ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక వాతావరణ హెచ్చరిక జారీ చేసింది.విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పరిస్థితుల తీవ్రత దృష్ట్యా ఈ మూడు జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ ప్రకటించింది. అరకు, గజపతినగరం, విజయనగరం, ఎస్.కోట, కొత్తవలస, చోడవరం, నర్సీపట్నం, మాడుగుల మండలాల పరిసర ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. అలాగే వర్షంతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపారు.
మరోవైపు తూర్పుగోదావరి, కాకినాడ, విశాఖపట్నం జిల్లాలకు విపత్తుల నిర్వహణ సంస్థ ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించింది. ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని ఏపీఎస్‌డీఎంఏ సూచించింది.








కామెంట్‌లు (0)