test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతప్పెటగుళ్లును కాపాడుకుందాం..

28 మే, 2026

తప్పెటగుళ్లును కాపాడుకుందాం..
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 28, 2026, 09:58 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం


ప్రాచీన జానపద కళారూపాల్లో ”తప్పెటగుళ్లు” కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఏకకాలంలో వాయిద్యం, నృత్యం, పాట ప్రదర్శించడం మాటలు కాదు. ఈ కళారూపం ఆరంభ కాలంలో-పశుపోషకులు, గొర్రెల కాపరులు రాత్రుళ్లు తమ జీవాల కాపలా నిమిత్తం మేలుకుని ఉండేందుకు పాడే పాటలతో మొదలైందంటారు. ఓ గుండ్రని పరికరానికి పశువుల చర్మం గట్టిగా బిగించి.. వాయించేవారు. తర్వాత్తర్వాత రేకు తప్పెట, మరింత అనువైన పరికరాన్ని సమకూర్చుకున్నారు. కాలక్రమేణా కాళ్లకు గజ్జెలు.. షార్ట్‌ (నిక్కరు)కు పెద్ద పెద్ద మువ్వలు.. ఊలు కుట్టించుకోవడం.. ఊలు దండ.. మొత్తంగా ఆహార్యం కూడా ఆకర్షణీయంగా పెంచుకున్నారు. ప్రత్యేక క్లాత్‌ తో షార్ట్‌ కు పెద్ద ఇత్తడి మువ్వలు.. (ఒక్కోటి రూ. 60.. కిలోకు నాలుగు.. ఐదు తూగుతాయి)- కుట్టించుకుని.. అలాగే వరసకు ఇరవై చొప్పున ఐదు వరసల చిన్న గజ్జెలు రెండు కాళ్లకూ (రూ. 1,200).. మొత్తం వెరసి సుమారు ఎనిమిది కిలోలకు తగ్గని బరువుతో- గుండెల మీద కట్టుకున్న తప్పెట గుండుపై దరువేస్తూ.. పాడుతూ.. గెంతడం.. ఎగరడం.. ఇదంతా ఏకకాలంలో ప్రదర్శనలివ్వడం మాటలా..! లయబద్ధంగా.. యమ స్పీడుతో చేస్తుంటే వీక్షకులకూ ఎక్కడలేని ఊపొస్తుంది.. తొలి రోజుల్లో పంచె, జుబ్బా మాత్రమే ఆహార్యం. తరాలు మారుతున్నకొద్దీ యువత మరింత శ్రద్ధతో.. ఖర్చు కూడా భరిస్తూ.. ప్రదర్శనలు ఆకర్షణీయంగా ఇస్తున్నారు. తొలినాళ్లలో.. ప్రధానంగా యాదవులే కష్ణుడు సంబరాల్లో ఈ కళారూపం ప్రదర్శించేవారు. ఇప్పడు ఇతరులూ గణనీయంగానే- రాముడు, సింహాద్రి అప్పన్న తదితర సంబరాల్లో కూడా ఈ ప్రదర్శనలిస్తున్నారు. వీటినే కోల సంబరాలు అంటారు. ఎక్కువ కాలం దైవ సంబంధ పాటలతోనే ప్రదర్శనలిచ్చినా రానురానూ చారిత్రక, జానపద, అభ్యుదయ సామాజికాంశాల సాహిత్యం కూడా జోడించుకున్నారు. ఈ కళారూపానికి మొదట్లో ప్రత్యేక సాహిత్యమంటూ రాతపూర్వకంగా.. రికార్డెడ్‌ గా లేదు. పెద్దల నుంచి తర్వాత తరం వారికీ.. వారి నుండి తర్వాత వారికీ అలా అలా ఆనవాయితీగా రావడమే. కాలక్రమేణా కొందరు కళాకారులు పాటలు రాసుకుంటున్నారు.. రాయించుకుంటున్నారు. ”నా చమట చుక్కో..”, ”శ్రమ నుండి పుట్టింది పాట..”, ”మన ఊరు మారిందని సరదా పడదామా..”, ”ఆలకించండిరా రింగు టోను బలే సౌకర్యమున్న సెల్‌ ఫోను…” ఇత్యాది పాటలను తమ ప్రదర్శనల్లో ఇమిడ్చుకున్నామని ప్రజానాట్యమండలి శ్రీకాకుళం జిల్లా కళాకారులు వివరించారు. అయితే తాము సహా ఇంకా చాలా బృందాలు సందర్భానికి తగిన పాటలు ఎంచుకుంటామన్నారు. చారిత్రక పాటల్లో ముఖ్యంగా కాటమరాజు కథ చెబుతూ గంగాదేవిని పూజిస్తారు. దీన్ని ”గావు సంబరం” అంటారు. ఇందులో ప్రధానంగా యువకులే కొనసాగుతున్నారు. కొన్ని పరిమితుల వల్ల కాబోలు మహిళలు అంతగా ముందుకు రావడం లేదు.. వచ్చినా కొద్దికాలమే కొనసాగుతున్నారు. (ఆమధ్య ”శ్రీదేవి డ్రామా కంపెనీ” ప్రోగ్రాములో ఈ తప్పెటగుళ్లు ప్రదర్శనలో మహిళ పాల్గొన్నారు. ఆ ప్రదర్శనను తిలకించిన సీనియర్‌ సినీనటి.. కార్యక్రమ జడ్జ్‌- ఎంతో ఉత్తేజితురాలై.. అప్పటికప్పుడు తన వద్ద ఉన్న డబ్బంతా ఆ దళానికి బహూకరించారు.) దళానికి కనీసం 20 మంది చొప్పున- ఉత్తరాంధ్రలో సుమారు 300 దళాలున్నట్టు ఓ అంచనా. ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో ఎక్కువ. తొలినాళ్లలో ఈ కళాకారుల ప్రదర్శనలను విజయనగరం గజపతిరాజులు ఏర్పాటుచేసినట్టు చెబుతారు.


ఇంతటి ప్రాధాన్యమున్న.. ఈ అద్భుత కళారూపాన్ని కాపాడుకోవాల్సిన కర్తవ్యం అందరిదీ.. ముఖ్యంగా ప్రభుత్వానిది. ఈ కళారూపాన్ని ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించడం ఎంతైనా అవసరం. ఎంతో సాధన చేయాలి… మువ్వలు, గజ్జెలు, ప్రత్యేక షార్ట్‌.. ఇతర ఆహార్య ఏర్పాట్లు మొత్తం కలిసి ఖర్చు తడిసి మోపెడవుతుంది. సాయం అందించాలి. వీరికి పెన్షన్‌ సదుపాయమూ కల్పించాలి. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సి.ఐ.టి.యు. జాతీయ మహాసభను పురస్కరించుకుని నిర్వహించిన ”శ్రామిక ఉత్సవ్‌”లో ప్రదర్శించిన ప్రజానాట్యమండలి శ్రీకాకుళం జిల్లా తప్పెటగుళ్లు దళ సభ్యులు: కె.హేమసూదన్‌ (నాయకుడు), పి.శంకర్‌, ఎం.గణేష్‌, కె.బాలాజీ, ఎం.రమేష్‌, బి.అశోక్‌, కె.సాయి, ఐ.చిన్ని, బి.హరి, పి.రవి, కె.రాజు, పి.ప్రవీణ్‌, పి.నవీన్‌, టి.శరణ్‌, టి.పూర్ణచంద్రరావు, ఎ.రాజు, ఎ.రాఖీ, ఎల్‌.శరణ్‌.

– జి.వి.రంగారెడ్డి,
(సీనియర్‌ జర్నలిస్ట్‌)
99126 15747

సామాజికాంశాలతో..
ఈ తప్పెట గుళ్లు కళారూపం అంతరించిపోతుందేమోనని బెంగగా ఉంది. సమకాలీన సామాజికాంశాలను జోడిస్తే పది కాలాలు మనగలుగుతుంది. అలాంటి కృషి ఎవరుచేసినా అభినందనీయమే.

వై.అప్పారావు
-వై.అప్పారావు,
అన్నమయ్య జానపద కళాక్షత్రం,
ఉత్తరాంధ్ర జిల్లాల అధ్యక్షులు


ప్రభుత్వం శిక్షణ ఇప్పించాలి..
ప్రభుత్వం నిపుణులతో ఈ తరం వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించాలి. ఉత్సవాలు నిర్వహించాలి. గుర్తింపుకార్డులు, పెన్షన్‌ అందించాలి.

హేమసుదాన్
– హేమసూదన్‌
శ్రీకాకుళం జిల్లా.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్