అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ప్రస్తుతం చురుగ్గా కదులుతున్నాయి. ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఓ ఉపరితల ఆవర్తనం, అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోంది. వీటన్నింటి ప్రభావంతో ఈ వీకెండ్ (జూన్ 13, 14 శని, ఆదివారం) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
నేడు తెలంగాణలో భారీ వర్షాలు …
ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల్లోనూ అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. ఈ రెండ్రోజులు (శని, ఆదివారం) కూడా జోరువానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. శుక్రవారం రాత్రి నుండి పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి… ఇవాళ (శనివారం) ఉదయం కూడా ఈ వర్షబీభత్సం కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు వాతావరణ నిపుణులు.
ఈ తెలంగాణ జిల్లాలకు హైఅలర్ట్..
ఇవాళ (జూన్ 13, శనివారం) భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్,వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో కూడా చెదురుమదురు జల్లులు ఉంటాయని హెచ్చరించింది.
నేడు ఎపిలోనూ వర్ష బీభత్సమే …
దక్షిణ కోస్తాంధ్ర, పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఎపి విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో శనివారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని… ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు.









కామెంట్‌లు (0)