అరకొర వైద్యం, పోషకాహార లోపమే కారణం
ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర నాయకులు కామేశ్వరరావు
ప్రజాశక్తి – కురుపాం : పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన విద్యార్థుల వరుస మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర నాయకులు టి. కామేశ్వరరావు, జనవిజ్ఞాన వేదిక ఆరోగ్య విభాగం కో కన్వీనర్ డాక్టర్ ఎం. రమేష్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజా ఆరోగ్యవేదిక, జనవిజ్ఞన వేదిక, యుటిఎఫ్ నేతలు, పలువురు సభ్యులతో కూడిన పరిశీలన బృందం విశ్వనాథపురం గ్రామంలో పర్యటించింది. గిరిజన విద్యార్థుల మరణాలపై స్థానిక ప్రజలు, తల్లిదండ్రులు, గిరిజన సంఘాల నాయకుల నుంచి బృందం సమాచారం సేకరించింది. సమయానికి వైద్య సేవలు అందకపోవడం, పోషకాహార లోపం, ఆశ్రమ పాఠశాలల్లో సరైన ఆరోగ్య పర్యవేక్షణ లేకపోవడం వంటి సమస్యలతో విద్యార్థులు చనిపోయినట్లు వారు పేర్కొన్నారు. ఏప్రిల్ లో మర్రిమానుగూడకు చెందిన బిడ్డిక రాహుల్, విశ్వనాథపురానికి చెందిన దుడ్డుకల్లు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థి గుమ్మడాల అఖిల్, మే ఎనిమిదిన పాములుగీశాడ గ్రామానికి చెందిన అసిరయ్య, మే 17న మూలిగూడ గ్రామానికి చెందిన సుస్మిత మృతి చెందారని తెలిపారు. ఈ మరణాలకు కచ్చితమైన కారణాలు, అధికారిక వైద్య, పోస్టుమార్టం నివేదికలు, జిల్లా వైద్యశాఖ ప్రకటనల ద్వారానే నిర్ధారణ కావాలని బృంద సభ్యులు తెలిపారు. ఆశ్రమ పాఠశాలల్లో నిరంతర ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం, మలేరియా,డెంగీ పరీక్షలు వేగవంతం చేయడం, తక్షణ అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంచడం, పోషకాహార పథకాలను బలోపేతం చేయడం, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక పర్యవేక్షించడం వంటి చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. పార్వతీపురం పట్టణంలో నిర్మాణం నత్తనడకన సాగుతున్న జిల్లా ఆస్పత్రి పనులను వేగవంతం చేయాలని, గిరిజన మండలాల్లో మొబైల్ ఆస్పత్రులు నడపాలని, గిరిజన హాస్టళ్లలో నిర్మాణం పూర్తికాని భవనాలను కొత్త విద్యాసంవత్సరానికి ముందే పూర్తి చేయాలని కోరారు. మూఢనమ్మకాల నిర్మూలనపై ప్రభుత్వం, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జనవిజ్ఞాన వేదిక విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ పి.లక్ష్మణస్వామి కోరారు. ఈ బృందంలో కామేశ్వరరావు, రమేష్‌కుమార్, యుటిఎఫ్ నాయకులు కూర్మారావు, జనవిజ్ఞాన వేదిక విశాఖ జిల్లా నాయకులు ప్రసాద్, డాక్టర్ లక్ష్మణస్వామి పాలూరు, ప్రతినిధులు బాలు, నాని తదితరులు ఉన్నారు.








కామెంట్‌లు (0)