంగాణ థూలిమిట్ట మండలం హనుమ తండాకు చెందిన 9 ఏళ్ల విహాన్ పర్వతారోహకుడిగా, జార్ఖండ్ లోని రాంచీకి చెందిన 7 ఏళ్ల ఇషాంక్ స్విమ్మింగ్ లో అద్భుత ప్రతిభ చూపుతున్నారు. ఈ చిన్నారులు సాధించిన విజయాలు ఇప్పుడు వాళ్ల పేర్ల మీద ప్రపంచ రికార్డులను కూడా నమోదు చేశాయి.
విహాన్ తండ్రి తిరుపతి నాయక్ తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్నారు. వృత్తిరీత్యా తండ్రి మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా పనిచేస్తుంటే కొడుకు కూడా ఆ మార్గంలోనే అడుగులు వేస్తున్నాడు. అయితే విహాన్ ఆ సందేశాన్ని ఖండాంతరాలు దాటిస్తున్నాడు.
పర్వతారోహకుడిగా …
ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా లోని ఎత్తైన పర్వతశిఖరాలు అధిరోహించి ‘సే నో టు డ్రగ్స్` అన్న ప్లకార్డుల ద్వారా డ్రగ్ రహిత ప్రపంచానికి విహాన్ బాటలు వేస్తున్నాడు. తాజాగా మే 2న ఆస్ట్రేలియాలోని అత్యున్నత పర్వత శిఖరమైన కోస్సియుస్కో(7310 అడుగులు)ను అధిరోహించాడు. ఈ విజయంతో పర్వతారోహకుడిగా తన ప్రయాణంలో విహాన్ మూడో మైలురాయిని సాధించినట్లైంది.
ఇప్పటికే విహాన్ పేరు మీద ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డు’, ‘ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు’లు ఉన్నాయి. 2024లో ఆఫ్రికాలోని కిలిమంజారో (5685 అడుగులు), హిమాచల్ ప్రదేశ్ మనాలీ లోని పథల్సు (4250 అడుగులు) పర్వతాలను అధిరోహించినప్పుడు ఈ రికార్టుల్లోకెక్కాడు.
వ్యసనాలకు బానిసలై యువత తమ జీవితాలను నాశనం చేసుకోకుండా ఆరోగ్యం, ఆటల వైపు దృష్టి పెట్టాలని విహాన్ ఈ ప్రపంచానికి చెబుతున్నాడు. సమాజ హితం కోసం ఇంత చిన్నవయసులో పాటుపడుతున్న విహాన్ గురించి తెలుసుకున్న వాళ్లంతా తనని ఎంతగానో ప్రశంసిస్తున్నారు.

అలలపై ఇషాంక్ ప్రయాణం
జార్ఖండ్ రాంచీలోని ధుర్వా ఇషాంక్ స్వస్థలం. ఏడేళ్ల ఈ బుడతడు ఏప్రిల్ 30న శ్రీలంక, ఇండియా మధ్య ఉన్న 29 కిలోమీటర్ల దూరం గల పాక్ జలసంధిని ఈదాడు. తలైమన్నార్ నుండి ధనుష్కోటి వరకు గల ఈ ప్రాంతాన్ని ఇషాంక్ 9 గంటల 50 నిమిషాల సమయంలో ఈది ఈ రికార్డు సాధించిన అతి పిన్నవయస్కుడిగా చర్రితలో తన పేరు లిఖించుకున్నాడు.
ఈ విజయం సాధించడం ఆషామాషీ కాదు. దీని కోసం ఇషాంక్ శక్తి వంచన లేకుండా శ్రమపడ్డాడు. రోజుకు 4 నుండి 5 గంటలు శిక్షణ తీసుకునేవాడు. కఠిన క్రమశిక్షణ ఉంటేనే ఇది సాధ్యం. బాల్యం నుండే ఇషాంక్ దాన్ని ఒంటబట్టించుకున్నాడు. తన సాహసానికి గుర్తింపుగా యూనివర్శల్ రికార్డు ఫోరమ్ పాక్ జలసంధిని ఈదిన అతి పిన్న వయస్కుడిగా ఇషాంక్ పేరు మీద సర్టిఫికెట్ ను అందించింది.
రాంచీలోని ధుర్వ డామ్ లో కోచ్ లు అమన్ కుమార్, భజరంగ్ కుమార్ ల తర్ఫీదులో ఇషాంక్ ఈత శిక్షణ కొనసాగిస్తున్నాడు. మూడో తరగతి చదువుతున్న ఇషాంక్ ఈ ఘనత సాధించడంతోనే స్కూలు యాజమాన్యం కూడా తాజాగా వేడుకలు చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్కూలు ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ‘ఈ విజయం రాంచీకే కాదు, దేశానికే గర్వకారణం’ అంటున్నారు. ఇషాంక్ గురించి తెలుసుకున్న తరువాత ఇంత చిన్న వయసులో సముద్రంలో అంత దూరం ఈత కొట్టడం వెనుక తను కనబర్చిన సామర్థ్యాన్ని ఎంతోమంది కొనియాడుతున్నారు.








కామెంట్‌లు (0)