866 ఎకరాల భూసేకరణపై నిలదీత
ట్రాన్స్ ఫార్మర్ కంపెనీ పనుల అడ్డగింత
ప్రజాశక్తి-కడప ప్రతినిధి : కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామికవాడలో ట్రాన్స్ ఫార్మర్ల తయారీ పరిశ్రమకు కేటాయించిన భూములకు పరిహారం చెల్లించకుండా పనులు చేపట్టడం వివాదానికి దారితీసింది. రైతుల నుంచి సేకరించిన ప్రొహిబిషన్ ఆన్ ట్రాన్స్ ఫర్ (పిఒటి) భూములకు పరిహారం ఇవ్వకుండా సుమారు 20 రోజుల క్రితం ముళ్ల కంపలను తొలిగించి పనులు చేపట్టింది. మట్టి రహదారులను సైతం ఏర్పాటు చేసింది. విశాఖపట్నం పారిశ్రామికవాడలో పిఒటి భూములకు చెల్లించిన (జిఒ నంబర్ 203) తరహాలో తమకూ పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
కడప జిల్లాకు చెందిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్ కంపెనీ రూ.4,194 కోట్ల పెట్టుబడితో ఐదు వేల మందికి ఉపాధి కల్పిస్తామనే పేరిట ట్రాన్స్ ఫార్మర్, కండెన్సర్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ప్రభుత్వం 1292 ఎకరాలను కేటాయించింది. ఎపిఐఐసికి చెందిన 466.35 ఎకరాలు, కొప్పర్తి పారిశ్రామికవాడ సమీప గ్రామాలైన కొప్పర్తి గ్రామంలో 107 ఎకరాలు, తాడిగొట్లలో 754 ఎకరాలు, అంబవరంలో ఐదు ఎకరాలు పిఒటి భూముల సేకరణకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈ ఏడాది ఏప్రిల్ నాలుగున ఎపిఐఐసి కేటాయించిన భూములకు ఎకరానికి రూ.ఎనిమిది లక్షల చొప్పున రూ.3.73 కోట్లను ఇఎండి సైతం చెల్లించింది. పిఒటి భూములకు కూడా ఎపిఐఐసి తరహాలోనే పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం గానీ, ట్రాన్స్ ఫార్మర్ల కంపెనీ గానీ పరిహారం చెల్లించకుండానే కంపచెట్లు తొలగింపు పనులు చేపట్టింది.
ఇదిభూములు కోల్పోయిన రైతుల్లో ఆందోళన కలిగించింది. తమ భూములను చదును చేసి రోడ్లు వేయడం ఏమిటని బాధిత రైతులు అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విశాఖలో పిఒటి భూములకు ఇచ్చిన నష్టపరిహారంపై ఆరా తీస్తామని చెప్పి అక్కడి నుంచి అధికారులు వెనుదిరిగారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ పరిహారంపై అధికారులు ఎటువంటి ప్రకటన చేయలేదు.
పరిహారం చెల్లించే వరకూ పోరాడుతాం : యర్రగుంట్ల ఓబుల్ రెడ్డి రైతు, తాడిగొట్ల.
కొప్పర్తి పారిశ్రామిక వాడ పరిధిలోని సర్వే నెంబర్ 458/3లోని మూడెకరాల భూమికి పరిహారం చెల్లించే వరకూ పోరాడతాను. ఈ సమస్యపై కలెక్టర్ ను చాలాసార్లు కలిసి విన్నవించాం. ఎటువంటి ఫలితం లేదు.
సత్వరమే పరిహారం చెల్లించాలి : ఎం.రామకృష్ణారెడ్డి, రైతు, కొప్పర్తి.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిహారం చెల్లించాలి. 208/1/2 సర్వే నెంబర్ లోని 7.66 ఎకరాలకు సంబంధించి పాసుపుస్తకాలు రిజిస్ట్రేషన్, దస్తావేజులు, లింకు డాక్యుమెంట్లు అన్ని ఉన్నప్పటికీ పిఓటి పేరిట ఇబ్బం దులు పెట్టడం తగదు.








కామెంట్‌లు (0)