test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అర్ధరాత్రి ఈడుపుగంటి ఇంటి వద్ద ఎమ్మెల్యే చింతమనేని నిరసన

5 గంటల క్రితం

tdp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 15, 2026, 11:53 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి – ఏలూరు సిటీ: ఏలూరు నగరంలో ఆదివారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రముఖ న్యాయవాది, టిడిపి లీగల్ సెల్ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈడుపుగంటి శ్రీనివాసరావు నివాసాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో కలిసి ముట్టడించారు. ఏలూరులోని అశోక్‌నగర్‌లో ఉన్న శ్రీనివాసరావు ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే అనుచరులు, పార్టీ కార్యకర్తలు చేరుకోవడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఈడుపుగంటి శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించి.. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో మట్టి తవ్వకాలతో పాటు పలు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అయితే, శ్రీనివాసరావు తన కుటుంబ సభ్యులను సైతం దుర్భాషలాడుతూ వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావుపై చర్యలు తీసుకుని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇంటి వద్ద అర్ధరాత్రి నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం ఈడుపుగంటి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.

టిడిపి నుంచి ఈడుపుగంటి సస్పెన్షన్

ఇదిలా ఉండగా, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు గానూ ఈడుపుగంటి శ్రీనివాసరావును టిడిపి నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఏలూరు జిల్లాటిడిపి అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రకటించారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీకి సంబంధించిన అంశాలపై ఏవైనా సమస్యలు ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలే తప్ప, ఇలా స్వతంత్రంగా పత్రికా సమావేశాలు నిర్వహించవద్దని గతంలోనే శ్రీనివాసరావుకు సూచించామని తెలిపారు. అయినప్పటికీ ఆయన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో, పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశించినట్లు చెప్పారు. ఆ ఆదేశాల మేరకే ఈడుపుగంటి శ్రీనివాసరావును పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవుల నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు బడేటి చంటి స్పష్టం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్