ప్రజాశక్తి- విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవలే ఎస్ఎంఎస్-1 (SMS-1) సీసీడీ విభాగంలో జరిగిన భారీ ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు మరణించిన విషాద ఘటన మరవకముందే.. గత రెండు రోజులుగా ఇక్కడ వరుసగా ప్రమాదాలు చోటుచేసుకోవడం ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. నిన్న ఎస్ఎంఎస్-2 విభాగంలో ల్యాడిల్ నుండి ఉక్కు ద్రవం కిందపడి నేలపాలైన ఘటన జరగ్గా.. తాజాగా ఈరోజు ఉదయం ఎస్ఎంఎస్-1 టిపిబే (TP Bay) విభాగంలో మరో ప్రమాదం సంభవించింది. గురువారం ఉదయం ‘ఎ’ షిఫ్ట్ ప్రారంభమైన కొద్దిసేపటికే, సుమారు 6:30 గంటల ప్రాంతంలో ల్యాడిల్కు రంధ్రం పడటంతో వేడి స్టీల్ మెటల్ ద్రవం భారీగా నేలపాలైంది. ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం నియమించిన త్రీమెన్ కమిటీ ప్రస్తుతం విచారణ జరుపుతుండగానే, మళ్లీ ఇలా వరుసగా రెండు రోజులు ప్రమాదాలు చోటుచేసుకోవడం గమనార్హం. ఈ వరుస ఘటనలతో ఉక్కు ఉద్యోగులు, కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అయితే, అదృష్టవశాత్తూ గత రెండు రోజులుగా జరిగిన ప్రమాదాల్లో ఉద్యోగులెవరికీ ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు కాకపోవడంతో యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. ప్లాంట్లో భద్రతా ప్రమాణాలపై కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ మరో ప్రమాదం.. లీకైన ఉక్కు ద్రవం
11 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 11, 2026, 10:42 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)