పుట్టిన రోజున నిర్మల
స్నేహితులను పిలిచింది
తియ్యని విందు ఇచ్చింది
తీపి మిఠాయి పంచింది
వచ్చిన ఆ మిత్రులంతా
చక్కని మొక్కలు తెచ్చారు
బహుమతిగా ఇచ్చారు
అభినందనలు తెలిపారు
స్నేహితులతో నిర్మల
పెరట్లోకి నడిచింది
ఒక చోటును చూపింది
మొక్కలు నాటించింది
ప్రతి ఒక్కరు వారి పేరు
నాటిన మొక్కకు పెట్టారు
చల్లని నీరు పోశారు
చుట్టూ గొప్పును తవ్వారు
ప్రతి రోజు మొక్కలకు
నిర్మల నీరు పోసింది
పేరు పేరునా పిలిచింది
పెంచి పెద్దగా చేసింది
మొక్కలేమో ఎదిగాయి
కొమ్మలెన్నో వేశాయి
ప్రతి కొమ్మన మొగ్గలేసి
పువ్వులు విరబూశాయి
స్నేహితులను రమ్మంది
మొక్కలను చూపింది
పువ్వులన్నీ కోసింది
మంచి మాల కట్టింది
రేఖ, రాణి, పుష్ప అంటూ
కళ్ళకు మాలను అద్దుకుంటూ
అంతా కలసి ఆ దండను
బుద్ధుని బొమ్మకు వేశారు
బుద్ధం శరణం గచ్ఛామి
అంటూ ప్రార్థన చేశారు
మౌనంగా మనసులోనే
ఆ దేవుని పూజించారు
పుట్టిన రోజుకు మొక్కను ఇచ్చే
కొత్త సంస్కృతిని తెచ్చారు
పర్యావరణమే రక్షణ అంటూ
అంతా ప్రతిజ్ఞ చేసారు!
- కూచిమంచి నాగేంద్ర,
91821 27880.









కామెంట్‌లు (0)