test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జులై 13, 14, 15న విశాఖలో ఎస్ఎఫ్ఐ జాతీయ సమావేశాలు

04 జూన్, 2026

sfi.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 04, 2026, 12:14 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి – కలెక్టరేట్ (విశాఖపట్నం) : ఎస్ఎఫ్ఐ జాతీయ సమావేశాలు జులై 13, 14, 15న విశాఖపట్నంలో జరగనున్నాయని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.రామ్మోహన్, కె.ప్రసన్నకుమార్ ప్రకటించారు. గురువారం జగదాంబ దరి నండూరి ప్రసాదరావు భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాతీయ సమావేశాల లోగోతో కూడిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నగరంలోని డాబా గార్డెన్స్ వద్ద గల అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జాతీయ మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్య, ఉపాధి, భవిష్యత్తు అంశాలపై దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమానికి దిశానిర్దేశం చేయనున్న ఈ జాతీయ సమావేశాలకు వివిధ రాష్ట్రాలకు చెందిన 400 మంది ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, ప్రతినిధులు హాజరుకానున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ నిర్వహణలో పూర్తిగా విఫలమైందని, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఎన్ టి ఎను రద్దు చేయాలని, నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సిబిఎస్ఇ మూల్యాంకనంలో అవకతవకులపై సమగ్ర విచారణ జరపాలన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పన్నెండేళ్లలో 89 సార్లు పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయని గుర్తుచేశారు. విద్యా రంగంలో మతోన్మాదాన్ని జొప్పించడం, మొత్తం విద్యను కార్పొరేటీకరణ చేయడం దారుణమన్నారు. రాష్ట్రాల హక్కులను హరించి కేంద్రం విద్యారంగాన్ని తన చేతుల్లోకి లాక్కుంటోందన్నారు. రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వమూ విద్యారంగ నిర్వహణలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. యుద్ధం నెపంతో విద్యార్థులకు ఇవ్వవలసిన కిట్లను ఇప్పట్లో పంపిణీ చేయబోమని చెప్పడం దుర్మార్గమన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యాలయాల్లో లక్ష మంది విద్యార్థులు తగ్గడం ఆందోళనకరమన్నారు. సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. లక్షలాది మంది యువత డిగ్రీలు చేతిలో పట్టుకొని నిరుద్యోగులుగా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటిపైనా జాతీయ సమావేశాల్లో చర్చిస్తామన్నారు. ఈ సమావేశాల జయప్రదానికి అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.సాయితేజ, జి.అజయ్, జిల్లా కమిటీ సభ్యులు అఖిల్, ప్రగతి, తరుణ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్